తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తున్నది. ప్రభుత్వం తన ప్రగతి నివేదికను విడుదల చేస్తూ సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, మౌలిక సదుపాయాల్లో సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నది.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే నెరవేరుస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇచ్చారు. కానీ ఇచ్చిన మాటలు, చేసిన హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ పాలనకు వెయ్యి రోజులు గడిచినా ఎక్కువ శాతం హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి, ధాన్యం క్వింటాలుకు ఐదువందల రూపాయల అదనపు ధర వంటి మాటలు నెరవేరలేదని తేటతెల్లమవుతున్నది.
ధాన్యం క్వింటాలుకు అదనపు ధరను కూడా కేవలం సన్న వడ్లకే పరిమితం చేసి, యాసంగి పంటకు ఎగ్గొట్టారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అమలులో పారదర్శకత లోపించిందని, నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్ర జరుగుతున్నదని వినియోగదారులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు సేవలు నిలిపివేసి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ సమాజంలోని భిన్నవర్గాలకు ఇచ్చిన మాట తప్పిందని వివిధ పార్టీల నేతలు బహిరంగంగానే సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వానికి సొంత పార్టీలోని వర్గపోరు అతిపెద్ద తలనొప్పిగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని పలువురు సొంత పార్టీ శాసనసభ్యులే డిమాండ్ చేయడం కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలకు అద్దం పడుతున్నది.
పాత కాంగ్రెస్ నేతలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మధ్య సమన్వయం లేకపోవడం, జిల్లా నాయకత్వ పదవుల కోసం సాగుతున్న పోటీ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నది. మంత్రులు నియోజకవర్గాలకు రావడం లేదని, కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సొంత ఎమ్మెల్యేలే మైకుల ముందుకు వచ్చి వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు రావడం, సొంత పార్టీపై రేవంత్‌రెడ్డికి పట్టు సడలుతున్నది. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నది. పెట్టుబడుల సేకరణ కోసం అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం పెద్ద వివాదంగా మారింది. బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు నిరాకరించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన ప్రణాళికలో స్పష్టత లేకపోవడం వల్లే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామాలు రాష్ట్ర-కేంద్ర సంబంధాలను మరింత క్షీణింపజేశాయి. అయితే, కేంద్రంతో ఉన్న విభేదాలు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప రాజకీయం కాదని స్పష్టం చేస్తున్నది.
తాము అధికారంలోకి వచ్చిన తొలి వెయ్యి రోజుల్లోనే డబ్బు వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు పోతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించి వేల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చామని నమ్మబలుకుతున్నది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ, ప్రభుత్వ గణాంకాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య పెద్ద వ్యత్యాసం కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్‌కు మరిన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
-సూర్యదేవర రామకృష్ణ