పుడమి గర్భంలోని జీవాన్ని హరిస్తున్నది కలుపు కాదు, కలుపును చంపేందుకు మానవులు చేస్తున్న చర్యలే. దానికి మూలకారణం గ్లైఫోసేట్’ అనే నాన్-సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది వాడిన భూమిలో జీవమనేదే మిగలదు. ఈ రసాయనం పడిన చోట మట్టి శ్వాస కూడా తీసుకోలేదు. పంటల మీద పడితే మాడిపోతాయి. ఆ మందు వాడిన గడ్డిని తినే మూగజీవాలు సైతం చనిపోతాయి. రైతులు తీవ్ర అనారోగ్యాల బారినపడతారు. భూమిలో జీవానికి, భూమిపై మానవాళికి పెనుముప్పుగా మారిన ఈ గడ్డి మందును చాలా దేశాలు నిషేధించాయి. కానీ, మన దేశంలో మాత్రం యథేచ్ఛగా క్రయవిక్రయాలు జరుగుతుండటం శోచనీయం.
అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ 1970లో మొదటిసారిగా గ్లైఫోసేట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది మొక్కల్లోని ఒక ముఖ్యమైన ఎంజైమ్‌ను నిరోధించి, మొక్కల ఎదుగుదలను అడ్డగిస్తుంది. దీన్ని ప్రధానంగా కలుపు నివారణ కోసం వాడుతున్నప్పటికీ, ఇది పంటలు, మట్టిలోని ఇతర జీవులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కూలీల ఖర్చులను తగ్గించేందుకు రైతులు గ్లైఫోసేట్ను విస్తృతంగా వాడుతున్నారు. కలుపును నివారిస్తున్నట్టు అన్నదాతలు భావిస్తున్నారు.
కానీ, దీర్ఘకాలంలో భూసారం తగ్గిపోయి దిగుబడి పడిపోతుంది. అంతేకాదు, కర్షకులు కూడా రోగాల బారినపడి అనవసర ఖర్చుల భారం మోయాల్సి వస్తుంది. గ్లైఫోసేట్ పిచికారి మూలంగా నెలకు సగటున 12 మంది రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్టు 2023లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఎయిమ్స్ నివేదిక ప్రకారం.. గ్లైఫోసేట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గర్భస్థ శిశువుల వృద్ధిలో లోపాలు 18 శాతం వరకు పెరిగాయి.
గ్లైఫోసేట్ వల్ల మట్టిలోని ఫంగై, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నశించి హ్యూమస్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఇది కార్బన్ నిల్వల తగ్గుదలకు దారితీసి, గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని పెంచుతుంది. తద్వారా వాతావరణ మార్పులకు ఇది పరోక్షంగా కారకమవుతుంది. దీని వాడకం గణనీయంగా పెరగడం వల్ల వాతావరణంపై దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐరాస ఐపీపీసీ-2022 నివేదిక స్పష్టం చేసింది.
జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఈ రసాయనంపై నిషేధం కొనసాగుతున్నది. 2018లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీపై ఓ రైతు కేసు వేశాడు. దుష్ప్రభావాలు ఉన్నట్టు రుజువు కావడంతో సదరు రైతుకు 289 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అమెరికాలో ఈ కంపెనీపై ఇప్పటివరకు ఇలాంటి కేసులు లక్షకు పైగా దాఖలయ్యాయి. ఆహార పదార్థాల్లో గ్లైఫోసేట్ అవశేషాలు ఎక్కువవుతున్నాయని కెనడాలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
2022 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం దీనిపై పాక్షిక నిషేధం విధించింది. కానీ, అది నామమాత్రమే. రసాయన కంపెనీల ప్రలోభాలకు లోనై పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు దీని వినియోగాన్ని ప్రోత్సహిస్తుండటం విషాదం. ఏపీ, తెలంగాణల్లో గతంలో 60 రోజులపాటు తాత్కాలికంగా నిషేధించారు. కానీ, ప్రస్తుతం ఇది మార్కెట్లలో విచ్చలవిడిగా లభిస్తున్నది. తమకు అధికారం లేకపోయినా కేరళ, సిక్కిం లాంటి రాష్ర్టాలు రాజకీయ సంకల్పంతో శాశ్వత నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కానీ, ఏపీ, తెలంగాణల్లో మాత్రం ఆ సంకల్పం కొరవడింది.
ఈ రసాయనాన్ని వినియోగిస్తున్న రైతులు ఆర్థికంగా, శారీరకంగా చితికిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, పరిశోధన సంస్థలు తమ బాధ్యతను మరిచి కార్పొరేట్ కంపెనీల ప్రలోభాలకు తలొగ్గడంతో అన్నదాతల జీవితాలు ఆవిరైపోతున్నాయి.
ఇప్పటికైనా గ్లైఫోసేట్పై శాశ్వత నిషేధం విధించాలి. జీవ, సేంద్రియ కలుపు నివారణ పద్ధతులను అభివృద్ధి చేయాలి. రైతులకు అవగాహన కల్పించాలి. రైతు శ్వాస ఆగకూడదంటే, మట్టిలో జీవం కొనసాగాలంటే, భవిష్యత్తు పంటల భద్రత కోసం ైగ్లెఫోసేట్కు శాశ్వతంగా చరమగీతం పాడాలి. ఒక్క రైతే కాదు, మట్టి, ఒక తరం, దేశ భవిష్యత్తే ప్రమాదంలో ఉంది. దీన్ని మౌనంగా చూస్తూ ఉంటే మనం కూడా మట్టి గొంతు పిసికినవాళ్లమవుతాం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు జీవరక్షణ యజ్ఞాన్ని ప్రారంభించాలి.
-వ్యవసాయ నిపుణులు జి.అజయ్ కుమార్