కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజుల్లో ఈ బైఠాయింపు ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ పోరాటం 2020-21లో ఢిల్లీ శివార్లలో జరిగిన సుదీర్ఘ బైఠాయింపును అనివార్యంగా గుర్తు చేస్తున్నది. పైగా అప్పుడు మూడు నల్ల వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకునే సందర్భంలో కేంద్ర పభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరుతున్నారు. అంతిమంగా ఢిల్లీని మరోసారి చుట్టుముట్టి ఆందోళనను ఉధృతం చేయాలనేది పంజాబ్ రైతుల ఆలోచన. ఒక పోరాటానికి లొంగిపోయిన సర్కారు ఇచ్చిన హామీల అమలుకు మరో పోరాటం చేయాల్సి రావడం విడ్డూరం. అంతేకాకుండా ఉపసంహరించుకున్న చట్టాల్లోని రైతు వ్యతిరేక అంశాలనే మార్కెటింగ్ ఫ్రేమ్‌వర్క్ పేరిట మరో రూపంలో తీసుకురావడానికి కేందం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఓ వైపు సరిహద్దుల్లో బైఠాయింపు కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల డిమాండ్ల కోసం ప్రముఖ రైతు నాయకుడు జగ్జీత్సింగ్ ఢల్లీవాల్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టడంతో పోరాటం కొత్త మలుపు తిరిగింది. ఆ దీక్ష 40 పైచిలుకు రోజులుగా ఖనౌరీలో సాగుతున్నది. గతంలో నాలుగుసార్లు నిరాహార దీక్ష చేసినప్పటికీ ఈసారి గమ్యాన్ని సాధించడమే లక్ష్యంగా ఆమరణం చేపట్టడం, అది సుదీర్ఘంగా సాగుతుండటం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రైతాంగంలో ఆందోళన కలిగిస్తున్నది.
సుపీంకోర్టు జోక్యం చేసుకొని సూచించినా వారితో చర్చలకు ముందుకు రాకపోవడం కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల గల ధోరణికి అద్దం పడుతున్నది. గత డిసెంబర్లో ఢల్లీవాల్ కేంద్రానికి రాసిన ఓ బహిరంగ లేఖలో రైతులకు కనీస మద్దతు ధర అనేది ప్రాథమిక జాబితా కిందకు వచ్చే పౌరుల జీవించే హక్కుతో సమానమని నొక్కిచెప్పడం గమనార్హం.
ఆరుగాలం కష్టించి పండించే పంటకు ఏ ధర లభించేదీ అగమ్యగోచరం అవుతున్న స్థితిలో నుంచి రైతుల ఆందోళన ఆవిర్భవించిందనేది వాస్తవం. ఇది ఒక్క పంజాబ్ రైతుల డిమాండే కాదు, దేశవ్యాప్తంగా అనేక పాంతాల్లోని రైతులు కోరుకునేది ఇదేనని చెప్పాలి. సాగును కార్పొరేట్ల పరం చేయాలని చూస్తున్న కేంద్ర పభుత్వం అందుకు సానుకూలత చూపడం లేదు.
రైతుల ప్రయోజనాల రీత్యా ఇప్పటికైనా కేంద్రం దిగిరావాల్సి ఉన్నది. మూడు చట్టాలను వెనుకకు తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పింది మరోసారి మోసం చేసేందుకు కాదని ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తెలియజెప్పాల్సి ఉన్నది. అందుకు అన్నదాతలతో చర్చలు జరపడం ఒక్కటే ఏకైక పరిష్కారం. రైతుల పోరాటం అంతకంతకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఢల్లీవాల్ వంటి వృద్ధ రైతు నేత ఆత్మార్పణకు సిద్ధపడ్డ పస్తుత తరుణంలో ఇది తక్షణావసరమని చెప్పక తప్పదు.