‘వినాః స్త్రీ యా జననం నాస్తి.. వినాః స్త్రీ యా గమనం నాస్తి.. వినాః స్త్రీ యా జీవం నాస్తి.. వినాః స్త్రీ యా సృష్టి యేవ నాస్తి….’స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు సృష్టే లేదు. మనకు జన్మనిచ్చిన తల్లి ఒక స్త్రీ. మనకు బాల్యంలో తోడుగా ఉన్న తోబుట్టువూ ఒక స్త్రీనే.
నేటి ఆధునిక సమాజంలో మహిళ ఒక పైలట్‌గా, అంతరిక్ష వ్యోమగామిగా, డాక్టర్‌గా, పోలీసుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఆర్మీగా, వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా అన్నిరంగాల్లో నేడు ‘స్త్రీ’ రాణిస్తున్నది. మహిళలు మగవారికి దీటుగా ‘సరిలేరు స్త్రీ కెవ్వరు’ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. అందుకే ‘సింగరేణి సంస్థ’ పురుషులకే పరిమితం అనుకున్న మైనింగ్ రంగంలో అవకాశం ఉన్నచోట పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. సింగరేణి తన 134 ఏండ్ల చరిత్రలో వేలాది మంది మహిళలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకున్నది. మహిళలకు సింగరేణిలో ఉన్నత స్థానాలను కల్పించింది. సింగరేణి ప్రారంభంలో, ముఖ్యంగా బ్రిటిష్ యాజమాన్యంలో మహిళలను బొగ్గు వెలికితీసే పనుల్లో వినియోగించేవారు. కాలక్రమేణా మైనింగ్ వ్యవహారాలను పురుషులకే పరిమితం చేసింది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థలో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ సింగరేణిలో మహిళల సంఖ్యను మరింత పెంచింది. హైకోర్టు సూచించడంతో కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వేలాదిమంది ఆడబిడ్డలు వారసత్వం ఆధారంగా సింగరేణి ఉద్యోగంలో చేరారు. వారివారి అర్హతలు, అవకాశాల ఆధారంగా విధులు నిర్వహిస్తూ సింగరేణి ప్రస్థానంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.
ఒంటరి మహిళలు, వివాహిత కూతుళ్లకు కూడా వారసత్వ ఉద్యోగం లభించింది. కొడుకులకు సమానంగా అవివాహిత ఆడబిడ్డలకు సైతం వారసత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు పెండ్లి అయిన కూతురు, వితంతు కూతురు, భర్త వదిలేసి ఒంటరిగా పుట్టింట్లో ఉంటున్న కూతుర్లకు సైతం తండ్రి అనారోగ్యం పాలైతే అతని స్థానంలో కూతుర్లకు ఉపాధి కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికిగాను సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, ఒక మహిళగా, తెలంగాణ బతుకమ్మగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి అనిర్వచనీయం. మొత్తంగా సింగరేణి మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తూ ‘స్త్రీ’ శక్తికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
డైరెక్టు రిక్రూట్మెంట్, డిపెండెంట్, ప్రత్యక్ష పద్ధతిలో ఉపాధి కల్పించడమే కాదు, సింగరేణి ఉద్యోగుల కుటుంబంలోని మహిళల, సింగరేణి ప్రాంతంలో స్థిరపడ్డ ఇతర మహిళలకు వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నది. తమ కాళ్లపై సొంతగా నిలబడేలా సింగరేణి సేవా సమితి ద్వారా ఇప్పటికే శిక్షణ పొందిన వేలాదిమంది బోటిక్, లేడిస్ టైలరింగ్, బ్యూటీ పార్లర్లు ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా పరోక్షంగా ఇంకొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. కుట్లు, అల్లికలు, జూటు బ్యాగుల తయారీ, వివిధ రకాల స్వయం ఉపాధి అవకాశాల్లో మహిళలకు సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ప్రోత్సాహం కల్పిస్తున్నది. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైనది మహిళా సాధికారత. అందుకే దేశంలో మరే సంస్థలో లేనివిధంగా ఉద్యోగుల భార్యలు, పిల్లలకు ‘సింగరేణి’ అంటే ఎనలేని గౌర వం. ‘సింగరేణి’ తెలంగాణ కొంగు బంగారం.
(వ్యాసకర్త: సింగరేణి ఉద్యోగి)
-ఎరబెల్లి ప్రదీప్ రావు
99660 89696