రుణమాఫీ విషయమై రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతూ, ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండగా వామపక్షాలు దొంగ నిద్ర పోతున్నాయి. వాటితో పాటు, రైతుల బాగు కోసం అంటూ చలామణీ అయ్యే ఎన్జీవో సంఘాలు, రాష్ర్టాభివృద్ధి కోసం తపించిపోతున్నామనే మేధావి బృందాలు, అన్నీ దొంగ నిద్రలు పోతున్నాయి. రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని, ఎటువంటి షరతులూ లేకుండా, ఒకే దఫాలో, తాము గత డిసెంబర్ 7న అధికారానికి రాగానే 9వ తేదీన మాఫీ చేయగలమని కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ పేపర్లపై రాసి, ఇంటింటికి తిరిగి ఇచ్చిన మాట అమలు కాలేదని వీరందరికి తెలుసు. ఆ ప్రకారం చేయని ప్రభుత్వం ఆగస్టు 15 అంటూ కొత్త గడువు పెట్టింది. అనగా గడువును 8 నెలలు పొడిగించటమన్న మాట. ఈ మూడు వర్గాల వారు బహుశా ఇది కొత్త ప్రభుత్వం గదా, ఇంకా కుదుటపడాలి గదా, ఆగస్టు 15 వరకు వేచి చూద్దామని అనుకుని ఉండవచ్చు. అదే గాని జరిగి ఉంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇపుడు ఆగస్టు 15 గడిచి మరో నెల కావస్తున్నది.
Runa Mafi | మాఫీ అరకొరగా జరిగిందని స్వయంగా ప్రభుత్వం, దానితో పాటు మంత్రులు చెప్తున్న లెక్కలతోనే స్పష్టమవుతున్నది. ఈ స్థితి వల్ల రైతులు అంతటా ఆందోళనలు చేస్తుండటమే గాక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరి వామపక్షాలు, రైతు ఎన్జీవోలు, మేధావులు తమ దొంగ నిద్ర నుంచి మేల్కొనేది ఎప్పుడు? రుణమాఫీ పూర్తయిపోయిందని ముఖ్యమంత్రి వాదిస్తుండగా, ప్రభుత్వం అధికారిక ప్రకటనలో రూ.17,000 కోట్లు మాత్రమే అన్నది. వ్యవసాయ మంత్రి తుమ్మల తాజాగా ఈ నెల 8న మాట్లాడుతూ, ఈ పంట కాలంలోనే పూర్తిచేస్తామని సెలవిచ్చారు! ఎంత అద్భుతంగా ఉంది ఇదంతా!
ఇంత జరుగుతున్నా వీరు నిద్ర నటించటానికి కారణం బహుశా ఒకటై ఉండవచ్చు. ఉభయ కమ్యూనిస్టులలో సీపీఐకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి భిక్ష అనదగ్గ విధంగా ఒక సీటు దక్కింది. స్వయంగా క్షీణించిపోయి, తమలో తమకు ఐక్యత లేక, చిరకాలంగా అసెంబ్లీలలో ఒక్క స్థానమైనా లేక, సొంత బలం పెంచుకొని గెలిచే శక్తి సామర్థ్యాలు లేక, ఎడారిలో నీటిచుక్క కోసం అంగలార్చుతుండిన ఈ పార్టీ, సీపీఎంతో తెగదెంపులు చేసుకొని అయినా ఒక సీటు సంపాదించుకోగలగటంతో, తెలంగాణలో సోషలిస్టు వ్యవస్థను స్థాపించగలిగినంతగా పరవశించిపోయింది. అయితే, కమ్యూనిస్టు పార్టీగా పరువును కాపాడుకోవాలి గనుక, సిగ్గుబిళ్ల వంటి ప్రకటన ఒకటి చేసింది.
అది, ప్రజల సమస్యలపై మాత్రం రాజీ పడబోమని. ఆందోళనలు చేస్తూనే ఉంటామని. ఇటువంటి ప్రకటనను ఎవరైనా నమ్మారేమో తెలియదు. బహుశా వారి పార్టీ వారు కూడా నమ్మి ఉండకపోవచ్చు. ఎందుకంటే, పార్టీ నాయకత్వం ప్రజల సమస్యల గురించి మొక్కుబడిగా మాట్లాడటం తప్ప, వాస్తవంలో గాలికి వదిలేసిందని, నాయకులలో అందరికీ కాకున్నా చాలామందికి తాము బూర్జువా పార్టీలని ముద్దుగా పిలిచే పార్టీలను ఆశ్రయించి సీట్లు సంపాదించటం, పైరవీలు చేయటం, డబ్బు సంపాదన, పిల్లలను బాగు చేసుకోవటం పరమలక్ష్యంగా మారిపోయిందని స్వయంగా వారి పార్టీలోని శ్రేణులే బాధపడుతూ చెప్పుకొంటున్నాయి.
ఇదంతా కొద్దిపాటి తేడాలలో సీపీఎంకు కూడా వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ విధమైన భావన సీపీఐలో సాధారణ స్థాయి అసంతృప్తిగా ఉండగా, సీపీఎంలో తీవ్రస్థాయి అసంతృప్తిగా కనిపిస్తున్నది. సీపీఐ శ్రేణులకు తమ పార్టీ ఎప్పటి నుంచో ఒక ‘గాన్ కేస్’ వంటిది. ఏ ఆశలూ లేవు. ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా సీపీఎం తమది సైద్ధాంతిక నిష్ఠ గల సంస్థ అని చెప్పుకొని వీరాలాపాలు ఆడుతూ, కార్యకర్తలకు, సీనియర్లకు కూడా ఆశాభావాలు రేకెత్తించింది. కానీ ఈ రోజున, దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ల నుంచి యువకుల వరకు, వివిధ అనుబంధ సంస్థల కార్యకర్తల వరకు ఎవరిని కదిలించినా, బయటకు మాట్లాడలేకున్నా, ఎవరైనా వారితో విడిగా కలిసి మాట్లాడితే లోలోపల రగిలిపోతున్నారు.
ఇది గమనించినప్పుడు, సీపీఐ సంగతి ‘గాన్ కేస్’ గనుక సరే గాని, సీపీఎంలోనూ ఇంత అసంతృప్తి ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. సీపీఐతో పాటు ఈ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్తో, కాంగ్రెస్తో బేరసారాలు ఆడినటువంటిదే. బేరం ఎవరితోనూ కుదరలేదు. ఆ అదృష్టం సీపీఐని వరించింది. అయితే, నిత్య సత్యం వంటి ఎర్రజెండాను ఆకాశంలో రెపరెపలాడిస్తూనే ఉండాలి గనుక, ప్రజా సమస్యలపై పోరులో రాజీ ఉండదని సీపీఐ వలెనే వీరు కూడా కార్బన్ కాపీ ప్రకటన ఒకటి చేశారు.
రైతు రుణమాఫీపై, ఆత్మహత్యలపై ఈ రెండు పార్టీలూ, తమ రాజకీయ భిక్షా ప్రదాత అయిన కాంగ్రెస్కు ఎక్కడ బాధ కలుగుతుందో అని, చిన్నపాటి స్వరంతో మొక్కుబడి ప్రకటనలు ఏవో ఒకటిరెండు సార్లు చేసినట్లున్నాయి. ఆందోళనలు మాత్రం ఏవీ లేవు. అయితే ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎందుకంటే, అసలు మౌలికంగా వీరిలో చేవ చచ్చిపోయింది. చచ్చిపోయి చాలా కాలమైంది.
ఆ వాస్తవాన్ని గ్రహించేందుకు ఎంతో వెనుకకు వెళ్లనక్కరలేకుండా, రాష్ట్ర విభజన జరిగిన 2014కు పోదాము. ఆ కొత్తలో వీరిద్దరు సమావేశమై విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఏమున్నది? తెలంగాణ వెనుకబడిన సమాజం. ఇక్కడ వివిధ వర్గాల పేదలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గడ్డకు ఉద్యమాల చరిత్ర ఉంది. ఇక్కడ కమ్యూనిస్టులకు ఉద్యమ త్యాగాల చరిత్ర ఉంది. ఈ పరిస్థితులను ఆధారం చేసుకుంటూ మనం అధికార పక్షానికి (అపుడు టీఆర్ఎస్) ప్రత్యామ్నాయం కాగలం. అట్లా కావాలి. ఇదీ వారి ప్రకటన సారాంశం.
