చెయ్యి పార్టీ అమాత్యుడొకరు ముఖ్య నేత మీద మస్తు గుస్సా అయ్యిండట. ‘చెల్ ఈ మాత్రం దానికి నాకీ కొలువే వద్దు పో..!’ అని గరం గరం అయిపోయిండట. ఇప్పుడు అందరూ గీ ముచ్చట మీదనే గుసగుసలు పెడుతున్నరు. మధువు అమాత్యుడు అంటే ఎంత ఆమ్దాని ఉండాలే. కానీ, సారుకు రూపాయి కూడా రానియ్యకుండ బుడ్డ పైస కాడ.. పెద్ద పైస కాడ ‘ముఖ్య‘ నేతే ముందుబడి ఎక్సైజ్ చేస్తున్నడట. వచ్చిన రొక్కం వచ్చినట్టే గల్ల గురిగిల వేసుకొని పోతుంటే.. అమాత్యునికి కోపం వచ్చి నేరుగా ముఖ్య నేత దగ్గరకే పోయి నిలదీసిండట. ‘దుడ్లన్ని మీరే దిగమింగితే నా గతేంగాను’ అని కొట్లాట పెట్టిండట. దెబ్బకు ముఖ్య నేత దిగొచ్చి ‘అన్నా.. నువ్వు జరంత కాక మీదున్నవు. ముందుగైతే మనోళ్లు గా దేశం పోతుండ్రు. నువ్వు కూడా పోయి సల్లబడి రాపో.. తిరిగొచ్చే సరికి లెక్కజేసి నియ్యి నీకిత్తా’ అని బుజ్జగించి గాలిమోటరు ఎక్కించిండని జనం అనుకుంటున్నరు.
అల్లుడు.. గిల్లుడు
ఇప్పటి దాక నలుగురు అన్నదమ్ములే పేరు మోసిండ్రు కదా..! ఇగ ఇప్పుడు అల్లుడు కూడా తయారైండు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెత ఉండనే ఉన్నదిగా. మామ వెలుగు మీదున్నప్పుడే అధికారం చేయాలని అనుకున్నడో ఏమో! భీమారం బ్యాచ్‌ను దింపిండు. చేప పిల్లలను గిల్లే యవ్వారం మీద కన్నేసిండు. అల్లుడు కన్ను గీటితేనే కాంట్రాక్టు ముందుకు సాగేది. ‘చెరువెండి పోతుంది గా కంటిసైగ ఏదో చెయ్యి బాబు’ అని మత్స్య శాఖ అధికారులు ప్రాధేయ పడంగ.. పడంగ కాంట్రాక్టులు ఓకే చేసిండట. జూలై, ఆగస్టు మాసాల్లో చెరువుల వదలాల్సిన చేప పిల్లలను ఇప్పుడు వదిలితే ఎట్ల ఎదుగుతయని మత్స్యకార కుటుంబాలు గోల పెడుతున్నాయి.
ఏనుగును తరిమేయండి..!
‘అధ్యక్షా..!’ అని పిలిపించుకున్న పెద్దాయనకు ఈ మధ్య ఎటుపోయినా.. ఏనుగే అడ్డం వస్తుందట. సమీక్షలకో.. సమావేశాలకో వెళ్లి ‘ఇక మొదలుపెట్టండి’ అని ఆర్డర్ వేస్తే.. ఏనుగు రావాలె సార్ అని అధికారులు అంటున్నరట. అరే.. ఈ వాడకు నేనే పెద్ద రెడ్డిని, పిల్ల ఏనుగుతో ఏముంది. ‘పని కానివ్వండి’ అని హూంకరించినా.. అధికారులు తలలు అడ్డంగా ఊపుతున్నరట. కటకటా ఈ అవమానభారం ఇక మోయలేను అనుకుంటూ.. పట్నంబోయి పిల్ల ఏనుగును తరిమికొట్టి తనకు పట్టాభిషేకం చేయాలని చీఫ్ నేతకు విన్నవించుకుంటే.. చీఫ్ నేత చెవులు ఊపిండట గానీ, చేతలు మాత్రం ఇప్పటి వరకు లేవు. కారు గుర్తు మీద గెలిచిన ఆ పెద్దాయన సారుకు చెయ్యిచ్చి పార్టీ ఫిరాయించిండు! అక్కడ అప్పటికే నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న నేత అడుగడుగునా అడ్డం పడుతున్నడు. ఆయన్ను తప్పించాలని ఎంత మొరపెట్టుకున్నా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవటం లేదట. సారు పక్కన కారు మీదుండంగ తన వైభవం ఎట్లుండే.. ఇప్పడట్లైపోతినని తలుచుకొని పెద్దాయన తెగ బాధ పడుతున్నడట.
ఉత్త పుణ్యానికి పోతే..
మహాభారతంలో పైలుడి శిష్యుడు ఉదంకుడు కథ తెలుసు కదా..! సేమ్ టు సేమ్ ఉత్త పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. ముఖ్య నేత ఊ.. అంటే సూట్‌కేసు పట్టుకొని ఢిల్లీకి ఉరుకుతున్నడు కదా..! ఆయన ఇన్నిసార్లు పోంగ నేనెందుకు పోవద్దు అనుకున్నాడో కీలక నేత. ముఖ్య కూటం మీద ఆయనకు కూడా ఎప్పటి నుంచో కన్నుంది. వడ్ల పైసలు జమ చేసుకొని రెండు సూట్‌కేసుల నిండా సర్దుకొని ఢిల్లీ పోయిండట. అధిష్ఠానానికి కబురు పెడితే.. ఫలానా ఆయనకు ఇవ్వమని చెప్పారట. సూట్‌కేసులు అందుకున్న ఢిల్లీ పెద్దాయన హైదరాబాద్‌కు ఫోన్ చేసి ‘మీ వోడు మాకు సూట్‌కేసులు ఇచ్చిండు. నీ సీటుకు ఎసరు పెట్టేటట్టున్నడు. జర చూసుకో’ అని చెప్పిండట. ఇంకేముంది. ముఖ్య నేత ఇంటెలిజెన్స్‌ను ఎగేసి, సగేసి చిట్టా అంత తీయించి దగ్గర పెట్టుకున్నడు. తీరా హైదరాబాద్ వచ్చాక విషయం తెలిసిన కీలక నాయకుడు ఉత్త పుణ్యానికి పోతే పాపం ఎదురైందని తల పట్టుకున్నాడని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
– చిన రాజయ్య