Retired Employees | రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణమైన అవసరాలకూ నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లోకి జారుకుంటున్నది మన రాష్ట్రం. అమలుకాని హామీలు, పట్టాలెక్కని పథకాల మాట అటుంచితే కనీసం ఉద్యోగ విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. ఫలితంగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులూ విషమ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఏడాది కాలంలో 8 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారిలో ఏ ఒక్కరికీ ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొనడం విచారకరం. వారిలో 200 మంది ఈసరికే కోర్టును ఆశ్రయించారు. మలిసంజెలో ఆదుకుంటాయనుకున్న బెనిఫిట్స్ ఎంతకూ చేతికందకపోవడంతో కొంతమంది నిస్పృహకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రిటైర్డ్ ఏఎస్సై సాధిక్ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. పదవీ విరమణ చేసిన 45 రోజుల్లో యావత్తు సొమ్ము చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం మందలించినా సర్కారు తీరులో మార్పు రాకపోవడం విచారకరం.
ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడమంటే జీవితానికి భరోసా పొందడమే అని భావించేవారు. పదవీ కాలంలో జీతాలు, పదవీ విరమ ణ అనంతరం బెనిఫిట్లు, పింఛన్లు లభిస్తాయనే నమ్మకమే అందుకు కారణం. జీవన గమనం లో అలసిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ మీద కోటి ఆశలు పెట్టుకుంటారు. ప్రశాంత జీవనానికి ఇల్లు కట్టుకుందామనో, బిడ్డ పెండ్లి చేసి బాధ్యత తీర్చుకుందామనో అనుకుంటారు. కొందరికి అప్పుల సమస్య కూడా ఉంటుంది. వాటినీ తీర్చేసి నిమ్మలంగా గడపవచ్చనీ అనుకుంటారు. ఇంకా ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటారు. సకాలంలో ఆదుకుంటాయనుకున్న నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేయడం భావ్యం కాదు. కానీ, సచివాలయం చుట్టూ ఎన్నోసార్లు ప్రదక్షిణ చేసినా ఫైల్ కదలకపోవడంతో విశ్రాంత ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
రాష్ట్రంలో సుమారు 3.9 లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో ప్రతి నెలా 800 నుం చి 1000 మంది రిటైర్ అవుతారు. ఒక్కొక్కరి కి జీపీఎఫ్, సరెండర్ లీవులు తదితరాల కింద రూ.35 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఏటా రూ.4 వేల కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు పెన్షన్ చెల్లింపులు కూడా ఏటా పెరుగుతున్నాయి. ప్రభు త్వం ఈ చెల్లింపుల భారాన్ని తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నది. బడా కాం ట్రాక్టర్లకు భారీ నిధులు బిల్లుల రూపంలో విచ్చలవిడిగా విడుదల చేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు మాత్రం బాండ్లు చేతిలో పెడుతున్నది. ఖర్చులకు రొక్కం లేనప్పుడు కాగితాలతో ఏం లాభం? మరోవైపు రిటైర్మెంట్ వయసు పొడిగించి మరింత ఉపశమనం పొందవచ్చని సర్కారు ఇంకో ఎత్తుగడ. ఈ పరిస్థితుల్లో రిటైర్మెంట్ అంటేనే దిగులుపడే రోజులొచ్చాయి. ఎందుకంటే నెలనెలా వచ్చే జీతం ఆగిపోతుంది. పైగా రావాల్సిన బెనిఫి ట్స్ రావు. జీవితకాలం ప్రభుత్వ సేవలో గడి పి చివరికి రిటైర్మెంట్ సొమ్ముల కోసం న్యాయపోరాటాలు, వీధి పోరాటాలు చేయా ల్సిరావడం దురదృష్టకరం.