EVM | ‘పాచికలు ఆడుదాం రండి’ అని పాండవులను పిలిచిండు దుర్యోధనుడు. పాండవుల పెద్దన్నగా యుధిష్ఠుడు తన పరివారంతో హస్తినకు వెళ్లిండు. పాచికలు ఆడటానికి సిద్ధమై వేదికపై ఆసీనుడయ్యాడు. కౌరవాగ్రజునిగా దుర్యోధనుడు అతనికి ప్రతివుజ్జి. అతడు కూడా వచ్చిండు. కానీ.. ‘నేను ఆడ్తలేను. నా బదులు మా మామ శకుని ఆడ్తడు’ అని చెప్పి దుర్యోధనుడు తప్పుకున్నడు.
ఇది తొండి అని అనవచ్చు కానీ, ధర్మరాజు అలా అనలేదు. ఎందుకంటే.. ఆయన యథార్థకారుడు. ధర్మమే జయిస్తుందని నమ్మిన క్షత్రియుడు. శకుని ప్రతిస్థానంలో కూర్చున్నడు. అతను భ్రమకారుడు. పాశ-దిష్టాద్రి క్షుద్ర విద్యలను అవపోసన పట్టిన జిత్తులమారి ద్యూతకృత్తుడు. మాయ పాచికలను శకుని విసిరిండు. ఫలితాలను పల్టీలు కొట్టించిండు. పాండవుల సంపదను, రాజ్యాన్ని, వారి భార్య ద్రౌపదిని కురుసంతుకు దోచిపెట్టిండు.
ఐదేండ్లకోసారి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం లో ఈవీఎంలు కూడా శకుని పాచికలనే తలపిస్తున్నయి. వాటి విశ్వసనీయత, పారదర్శకతపై ప్రతిసారి దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నయి. కానీ, యుగాలు గడిచినా శకుని క్షుద్ర రీతికి హేతు ఊతం దొరకదు. తరాలు మారినా ఈవీఎం మార్మికం తీరుకు శాస్త్రీయ ఊనిక అందదు. అదేమి చిత్రమో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మోదీతో పొత్తు పెట్టుకున్న కూటమికి దక్కిన అనూహ్య ఫలాలపై జనం విస్మయం చెందుతున్నరు. శకుని పాచికలే వో పారినట్టు.. అదృశ్య సంజ్ఞలేవో ఫలితాలను పల్టీ కొట్టించినట్టు సగటు ఓటరు పుర్రెను తొలుస్తున్నది. ఆంధ్రా ఓటరు అనుమానానికి కేరళ రాష్ట్రంలో సమాధానం దొరికింది. కానీ, అది అసలు శాస్త్రీయ ఆధారమే కాదంటోంది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 17న కేరళలోని కాసర్గోడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసీ అన్ని పార్టీల నేతలను పిలిచి మాక్ పోలింగ్ నిర్వహించింది. ఆ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ తెచ్చిన ఈవీఎంలలో ఏ గుర్తు బటన్ నొక్కినా కమలం గుర్తుకే ఓట్లు పడ్డాయట. ఇదెక్కడి మోసం సారూ! అనుకుంట ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయగా.. ‘ఎహే అది ఉత్తుత్తి పోలింగేనాయే’ అని బుకాయించిందట.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో.. వేసిన ఓటు నమోదు అయిం దా? నమోదైన ఓటు లెక్కలోకి వస్తున్నదా? లేదా అని తెలుసుకునే హక్కు కూడా అంతే ముఖ్యం. బ్యాలెట్ ఓటు ఉన్నంతకాలం సగటు ఓటరు హక్కుకు ఎటువంటి భంగం లేకుండే. కానీ, ఈవీఎంలు వచ్చిన తర్వాత వేసిన ఓటు నమోదైందా? నమోదైన ఓటు లెక్కలోకి వచ్చిందా? అనేదానికి భరోసా లేకుండాపోయింది. ఓట రు ఈవీఎంలో ఓటు వేస్తాడు. అది అదృశ్య శక్తి. కాబట్టి వేసిన ఓటు పడ్డదో? లేదో? వీవీప్యాట్‌లో చూసుకుంటాడు. ఎన్నికల సంఘం మాత్రం కనిపించని ఓటునే ప్రామాణికంగా తీసుకొని లెక్కిస్తున్నది. ఓటు హక్కుదారునికి భరోసానిచ్చే వీవీప్యాట్ స్లిప్పులను మాత్రం పక్కనపెడుతున్నది. ఇదెక్కడి ధర్మం?
ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు చాలాచోట్ల పొంతన కుదరటం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ గణాంకాలే దీన్ని ధ్రువపరుస్తున్నయి. 2019 సాధారణ ఎన్నికల్లో 345 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల సంఖ్యకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నట్టు తేలింది. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ 140 పైచిలుకు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ‘ది వైర్’ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యత్యాసానికి ఈసీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతున్నది.
క్లోనింగ్‌తో అండం లేకుండానే పిండం పుట్టిస్తున్న రోజులివి. క్లౌడ్సీడింగ్తో నింగి మీది మబ్బులకు పొక్కలు పొడిసి నీళ్లు పిండుతున్న కాలమిది. టెక్నాలజీ ప్రతి ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి అప్‌గ్రేడ్ అయిపోతున్నది. 2007లో వచ్చిన తొలి ఐఫోన్ సైబర్ సవాళ్లకు తట్టుకోవడానికి టెక్నాలజీ అప్‌గ్రేడ్‌తో 17 సార్లు రూపాంతరం చెందింది. కానీ, 25 ఏండ్ల కిందటి వృద్ధ కపోతాలైన మన ఈవీఎంలు ఇప్పటివరకు అప్‌గ్రేడ్ అయినట్టు లేదు. ఇంతటి పాత మిషన్లకు సైబర్ సవాళ్లను తట్టుకొని ట్యాంపరింగ్ కాకుండా నిలబడే దమ్ముందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సాంకేతికంగా మనకంటే ముందున్న జర్మనీ, నెదర్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఈవీఎంలను ఎన్నికల్లో ఉపయోగించడాన్ని నిషేధించాయి.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మళ్లీ వెనక్కి వెళ్లి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమే. బ్యాలెట్ ఓటింగ్‌తో బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ రిగ్గింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లని ఓట్లను హెచ్చించి చూపే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో కచ్చితత్వం, వేగంతో పోలింగ్ నిర్వహించగల వ్యవస్థను రూపొందించటం అత్యవసరం. దీనికో మార్గం ఉన్నది. ఈవీఎంలో ఓటు వేశాక.. ఓటరు చేతికి స్లిప్ ఇస్తే సరి చూసుకుంటాడు. అనుమానం నివృత్తి చేసుకుంటా డు. అదే స్లిప్‌ను ఓట్ల పెట్టెలో వేయించాలి. ఈసీ ఈ స్లిప్పులను ప్రామాణికంగా తీసుకొని లెక్కిస్తే ఓటరుకు సంపూర్ణ భరోసా దక్కుతుంది.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు