తెలంగాణ అంటేనే పోరుగడ్డ. తెలంగాణ అంటేనే ఉద్యమాలకు చిరునామా.. పోరాటాలకు కేరాఫ్ అడ్రస్. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలకుపైగా జరిగిన అన్యాయంపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దంన్నరపాటు సుదీర్ఘ పోరు సలిపింది. నడిసంద్రంలో చిక్కుకున్న నావలా… గమ్యం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను దరికి చేర్చేందుకు కేసీఆర్ ఎంచుకున్న ఉద్యమ పంథా మహాసభలు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలించినట్టు.. ఉద్యమ సారథి కేసీఆర్ నిర్వహించిన ఒక్కో సభ లక్షలాది మందిని ఏకం చేసింది. మూడున్నర కోట్ల మందిని ఆశయ సాధన దిశగా నడిపించింది. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది. సభలు నిర్వహించి, విజయవంతం చేయడం ఒక ఆర్ట్ అయితే, కేసీఆర్‌ను మించిన ఆర్టిస్ట్ ఎవరుంటారు. అందులో పేటెంట్ గనుక ఇవ్వాల్సి వస్తే ఆయనకు గాక మరెవరికి ఇస్తారు.
తెలంగాణ రాష్ట్ర కాంక్షను రగిలించేందుకు, తెలంగాణవా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ఎంచుకున్న అస్త్రం మహాసభలు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎ స్ను స్థాపించిన కేసీఆర్ నాటి నుంచి గమ్యాన్ని చేరేవరకు అనేక సభలు నిర్వహించారు. అందులో కొన్ని సభలు తెలంగాణ ఈతి బాధల్ని చాటిచెప్పగా.. మరికొన్ని సభలు తెలంగాణ గతిని మార్చాయి. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. 20 రోజులకే కరీంనగర్ వేదికగా మొదటి బహిరంగ సభ జరిగింది. 2001 మే 17న జరిగిన సింహగర్జన వేదికగా కేసీ ఆర్ సింహనాదం చేశారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా రు. తెలంగాణవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఎం తగానో దోహదపడింది.
ఆ తర్వాత పోరాటాల గడ్డ వరంగల్‌ను కేసీఆర్ తన సభలకు అడ్డాగా మార్చుకున్నారు. మహోజ్వల ఉద్యమంలో ఓరుగల్లు కేసీఆర్ వెన్నంటే ఉన్నది. ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైంది. కేసీఆర్ అడుగులో అడుగై, ఆయన పిలుపిస్తే చాలు ఓరుగల్లు ప్రభంజనమైంది. కరీంనగర్ సభ జరిగిన నెలన్నరకే వరంగల్‌లో కేసీఆర్ మరో సభ నిర్వహించారు. ఈ సభతో తెలంగాణ ఆకాంక్ష గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. కేసీఆర్ ప్రసంగాలకు ఫిదా అయిన యువత, తెలంగాణ ప్రజానీకం స్వచ్ఛందంగా ఉద్యమ జెండా ఎత్తుకున్నారు. ఈ సభ తర్వాత వెనువెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 85 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నది. రెండు జడ్పీలపై గులాబీ జెండా ఎగరేసిందంటేనే ఈ సభ ప్రభావం ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు.
ఆ తర్వాత 2003లో వరంగల్‌లో జరిగిన తెలంగాణ జైత్రయాత్ర సభ టీఆర్ఎస్ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మరుసటి ఏడాది 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇటు తెలంగాణలో, అటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ సభ దోహదం చేసింది. టీఆర్ఎస్ అండతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు కాంగ్రెస్ కుటిలయత్నం చేసింది. దీంతో తెలంగాణవాదానికి అగ్నిపరీక్ష ఎదురైంది. అలాంటి విపత్కర సమయంలో 2007లో వరంగల్ వేదికగా జరిగిన తెలంగాణ విశ్వరూప సభ సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణవాదం ఎన్నటికీ అమ్ముడుపోదని లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు ఎలుగెత్తి ప్రపంచానికి చాటారు.