2014 ఎన్నికలు గాక, ఆ ప్రకటన తర్వాత పదేండ్లు, మరి రెండు ఎన్నికలు గడిచాయి. ఈ కాలంలో వారు చేసిన ఉద్యమాలేమిటో, ప్రత్యామ్నాయంగా ఎదిగింది ఎంతో, ఈ రోజున పరిస్థితి ఏమిటో, అసలు ముందుగా వారిద్దరి మధ్య మిగిలిన ఐక్యత ఏ మేరకో వివరించి చెప్తే, కామ్రేడ్స్ ఇద్దరూ బాధ పడుతారు. వారి నాయకులు బాధపడితే విచారించవలసింది లేదు.
కానీ, మంచికో, చెడుకో మరి చేసేదేమిటో బోధపడకనో, సిద్ధాంతం పట్ల భక్తితో ఇంకా అక్కడ అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తలు బాధపడుతారు. దాదాపు వారంతా రైతు కుటుంబాల నుంచి, వృత్తి పనుల కుటుంబాలకు చెంది వ్యవసాయ ఆర్థిక స్థితిపై ఆధారపడే నేపథ్యం నుంచి వచ్చినవారు. రుణమాఫీ గురించి, రైతులకు పెంచి ఇస్తామన్న రైతుబంధు గురించి, రైతు బీమా గురించి, పంట బోనస్ గురించి తమ పార్టీలూ, రైతు సంఘాలూ ఈ విధంగా దొంగ నిద్రలు పోతుండటంపై వారు అయోమయంతో బాధపడుతున్నారు. మరెంత కాలానికైనా, మరెందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాతనైనా వీరి నిద్ర వదలుతుందేమో మన వలెనే వారికీ బోధపడటం లేదు. అయితే, ప్రజాస్వామ్యం ఎక్కడ అంటూ ‘బూర్జువా’ పార్టీలను ప్రశ్నించే వీరు సొం త పార్టీలోని గొంతులను తొక్కివేస్తారు గనుక, ఆ అసంతృప్తి బయటకు వినిపించటం లేదు.
రైతు ఎన్జీవోలు, మేధావి బృందాల విషయానికి వస్తే, ప్రచార రథాలకు జెండాలూపి, స్వయంగా ప్రచారాలు చేసి, బీఆర్ఎస్ను ఓడించిన ఆనందం నుంచి వారు ఇంకా తేరుకున్నట్లు లేరు. వివిధ కారణాల వల్ల వారి పరమోద్దేశం బీఆర్ఎస్ను ఓడించటమే తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడటం కాదు. రైతుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధులు, విద్యారంగం బాగుపడటం, శాంతి భద్రతలు, మత సామరస్యత, మహిళల భద్రత వంటివేవీ కాదు. అందువల్లనే ఎన్నికల సమయంలో ఉన్నవి లేనివన్నీ కల్పించి ప్రచారాలు చేసినవారు, తాము కోరుకున్న కాంగ్రెస్ పాలనలో ఏమి జరిగినా ఏమి జరగకున్నా తమ ఆనంద నిద్ర నుంచి, లేదా దొంగ నిద్ర నుంచి, మేలుకోవటం లేదు. ఎన్జీవోలలో కొందరికి రాష్ట్ర విభజన వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
దెబ్బతింటాయని తెలిసే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. చివరికి విభజనతో వారికి పట్టలేని ఆగ్రహం కలిగింది. బీఆర్ఎస్పై కక్షగట్టారు. ఆ పార్టీ పాలనలో రైతులకు ఎంత మేలు జరిగినా దానిని ఇసుమంతైనా గుర్తించకపోవటమే గాక నిరంతరం విషం చిమ్ముతూనే పోయారు. రాజకీయ కారణాలతో సీట్లు ఇవ్వక బీఆర్ఎస్పై ఆగ్రహం కలిగిన వామపక్ష రైతు సంఘాలు వీరికి తోడయ్యాయి. ఆ విధంగా ఈ ఉభయులు కలిసి కాంగ్రెస్ హామీలను ఆకాశానికెత్తారు. వాటి గురించి ప్రజలను నమ్మించటంలో తమ గురుతరమైన పాత్రను మేధావి బృందాలతో కలిసి నిర్వర్తించారు. సదరు మేధావులకు తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఫిర్యాదులు తమకుండగా వాటిని తెలంగాణ మేలు అనే ముసుగులో దాచిపెట్టారు. మేధావులకు తెలివి ఎక్కువ గనుక.
