భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) స్థానంలో పూర్వపు పద్ధతిలో పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఏటేటా ఊపందుకుంటున్నది. 2004 వేసవి పార్లమెంట్ ఎన్నికల నుంచీ దేశవ్యాప్తంగా ఎన్నికలను (పార్లమెంట్, అసెంబ్లీ) ఈవీఎంలతోనే నిర్వహిస్తున్నారు. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచీ ఈవీఎంల పనితీరుపై రాజకీయపక్షాలు, ప్రజలకు అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఓటింగ్ యంత్రాల నిర్వహణపై జనంలో విశ్వాసం సన్నగిల్లుతున్నది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానం మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
యూపీఏకు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ బలం 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 2004 నాటి 145 సీట్ల నుంచి 206కు పెరగడంతో ఎన్నికల ఫలితాలపై, ముఖ్యంగా ఈవీఎంల వినియోగంపై ప్రజల్లో, ప్రతిపక్షాల్లో అనుమానాలు తలెత్తాయి. అప్పటి నుంచి వరుసగా 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా అపనమ్మకం ఏర్పడింది. కేంద్రంలో పాలకపక్షం పలు నియోజకవర్గాల్లో ఈవీఎంలను తమకు అనుకూలంగా వాడుకొని, అనుకున్న ఫలితాలు సాధిస్తున్నదనే ఆరోపణలున్నాయి. కాగా, 195152 తొలి సాధారణ ఎన్నిక నుంచీ పేపర్ బ్యాలెట్లతో చట్టసభలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహి స్తూ వచ్చారు.
అప్పటి నుంచి 2004 వరకూ అంటే 52 ఏండ్ల పాటు దేశంలో పార్లమెంటు, వివిధ రాష్ర్టాల శాసనసభల ఎన్నికలను పేపర్ బ్యాలెట్లతో నిర్వహించారు. అయితే, బ్యాలెట్ పత్రాల పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అవి ఆరోపణలు మాత్రమే కాదు, వాస్తవాలని తర్వాత జరిగిన విచారణలో రుజువైంది.
బ్యాలెట్ పత్రాలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించిన కాలంలో లోక్‌సభ, అనేక రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున అక్రమాలు జరిగేవన్నది బహిరంగ రహస్యమే. ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం ఉన్న రాజకీయపక్షాలు, నేతలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడం, కార్యకర్త లు, గూండాల సాయంతో పోలింగ్ అధికారుల నుంచి బ్యాలెట్ పత్రాలను గుంజుకోవడం, వాటిపై తమ అభ్యర్థులకు ఓటు ముద్రలు వేసుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో భాగమే. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రాలు చించివేయడం, బ్యాలెట్ పెట్టెల్లో సిరా వంటి ద్రవాలు పోయడం, బ్యాలెట్ పత్రాల కట్టలు, పెట్టెలను సమీపంలోని కాల్వలు, చెరువుల్లోకి విసిరేయడం వంటి ప్రజాస్వామిక అపశృతులు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. కానీ, బ్యాలెట్ పత్రాలతో జరిపే ఎన్నికల్లో అక్రమాలు ఎన్నడూ అన్ని ప్రాంతాల్లో విస్తారంగా జరగలేదు. బీహార్, యూపీ, పశ్చిమబెంగాల్, హర్యా నా వంటి ఉత్తరాది రాష్ర్టాల్లో బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో జరిగే అనేక ఎన్నికల్లో అక్రమాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆధునిక టెక్నాలజీ ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఎన్నిక ల అక్రమాలను తొలగించవచ్చనే ఆశతో పాశ్చాత్య ప్రపంచంతో పాటు ఇండియాలో కూడా 1980ల ఆరంభం నుం చీ ఈవీఎంలను దశలవారీగా ప్రవేశపెట్టారు. 1982లో కేరళలోని పరావూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టడంతో దేశంలో ఎలక్ట్రానిక్ యంత్రాల వినియోగం ఆరంభమైంది. అప్పటి నుంచి ఈవీఎంలను దేశవ్యాప్తంగా వినియోగించడానికి 22 ఏండ్లు పట్టింది. కేరళలోని పరావూరులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం రాజ్యాంగబద్ధంగా లేదని సుప్రీంకోర్టు ఆ ఫలితాన్ని కొట్టివేసినా, మరుసటి సంవత్సరం 1983లో జరిగిన ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానంలో మొదటిసారి ప్రవేశపెట్టి పోలింగ్ నిర్వహించారు. అయితే, తెలుగునాట పూర్తిగా అన్ని స్థానాల్లో ఈవీఎంల వినియోగం మాత్రం 2004 జమిలి ఎన్నికల నుంచీ మొదలైంది. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడంతో ఈవీఎంల వినియోగానికి చట్టబద్ధత వచ్చింది.
