రామయ్య పొద్దుపొద్దుగాల్నే పండ్ల పుల్లేసుకుని ఆగమాగమైతాండు. ఎటో పొయ్యేందుకు రడీ అవుతున్నట్టు మాత్రం తెలుస్తాంది. మందలిస్తే ఏమంటడో అని అనుమానపడ్తూనే ‘రాత్రి నాలుగు సిన్కులు రాలినై కదా నీళ్లు వందర్లవడి పోకుండా సూసొస్తడో ఏందో..’ అని ఇంటావిడ గింత చాయ తాగిపోరాదు.. అంటూ పిలిసింది. ‘నేను మల్లత్త అర్జంట్ పనున్నది’ అనుకుంట బజార్లకు పోనేపోయిండు. ఏగిరం ఏగిరంగా ఉర్కుతనే ఉన్నడు.
దారంటి పోతాంటే రామయ్య ఆత్రుత సూసిన రాయమల్లు ‘ఏమైందిరా రాములు… పండ్లు తోముకుంట ఏగిలివారంగనే ఎటో ఆగమాగంగా పోతానవ్..” అన్నా కూడా పట్టించుకోకుండా పోతనే ఉన్నడు. అయినా ఊర్కోకుంట ‘మందలిత్తే కూడా మాట్లాడకుంట పోతనే ఉన్నవ్.. ఏమైందిరా రామ..’ అంటూ మల్లోసారి గట్టిగనే అన్నడు రాయమల్లు. ‘ఏమవుడేందే.. నాటేసేందుకు ఇయ్యాల ట్రాక్టరస్తాంది. కూలోల్లకు గుత్తకిచ్చేందుకు ఆగమ్మతో మాట్లాడినం. నిన్ననే ఒడ్లు చెక్కుడైంది. నారు పీకేటందుకు ఇగ వత్తరు. మొన్న సేటు దగ్గరికిపోతే ఇయ్యాల పిండి బత్తాలకు రమ్మన్నడు. పోకపోతే మల్ల నా జిమ్మేదార్ లేదని జెప్పిండు. ఆ యాళ్లంతా నిలబడ్డదంతా పోతదని గింత పనున్న ఉర్కుడైతాంది’ అనుకుంటనే జంగలేత్తనే ఉన్నడు రామయ్య.
సాధించడం అంటే ఇంకా మెరుగ్గా చూపాలి కానీ, ఎవరి మీద కోపంతోనో, ఇంకెవరికో పేరొస్తుందనో ‘సాధింపు’నకు దిగడం ఏంటి? దశాబ్దాల కాలంగా దగాపడి, దండుగనుకున్నా విడిచి ఉండలేక, ముంచినా.. తేల్చినా భూదేవరే అనుకుని పట్టుకొని వేలాడిన బక్క పల్చని భూమి పుత్రులు ఎందరో.. ఎందరెందరో!
నమ్మిన అమ్మ వంటి మట్టిలోనే బొర్లుతూ.. వేరోటి చేయడం ఇష్టం లేక అందరికి అన్నం పెట్టేందుకు కడుపులు మాడ్చుకున్నారు.. బతుకులు కాల్చుకున్నారు. తలాపునే సముద్రం ఉన్నా శాప దూపకు ఏడ్చేలా చేసిన బతుక నేర్చిన స్వార్థపుగాళ్ల బండారం బయటపెట్టి సంసారం సక్క బెట్టే దందుకు సన్నటి మనిషి చెయ్యాల్సినంత చేసిండు.
బుక్కెడు బువ్వ తప్ప ఏమీ ఆశించని హలం కార్మికుడికి ఏదన్నా చేస్తేనే బతుకులు బాగుపడుతాయి. రాష్ట్రమూ రాణిస్తుందని ఆలోచన చేసిండు. నెర్రెలు బారిన భూమికి బుక్కెడు నీళ్లు తాగిద్దాం.. సాగుకు బాస్తున్న రైతుకు కావాల్సినవి ఇద్దామని కాయిసు పడ్డడు. పదేండ్లు ఇరాము లేక ఏమేం చెయ్యాల్నో చేసిండు. పగటిల్లి కరెంట్.. కావాల్సినన్ని విత్తనాలు.. సరిపడా ఎరువులు.. సర్వం సమకూర్చిండు. సాగు సంబురం ఎట్లుంటదో చూపిండు.
సద్ది పట్టుకొని ఓట్లపొంటి చేనుకుపోవాల్సిన రైతన్న సేట్ల దుకాణాల ముందు సొడిపడ్తాండు. బిడ్డసొంటి పంటను సూసుకుంటూ పొద్దంతా గడపాల్సిన మనిషి గొడ్డుగోదను, పెండ్లాం పిల్లల పట్టింపు లేకుండా ఎరువుల కోసమని ఓ సావై సత్తాండు. అసలే పనుల సీజన్, కూలోళ్ల కొరత, నాట్ల ఊపందుకున్నది. పోసిన నార్లు ముదురుతున్నయ్. కాలం ఇంకా అందుకోలే, కరెంట్ సక్కగా ఉండేది లే.
