ప్రజాస్వామ్యం అనే పదం వినగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ప్రజల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉండే వ్యవస్థ అది. కానీ కాలం మారినకొద్దీ ఎన్నికల స్వరూపం కూడా మారిపోయింది. ఒకప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల స్థానంలో..ఇప్పుడు అధికారమే లక్ష్యంగా చూసే నేతలు పెరిగిపోయారు.
ఎన్నికలు వస్తే చాలు హామీల హోరు, డబ్బు ప్రవాహం, కులమతాల లెక్కలు, ప్రలోభాల రాజకీయాలు మొదలవుతున్నాయి. ప్రజల సమస్యల కంటే గెలుపే ముఖ్యమైపోయిన ఈ పరిస్థితిని చూసిన ప్రతిస్పందనగానే డా.ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘ఏడుకోలల బాయి’ అనే శతకం రూపుదిద్దుకున్నది.
ఈ కృతి కేవలం పద్యాల సమాహారం కాదు. మన సమకాలీన రాజకీయాలపై ఆయన గుండె నుంచి వచ్చిన గట్టి ప్రశ్న. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న వక్రీకరణలు, ఓటర్ల అమాయకత్వం, నాయకుల అవకాశవాదాన్ని పదునైన వ్యంగ్యంతో, తెలంగాణ మట్టివాసనతో కూడిన భాషలో కవి ఆవిష్కరించారు. ఈ శతకంలోని ప్రధాన ఆకర్షణ భాష. సంప్రదాయ పద్యాల్లో కనిపించే భారమైన సంస్కృత ప్రభావం కంటే..ఇందులో ప్రజల నోట వినిపించే మాటలే ఎక్కువ. తెలంగాణ పలుకుబడులు, ఉర్దూ-హిందీ-ఆంగ్ల పదాల మేళవింపు ఈ పద్యాలకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. చదువుతుంటే మన ఊరి చౌరస్తాలో కూర్చొని ఎవరో తమ మనసులోని బాధ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది.
కవి చూపించిన రాజకీయ వాస్తవాలు మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉంటాయి. పార్టీలు మారే నాయకులు, టికెట్ల కోసం విలువలు వదిలేసే వ్యక్తులు, ప్రజలను కులమతాల పేరిట విడగొట్టే కుట్రలు, ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సేవాభావం ఇవన్నీ ఈ కృతిలో అద్దంలా ప్రతిబింబిస్తాయి.
అధికారంలోకి రావటానికి ఎలాం టి మార్గమైనాసరే అనుకునే రాజకీయ ధోరణిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు రచయిత. ఈ శతకం ఓటరుని కూడా ప్రశ్నిస్తుంది. క్షణిక ప్రయోజనాల కోసం ఓటు అమ్ముకోవటం ఎంత ప్రమాదకరమో గుర్తుచేస్తుంది. ఒక ఓటు వెనుక సమాజ భవిష్యత్తు దాగి ఉన్నదని పదేపదే హెచ్చరిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది నాయకులు కాదు, చైతన్యవంతమైన ఓటరులేనని ఈ కృతి బలంగా చెప్తుంది.
సాహిత్యపరంగా కూడా ‘ఏడుకోలల బాయి’ ప్రత్యేకతను సంపాదించింది. సీసపద్య సంప్రదాయానికి ఆధునిక భావజాలాన్ని జోడిస్తూ ఏనుగు నరసింహారెడ్డి కొత్త ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా నాలుగు పాదాల మకుటంతో సాగించిన నిర్మాణం వినూత్నంగా నిలిచింది. వ్యంగ్యం, సామాజిక చైతన్యం, ప్రజా భాష ఈ మూడు కలిసినప్పుడు పద్యం ఎంత శక్తివంతమవుతుందో ఈ శతకం నిరూపిస్తుంది. ఇది కేవలం రాజకీయాలపై విమర్శ మాత్రమే కాదు..మంచి వ్యవస్థ కోసం చేసిన ఆత్మీయ పిలుపు కూడా. ఎన్నికలు మారాలి, నాయకత్వం మారాలి, ముఖ్యంగా ప్రజల ఆలోచనా విధానం మారాలనే ఆకాంక్ష ఈ రచన అంతటా కనిపిస్తుంది. సమాజాన్ని గమనించే కండ్లున్న ప్రతి పాఠకుడిని ఆలోచింపజేసే శక్తి ‘ఏడుకోలల బాయి’కి ఉన్నది. ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నవారెవరైనా తప్పక చదవాల్సిన సమకాలీన శతకమిది.
– ఎన్.లహరి
98855 35506