మస్తు క్లారిటీ
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే విషయంలో ఆ పార్టీ నాయకులకున్నంత క్లారిటీ మరెవరికీ లేదు. రాష్ట్ర నాయకుల కంటే జాతీయ నాయకత్వానికి మరింత స్పష్టత ఉన్నది. తెలంగాణలో బీజేపీది థర్డ్ ప్లేస్ అని ఆరు నెలల కిందటే చెప్పారు. మేము ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నట్టు మురళీధర్‌రావు అన్నారు. ఇంత స్పష్టత ఉన్నాక పోటీకి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారా? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
ఎలా ఉన్నారని అడుగు?
ఠాక్రే: ఎలా ఉన్నారు?
కోమటిరెడ్డి: అస్సలు బాలేను
ఠాక్రే: ఏమైంది?
కోమటిరెడ్డి: మేమే అధికారంలోకి వస్తున్నాం, నేనే సీఎం క్యాండెట్నని చెప్పుకొన్న. కానీ మీరేమో నాకు టీపీసీసీ ఇవ్వలేదు, సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ఎన్నికల కమిటీ, చివరికి తెలంగాణ స్క్రీనింగ్ కమిటీలో కూడా వేయలేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని తిరగాలి.
ఠాక్రే: మీకు భవిష్యత్తులో న్యాయం జరగుతుంది.
కోమటిరెడ్డి: పార్టీ మారుతారన్న ఉత్తమ్‌కుమార్‌కు, ఓడిపోయిన సంపత్‌కుమార్, వంశీ అందరికీ పదవులు ఇస్తారు. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసిన నాకు మాత్రం ఇవ్వరు?
ఠాక్రే: నిజమే.. కానీ, మీలా వారెవరూ కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని గెలిపించమని అనలేదు కదా?
కోమటిరెడ్డి: ఇక మీరు వెళ్లొచ్చు.
బాలయ్యే రోల్ మాడల్
తనకు రాజకీయ గురువు ఎవరూ లేరని రేవంత్‌రెడ్డి అంటారు కానీ, ఆయన పక్కా బాలయ్యబాబును ఫాలో అవుతుంటరని చెప్తున్నారు. సినిమా ఫంక్షన్స్‌లో అభిమానులను తోసేయడం, కొట్టడం బాలయ్యకు అలవాటు. రేవంత్ కూడా కార్యకర్తలపై చేయి చేసుకోవడం, వేదికల నుంచి కిందకి తోసేయడం వంటి చర్యలతో బాలయ్య బాబును తలపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ద్రోహానికి ఎక్స్ పైర్
పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని కొత్తభాష్యం చెప్పిన వైఎస్ షర్మిల తాజాగా ద్రోహానికి కూడా ఎక్స్పైర్ టైమ్ ఉంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి ద్రోహం చేసి పద్నాలుగేండ్లు దాటింది. బైబిల్ ప్రకారం.. ఏడేండ్లు దాటితే క్షమించవచ్చు. ఈ లెక్కన రెండు పర్యాయాలు క్షమించినట్టయింది కాబట్టి, ఆ పార్టీలో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు షర్మిల చెప్పుకొచ్చారు.
– వెల్జాల