చెర్లలో నీళ్లు లేవు, బావుల్లోకి ఊట దిగింది కాదు.. వచ్చిరాని కరెంటు.. రాలుతున్న నాలుగు సినుకులు.. మడికట్టు తడుపుకుంటూ రోజుకో దిక్కు నీళ్లు ఎగేస్తూ దున్నుడెప్పుడు కావాలే, నాటెప్పుడు పడాల్రా దేవుడా… అని గుబులుపడుతున్న అన్నదాత. గిసొంటి గందరగోళంల, సక్కగ కూసోని తినడానిక్కూడా టైంలేని రైతన్న అన్నీ ఇడ్సిపెట్టి పనీపాటా లేనోని లెక్క పిండి బత్తాల కోసం పొద్దంతా పడిగాపులు పడాల్సి రావట్టె.
చెప్పులు, గోనె తట్లు, చిన్నచిన్న బండలు, తువ్వాలలు, రంగురంగుల ప్లాస్టిక్ కవర్లు, చెత్తిర్లు, చేయి సంచులు… మళ్లా లైన్లు కడ్తానయ్. పదేండ్లు గడియ కూడా ఇరాము లేకుండా పనుల్లో మునిగిన రైతన్న ఇప్పుడు మళ్లా దుకాండ్ల ముందు గోల్లు గిల్లుకుంటూ పొద్దంతా పనికి పోతాండు.
మొన్నటి దాకా పండిన పంటకు కొనే దిక్కు లేక బావురుమన్న రైతన్న ఇప్పుడు సాగుకు సౌలతి లేక సత్తున్నాడు. కూలుతున్నదని కాళేశ్వరాన్ని చిన్నబుచ్చడంతో ఇప్పటికే డ్యామ్లు ఆట మైదానాలైనయ్. చెర్లు, కుంటలు ఇంకిన కళ్లతో ఏడుస్తున్నాయి. సాగు సాగాలంటే శావుమర్ణం అయ్యేట్టుందని భయం పట్టుకొన్న అన్నదాతకు ఇప్పుడు యూరియా కొరత ఇంకా రంది చేస్తాంది.
గతాన్ని మర్చిపోయి హాయిగా ఉంది ప్రస్తుతం అనేలా చేసుకోవడం ఉత్తముల విధానం. అందునా చెమట కష్టం తప్ప మరేమీ తెలియని కర్షకుడికి కావలసినవి సమాకూర్చితే దేవుడిగా కొలుసుకుంటాడు తప్ప, ఇంకేమీ గుర్తుపెట్టుకోడు. అలాంటి అన్నదాతకు అక్కర కొచ్చేది ఇవ్వక, అంగట్లో బొమ్మల దుకాణాల ముందు, రోడ్ల వెంట నిలబెడితే పరిస్థితి ఏం మారినట్టు. నిరుడు దాకా లేని ఎరువు కష్టాలు నేడెందుకు వచ్చాయో, అంతగా కొరత ఎందుకు ఏర్పడిందో మేధావులం అయిన మనంత తెల్వకున్నా కాస్తో కూస్తో మట్టిలో మెదిలే ఆయనకు తెలియదనుకుందామా..?
పొద్దున్న లేస్తే మొదలు పండే దాకా పక్కోడిపై పడి ఏడ్చేందుకు పోటీ పడటం.. పనులన్నీ పక్కనపెట్టి దుమ్మెత్తి పోసుకోవడమే పనిగా పెట్టుకొని సర్వాన్ని ఆగం చేసే చట్రం నుంచి బయటకువచ్చి చెయ్యాల్సినవి చేసే అవసరం ఉందా.. లేదా? మెరుగును ఆశించిన ప్రజకు ఇప్పటికే మోసం జరిగిందనే ముచ్చట తెలిసిందో, లేదో.. రచ్చబండ సాక్షిగా చర్చ జరుగుతుందో, లేదో గ్రహించాలి. అంతా చేసిన, సకలం సమకూర్చిన గతమోళ్లకే గా పరిస్థితి వస్తే.. గాయి గాయి రేపుతున్న మన గతేమని గమనించాలే. అవసరం ఉన్న పిండి బస్తాలు అదును దాటకముందే అందించి.. అన్నం మట్టిపాలు చేయక, అన్నదాతను ఆగం చేయకుంటే అదే మహా భాగ్యం.
రంగులు మార్చే రాజకీయం రైతుపై కాకుండా.. ఇంక దేనిమీదనన్న పెట్టుకుందాం. దశాబ్దం నుంచి ఎరువు ఆలోచన లేని, యూరియా కరువు ముచ్చట్లు కానరాని సాగుదారుడి ఇగనన్న సాయం కోసం సంకల్పిద్దాం. ఒకటి కాదు, రెండు కాదు.. పది కాదు, ఇరవై కాదు.. వేల టన్నుల ఎరువు కొరతను తీర్చే విషయంపై దృష్టిపెడితేనే సాగు సంబురం. లేదంటే ఇప్పటికే అటకెక్కించిన కౌలు ముచ్చట, సగం సగంగా మారిన భరోసా, ధీమా కోల్పోయిన బీమా, మొఖం మాడ్చిన ‘మద్దతు’ లెక్క.. సాగు ‘చేతి’కిల పడ్తది. నాటి సర్కార్ కల్పించిన ధైర్యం కూడా పోయి మడికట్టు మొద్దుబారుతది.