రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏది ముట్టుకున్నా భస్మాసుర హస్తం లాగా బూడిదే అవుతున్నది. తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే. ఉచిత బస్సు వ్యవహారాన్ని పక్కనపెడితే, మిగతా అన్నింటిలోనూ అభాసుపాలయ్యారు. కులగణన విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కులగణన నివేదికలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల మొత్తం జనాభా లెక్కలే తప్ప కులాలవారీగా గణాంకాలు ఎక్కడా విడుదల చేయలేదు. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారన్న వివరాలు ప్రభుత్వ నివేదికలో పొందుపరచలేదు. దేశవ్యాప్తంగా 3,743 బీసీ కులాలుంటే, అందులో కేంద్ర ప్రభుత్వం 2,479 కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించింది. కేంద్రం కాకుండా రాష్ర్టాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు పొందుతున్న కులాలు 3,150 ఉన్నాయి. ఆ ప్రకారంగా తెలంగాణలో బీసీ కులాలు సుమారు 112 ఉన్నాయి. తెలంగాణలో 29 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయి.
తమకు జనాభా దామాషా ప్రకారం తమకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కులాలవారీగా గణన చేయకుండా కులగణన పేరు తో మరోసారి జనాభా లెక్కలు తీసింది. దీనికోసం ఖర్చు చేసిన 160 కోట్లు ఉంటే కొందరు రైతులకైనా రైతుభరోసా దక్కేది. పైగా ఈ నివేదికలో రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లింల జనాభా ఎంతో లెక్కలు చెప్పారు. ముస్లింలలో బీసీలు ఎంతమందో, ఓసీలు ఎంతమందో కూడా లెక్కలు వివరించారు. కానీ, క్రిస్టియన్లు, జైను లు, బౌద్ధులు, పారశీలు, సిక్కులు, సింథీలు ఇలా ఇతర మతాల వారీ జనాభా ఎంతెంత ఉందో మాత్రం వివరించలేదు. కులాలవారీ జనాభా బ్రేకప్ లేనప్పుడు అది కులగణన నివేదిక ఎలా అవుతుంది? 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ నివేదికలో సమగ్రంగా అన్ని అంశాలను పొందుపరిచింది.
ఆ నివేదికలోని వివరాలనే కాస్త అటూ ఇటూ తిప్పి కొత్త నివేదికలాగా ప్రవేశపెట్టినా సరిపోయేదేమో కానీ, డాంబికాలకు పోయి 160 కోట్లు ఖర్చుచేసి మరీ నిర్వహించిన సర్వే బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాను గణనీయంగా తగ్గించేసింది. బీసీల జనాభా 2014 నాటి కంటే సుమారు 21 లక్షల మేర తగ్గిపోయింది. పోనీ, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? అంటే, అదేం లేదని రేవంత్రెడ్డి కుండబద్దలు కొట్టారు. కావాలంటే స్థానిక సంస్థల్లో 42 శాతం అమలుచేస్తామని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని పార్టీపరంగా, కొన్ని పార్టీ రహితంగా జరుగుతాయి. కాబట్టి ఎంతమందికి ఇచ్చినా ప్రభుత్వానికి, పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటికి కదా సమస్య, అప్పటికి చూసుకోవచ్చనే ఆలోచనతో రేవంత్ సర్కారు ఉన్నట్టున్నది.