2010లో కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన కాకతీయ విద్యార్థి పొలికేక సభ యావత్ విద్యార్థి లోకాన్ని ఉద్యమం దిశగా కార్యోన్ముఖులను చేసింది. ఆ తర్వాత మరో కీలక ఘట్టానికి ఓరుగల్లు వేదికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, వెంటనే యూటర్న్ తీసుకున్న కేంద్రానికి తెలంగాణ సత్తా చాటేందుకు మరోసారి ఓరుగల్లుకు అవకాశం దక్కింది. 2010 డిసెంబర్ 16న వరంగల్ వేదికగా జరిగిన తెలంగాణ మహాగర్జన సభ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
లక్షలాదిమంది ‘జై తెలంగాణ’ నినాదాలకు వేదికైన ఈ సభ గిన్నిస్ బుక్ రికార్డుల్లోనూ ఎక్కింది. అంతకుముందు అదే ఏడాది రాల్లెత్తిన మానుకోట ఉద్యమానికి ఊపిరులూదింది. ఇలా వరంగల్ వేదికగా జరిగిన ప్రతీ సభ, ప్రతీ ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో అపురూపమనే చెప్పాలి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జరిగిన అనేక కీలక ఘట్టాలకు ఓరుగల్లు ఆయవుపట్టుగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఒక్కో సభ ఉద్యమ చరిత్రలో ఒక్కో మహోజ్వల ఘట్టమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ రజతోత్సవం రూపంలో ఓరుగల్లు మరో పోరు సభకు వేదిక కానున్నది.
60 ఏండ్ల పోరాటం, ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ నేడు మళ్లీ బలి దేవత చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ బతుకులు మరింత బాగుపడాలని ఆశించిన రైతన్నలకు బతుకే లేకుండాపోయింది. రోజుకో రైతు చొప్పున కాంగ్రెస్ సర్కార్ దాష్టీకానికి బలవుతున్నారు. హక్కుల కోసం నినదిస్తున్న విద్యార్థులపై లాఠీలు విరుగుతున్నాయి. చేసేందుకు పనుల్లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలు పస్తులు ఉంటున్నారు. గ్రామాలు అరిగోస పడుతున్నాయి. అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమానికి సడుగులిరిగాయి. హైడ్రా, మూసీ ప్రాజెక్టు పేరిట ఇండ్లు కోల్పోయిన పేదల ఆక్రందనలు, హెచ్‌సీయూలో కాంగ్రెస్ సర్కారు చేసిన విధ్వంసంతో గూళ్లు కోల్పోయి, జేసీబీల కింద నలిగిన మూగజీవాల అరణ్య రోదనలతో రాష్ట్రం
రావణకాష్ఠాన్ని తలపిస్తున్నది.
రేవంత్‌రెడ్డి చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు మళ్లీ తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూడేండ్లు గడుస్తాయి, ఎప్పుడు సంక్షేమ సర్కార్ వస్తుందా..? అని భవిష్యత్తు మీద ఆశతో బతుకులీడుస్తున్నారు. ఈ తరు ణంలోనే నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనున్నది. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో స్వచ్ఛందం గా ఉద్యమ జెండా చేతబూని, ఓరుగల్లు బాట పట్టినట్టే.. నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ తోవ పట్టేందుకు ప్రజలు సమాయ త్తమవుతున్నారు. వరంగల్‌కు బండెనక బండి కట్టేందుకు సిద్ధ మవుతున్నారు. కూలీనాలి చేసి, రూపాయి రూపాయి కూడగట్టి బీఆర్ఎస్ సభకు తమ వంతుగా సాయం అందించారు.
ఆదిలా బాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామ ప్రజలు లక్ష రూపాయలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామస్తులు కూలి పనులకు వెళ్లి సభకు వెళ్లేటప్పుడు తొవ్వ ఖర్చులకు పది వేల రూపాయలు సమకూర్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా లక్షలాదిమంది ప్రజలు రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్ర గతిలో ఈ సభ మరో కీలక మలుపుగా నిలవనున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రజతోత్సవ వేళ తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న విజయోత్సవానికి నిదర్శనం.
(వ్యాసకర్త: కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి)
-గంగుల కమలాకర్