తూరవానల తోరణంబున తోషణాతిశయంబునన్
తోరమౌ తరువిత్తనంబులు తోపుగా మొలకెత్తగన్
తీరు తీరు పతేరజాతులు తేమ తెంచుచు తూగగన్
దారుణీ ద్రుమదృశ్య సంపద దైవమే దయచేయగన్
పిండిలంబులు మండలంబున వింగడంబుగ నాడగన్
కొండనిండ ప్రకాండముండగ కొంగ లండగ జేరగన్
బండలందున మెండు వెండిగ పాండువున్ పడవేయగన్
అండదండ శిఖండి దండిగ నాడి దండున కాలిడన్
దారులందున హారమై హరితంబుతో తరులూగగన్
సౌరుతో చిరునవ్వు తీరున సానువుల్ తరియించగన్
పారజూడగ నూరిమేరలు పచ్చరంగును రుద్దగన్
భారమెంచక దూరతీరపు బాటసారులు సాగగన్
అంతులేని హరిత్తు తోటల అంతలయ్యెను చిత్తుగన్
చింతలేక పతత్రముల్ కడు చిత్ర తచ్చన లాడగన్
పంతుతో తలలూపి నృత్య ప్రభావ మంతయు చూపగన్
వింత వింత వినూతనత్వము విస్తరించెను పృథ్విలోన్