అప్పటిదాకా సర్పంచ్ కూడా కాదు. కనీసం వార్డ్ మెంబర్ అయినా కాలేదు. అసొంటోడిని ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల కిందటనే అసెంబ్లీ పక్ష నేతను చేసింది. పార్టీలో పెద్దాయన తన పెద్దకొడుకు అంతటి గౌరవం ఇచ్చారు. పార్టీలో ఎందరో సీనియర్లున్నా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందువరుసన అగ్రనేతగా నిలబెట్టారు. రాష్ట్రం వచ్చినంక ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి కీలకశాఖకు తొలి మంత్రిని చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చినాక మునుపటిలాగే మరో కీలకశాఖను కట్టబెట్టారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, రెండుసార్లు కేబినెట్లో కీలక మంత్రిగా చేసింది. పార్టీ ఒక్కో మెట్టుగా అందలమెక్కించింది. తనకు కలిసివచ్చిన అవకాశాలను బలంగా భ్రమించారు. ఈ స్థాయికి తీసుకువచ్చిన పార్టీని, అధినేతను యాదిమరిచి ఇక తానే పార్టీకి హోల్‌సేల్ టేకేదార్నని ప్రకటించుకున్నారు. ఈ అహంకారం పార్టీలో సీనియర్లకు, శ్రేణులకు ఎంతమాత్రం రుచించలే దు. అక్కడినుంచి మొ దలైంది పతనం. పార్టీ పెట్టి తనే సీఎంను కావాలని కలలుగన్నారు. తన వెంట పొలోమంటూ వచ్చేస్తారనుకుంటే… ఏ ఒక్కరూ కనీసం తొంగి కూడా చూడలేదు. తన రాజకీయ పూర్వాశ్రమంలో నమ్మిన ఎర్రజెండా మైండ్‌సెట్‌ను పక్కనపెట్టి కాషాయం కండువాను కమ్మగా కప్పుకున్నారు.
అప్పటికి గానీ తత్వం బోధపడలేదు. అప్పటికే అక్కడ అడ్డా జమాయించిన మహా ముదర్లు.. పార్టీ సిద్ధాంత మూలాల్లేవని అల్లంతదూరాన నిలబెట్టారు. రాష్ట్ర పార్టీకి తననే అధ్యక్షుడిని చేస్తారనుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగింది. పార్టీ పెద్దలు కల్పించిన ఆశలు అలాంటివి మరీ. అధ్యక్షుడు కాదు కదా, కనీసం సభలో ఉన్న ముగ్గురికైనా తననే లీడర్‌ను చేస్తారని ఆశపడ్డారు. దీనికీ కారణం లేకపోలేదు. ఉన్న ముగ్గురిలో ఒకరు సస్పెండ్, మరొకరు జూనియర్. ఇక మిగిలింది తానే. చచ్చినట్టు తననే ఎల్పీ నేతను చేస్తారని భావించారు. అష్టకష్టాలు పడి పార్టీ పరువు కాపాడా నన్న కించిత్ ఆనందం కూడా ఆవిరైంది.
పార్టీలో దేనికీ కొరగాకుండా చేశారు. మరీ గింత అన్యాయమా?. ఎట్లుండేటోన్ని ఎట్లయితిని అని పార్టీ పెద్దల ముందు గొల్లుమన్నారు. దీంతో ఏ పార్టీలో లేని ‘జంపు జిలానీ’ల కమిటీ ఏర్పాటుచేసి దానికి చైర్మన్‌ను చేసింది. అదీ, మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఏ ఒక్కరూ ఈ కమిటీకి చిక్కలేదు. ‘అవకాశం ఇచ్చి చూడండి. తడాఖా చూపిస్తానని బీరాలు పలికారు. వేర్ ఈజ్ లీడర్స్?’ అంటూ పార్టీ పెద్దలు నిష్టూరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ‘ఎన్నో కలలుగని వచ్చిన తనకే పార్టీలో ఠికాణా లేదు. అలాంటప్పుడు కాస్తా రాజకీయ పరిజ్ఞానం ఉన్నోడెవడైనా వస్తారా’ అని సణిగా డు. దీంతో ఇచ్చిన పదవిని కూడా ఊడబెరికి రాష్ట్ర ఇంచార్జీలలో ఒకరికి అప్పగించింది. ఈటల్లాంటి సూటిపోటి మాటలు, పోట్ల లాంటి చేతలు!
ఎసొంటోడిని.. ఎట్లయిపాయ్ తన పరిస్థితి అని కుమిలిపోతున్నా అక్కడ (అధిష్టానం) ఇక్కడ (రాష్ట్రంలో) పట్టించుకునే నాథుడు లేడు. ఇంత జరిగాక కూడా పార్టీలో ఉండాలా? గౌరవప్రదంగా తప్పుకోవడం బెట రా? అని దోస్తులతో చర్చించారు. గింత జరిగితే మేమైతే పార్టీలో ఒక్క క్షణం ఉండేటోళ్లం కాదన్నారు. ఇక రేపో.. మాపో ‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా.. ముల్లె సర్దుకొని ఎల్లిపోతున్నా..’ అని విషాదగీతం ఆలపించడం ఒక్కటే మిగిలిందా!
– సీఎస్వీ