అంతవరకు ఎవరు ఆక్షేపించగలది ఏమీ లేదు. ఎవరి అభిప్రాయాలు, ప్రయోజనాల ప్రకారం వా రు వ్యవహరిస్తారు. అయితే, తాము అదంతా ప్రజల మేలు కోసం చేస్తున్నామని ప్రకటించినపు డు, ఆ తర్వాతి వ్యవహరణ ఆ ప్రకారం ఉండనట్లయితే మాత్రం, వారి ఒరిజినల్ ఉద్దేశాలనే అనుమానించవలసి వస్తుంది. పైన చెప్పుకున్నట్లు మొదటనే ఉండిన అనుమానాలు నిజమని తేలి బలపడతాయి. ఆ ప్రభుత్వం మారిన తొలి దశలోనే కాకపోయినా, తదనంతర మాసాలలో జరుగుతూ వస్తున్న పరిణామాలను గమనించినప్పుడు, జరుగుతున్నది అదే.
అటువంటి పరిణామాలలో అన్నింటి కన్న ముఖ్యమైనది రైతుల సమస్య కాగా, తర్వాతది నిరుద్యోగులది. అటువంటివి ఇంకా ఉన్నాయి గాని ప్రస్తుతానికి ఈ రెండింటి గురించి చెప్పుకుందాము. రైతుల రుణమాఫీ హామీ ఇచ్చిన ప్రకారం కనీసం ఆగస్టు 15 గడువు ప్రకారమైనా జరగలేదు. ఇంకా మిగిలిపోయిన రైతులు సగం వరకు ఉండటం ఒకటైతే (ప్రభుత్వ లెక్కల ప్రకారమే) వారి మాఫీకి సంబంధించిన విధి విధానాలు స్పష్టత లేక గజిబిజిగా ఉన్నాయి. రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. తలా ఒకటి, రోజుకొకటి చెప్తున్నారు. అనగా ఎప్పటికి తేలేది తెలియదు. ఇది ఒకటైతే, రైతుబంధు, రైతుబీమా, పంటల బోనస్ గురించి అసలు ప్రస్తావనలు లేవు. ప్రస్తుతం ఆందోళనలు, ఆత్మహత్యలు ఆగకుండా సాగుతున్నాయి. వాటితో పాటు వామపక్షాలు, ఎన్జీవోలు, మేధావుల దొంగ నిద్రలు కూడా.
నిరుద్యోగ సమస్య నిజంగానే తీవ్రమైనది. తన పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత చేసినా అసలేమీ చేయలేదని మేధావులు, ఎన్జీవోలు, నిరుద్యోగులు, కమ్యూనిస్టులు సాగించిన ఉధృతమైన ప్రచారాన్ని తట్టుకోలేకపోయింది. ఆ పార్టీ ఓటమికి వీరంతా సంతోషించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలివ్వగలమనే హామీ కాంగ్రెస్ ఇవ్వగా వీరంతా అవునవునన్నారు.
కానీ, ఇంతవరకు ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన వాటిని తన ఉద్యోగాలంటూ నిర్భయంగా అబద్ధాలు చెప్తున్నది. ఆ మాటలు అబద్ధమని స్వయంగా నిరుద్యోగులే అంటూ ఆందోళనలు చేస్తే అణచివేస్తున్నది. అయినా, మన మేధావులు, ఎన్జీవోలు, కమ్యూనిస్టులు మాత్రం నోరు తెరవటం లేదు. ఏడాది గడువులో ఇక మిగిలింది కేవలం మూడు నెలలు. అయినా మేధావులు, ఎన్జీవోలు, కమ్యూనిస్టులు తమ దొంగ నిద్ర నుంచి ఎప్పటికి మేల్కొంటారో తెలియటం లేదు.
– టంకశాల అశోక్