గౌరవనీయులైన మీనాక్షి నటరాజన్ గారికి…
పాదయాత్రలో భాగంగా మా అందోల్ నియోజకవర్గానికి వస్తున్న మీకు నా ప్రజల తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె కూడా అభివృద్ధి పథంలో నిలబడింది. పదేండ్లలో ఎనలేని అభివృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది. అయితే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు మీకే ఓటు వేసి ఒక అద్భుతమైన విజన్ కలిగిన కేసీఆర్ నాయకత్వాన్ని కూడా కాదనుకున్నారు. ఈ సందర్భంలో 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. పాదయాత్రల వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా అంటే ఒక్క వైఎస్‌ను మాత్రమే గుర్తుచేస్తుంటారు అక్కడక్కడా. కానీ, మీరేం ఆశించి పాదయాత్ర చేస్తున్నారో తెలియదు కానీ కొన్ని విషయాలు పెద్దలైన మీ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటారని, వాటివల్ల మా ప్రాంతానికి మా ప్రజలకు కొంత మేలు జరుగుతుందని ఆశతో ఈ కింది విషయాలను మీకు తెలియజేస్తున్నాను.
మేడమ్, మీరు చేస్తున్న ఈ పాదయాత్ర జాతీయ రహదారుల పైనుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి చేస్తే మీకు మంచి అవగాహన కలిగేది. ఎందుకంటే మీరు నడిచే దారిలో రైతులను పలకరిస్తుంటే వారు మీ ప్రభుత్వం పాలన గురించి ఎలా ఫీల్ అవుతున్నారో మీకు ప్రత్యక్షంగా తెలిసేది. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులు ఎలా సంతోషంగా ఉన్నారో… ఈ 18 నెలల కాలంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అమలు ఎలా జరుగుతుందో, గంటకోసారి పోయే కరెంట్ గురించి మీకైనా తెలిసేది. వాళ్ల బాధనో సంతోషాన్నో మీరు ప్రత్యక్షంగా తెలుసుకొనే అవకాశం కలిగేది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మేడమ్ పక్కనే ఉన్న సంగుపేట గ్రామం నుంచి లేదా ఇటువైపున్న చందంపేట వైపు నుంచైనా మీ పాదయాత్ర సాగి ఉంటే గ్రామాల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త శిథిలావస్థకు చేరుతున్న డంప్‌యార్డ్, తాళాలు వేసిన గ్రామపంచాయతీ భవనాలు మీకు కనిపించేవి. సంగుపేట నుంచి ముందుకుపోతుంటే మీకు ఇంకో గ్రామం వస్తది. ఆ గ్రామం పేరు ఎస్ ఇటిక్యాల. దానిచుట్టూ కొన్ని దళిత కుటుంబాలుంటాయి. మీరు అక్కడికి వస్తారని వారు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దళితబంధు ప్రవేశపెట్టిన కేసీఆర్ కొందరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చారు. ఇంకో 11 వందల మంది లిస్ట్ ఫైనల్ అయి ఆ డబ్బు కలెక్టర్ ఖాతాలోకి వచ్చి ఉన్నది. ఇప్పుడు అక్కడున్న వాళ్లందరూ మీ పార్టీ ఇస్తానన్న రూ.12 లక్షల దళితబంధు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సంగుపేట నుంచి ముదిమాణిక్ గ్రామానికి వెళ్తుంది. అలా వెళ్లే ఆ రోడ్డుపై గజం లోతు గుంతలు చూసి ఇది మా ప్రభుత్వమేనా అని మీరు ఆశ్చర్యపోయేవాళ్లు. మన ప్రజాపాలన ప్రజల సౌకర్యాల మీద మీ అధిష్ఠానానికి ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చేవారేమో.
సరే మేడం ఇదంతా మా నియోజకవర్గం ప్రజల బాధలు. మేము కోరుకున్నట్టు మీ పాదయాత్ర సాగదు కదా! మీ పార్టీ నిర్దేశించినట్టు మీరు ముందు అనుకున్న తీరుగానే మీ పాదయాత్ర సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగుతుంది సంతోషం. ఇప్పుడు అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు ఓ కన్నేయండి.. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, దామోదర రాజ నరసింహా ఎమ్మెల్యే అయిన తర్వాత, తను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా ఈ కార్యాలయంలోకి అడుగు పెట్టలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది స్థానిక ప్రజలు సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే ఒక పరిష్కార కేంద్రంగా భావిస్తారు. కానీ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గ ప్రజల బాధలు కష్టాలు చెప్పుకోవద్దంటూ గత రెండేండ్లుగా తాళాలు వేసి ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేవిధంగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగుల జీతాలు పెంచిన కేసీఆర్‌ను కాదని ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ మాజీ ఉద్యోగుల వేదనను వినండి. అట్లాగే ఈ భారతదేశానికి పునాదిలాంటి వాళ్లు భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే మేధస్సు కలిగిన యువతరాన్ని, నిరుద్యోగులను కూడా కలిసే ప్రయత్నం చేయండి వారి వేదన, ఆవేదన వర్ణనాతీతం. నిజంగా మీరు వారితో మాట్లాడితే గనుక ఆ క్షణమే వాళ్లతో కలిసి మీరూ పోరాటానికి సిద్ధపడుతారు.
చివరగా… ఏ హోదా లేకపోయినా మీకు ఎదురేగి సెల్యూట్ చేసే పోలీస్ అధికారులు మిమ్మల్ని రెండు రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. దాంట్లో అనుమానం లేదు. అయితే మీ రాహుల్‌గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడో, రాజ్యాంగం ప్రజలకు ఏమిచ్చిందో ఒకసారి పోలీసులకు చెప్పండి మేడం. రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిందని, రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని, ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్లు ఆచరించొచ్చు అని, ఎవరికి నచ్చిన రాజకీయాలు వారు ప్రచారం చేసుకోవచ్చని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వాళ్లకు చెప్పండి మేడం. ఈ హక్కుల కోసమే మన నాయకుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టి తిరుగుతున్నాడని ఒక్కసారి అక్కడున్న పోలీస్ అధికారులకు చెప్పండి మేడం. ఎందుకంటే తప్పులను ఎత్తిచూపితే, వాటిని ప్రశ్నిస్తే ఇంటిముందు పోలీసులు ప్రత్యక్షమవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే చాలు పిలిచి బెదిరిస్తున్నారు. దయచేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటానికి మీరైనా చొరవ చూపుతారని ఆశిస్తున్నా. మీకు ఈ లెటర్ రాస్తున్న సమయానికే మా పార్టీ మైనారిటీ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి అక్రమంగా నిర్బంధించారు. అంటే, మీ ప్రజా పాలన ఎలా ఉందో ప్రత్యక్షంగా చూసి తరించండి మేడం.