దేశంలోని రెండు ప్రధాన జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల పాలనాకాలంలో జరిగిన ఎన్నికలపై జనంలో అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. 2009లో కాంగ్రెస్, యూపీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్యాబలం పార్లమెంట్, అసెంబ్లీలలో పెరిగేలా ఈవీఎంలను అప్పటి కాంగ్రెస్ సర్కారు తమకు అనుకూలంగా వాడుకుందని, పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరిప్పుడు ఈవీఎంల వినియోగంలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తూనే, 2009లో ఎలాంటి అక్రమాలు జరగలేదని బుకాయించింది. 1984 డిసెంబర్ లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారి ఒక జాతీయపక్షానికి మెజారిటీ సీట్లు రావడం 2014లోనే జరిగింది. బీజేపీ మొదటిసారి సాధారణ మెజారిటీ 272 సీట్లను దాటి 282 స్థానాలు కైవసం చేసుకున్నది. 2014, మే నెలలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఐదేండ్ల పాటు అనేక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వరుసగా అత్యధిక రాష్ర్టాల్లో బీజేపీ సొంతంగా లేదా మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ సీట్లు దక్కించుకున్నది. ఎన్నడూ విజయం అందుకోలేని హర్యానాలోనూ బీజేపీకి అధికారం దక్కింది. అలాగే, 2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజే పీ భారీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ మొదటి ఐదేండ్ల పాలన అసమర్థతకే పేరుగాంచింది. ఈ రాష్ట్రంలో బీజే పీ సర్కారు సాగించిన దౌర్జన్యాలు, జులుం ప్రజలకు వెగటు పుట్టించాయి. ఇంత జరిగినా 2022 ఎన్నికల్లో యోగి నాయకత్వంలో బీజేపీ వరుసగా రెండోసారి మెజారిటీ సాధించి కొత్త రికార్డు సృష్టించింది. మోదీ మొదటి పర్యాయం పాలనపై ప్రజ ల్లో అసంతృప్తి పెరిగింది. అయినా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం అనూహ్యంగా 282 నుంచి 303 సీట్లకు ఎగబాకింది. ఆ తర్వాత అనేక రాష్ర్టాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ విజయాలు సాధించింది.
అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే 2018 చివరలో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. కానీ, ఆరు నెలలు దాటాక జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే రాష్ర్టాల్లో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అలాగే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు విరుద్ధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఆ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో పదేండ్ల మోదీ పాలన తర్వాత కేవలం 240 సీట్లు దక్కించుకొని మ్యాజిక్ ఫిగ ర్కు దూరమై మిత్రపక్షాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిం ది. కానీ, కొద్ది నెలలకే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానా, మహారాష్ట్రల్లో బీజేపీ దిగ్భ్రాంతి కలిగించే రీతిలో మిత్రపక్షాలతో కలిసి భారీ సంఖ్యలో సీట్లు సాధించింది. అంతకు కొన్ని నెలల ముందు జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ రెండు రాష్ర్టాల్లో ఎక్కువ స్థానా ల్లో పరాజయాలే ఎదురయ్యాయి. అయినా, కొద్ది నెలల్లో నే ఈ రాష్ర్టాల్లో విజయం సాధించడం దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పదకొండు సంవత్సరాల్లో (20142025) పార్లమెంట్, అనేక రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయాలు సాధించడం తో ఈ రెండురకాల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఉపయోగించే ఈవీఎంల వినియోగం సక్రమంగా జరుగుతున్నదా? అనే అనుమానం బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ సహా అనేక మంది బీజేపీయేతర రాజకీయ పక్షాల నాయకులకు వస్తున్నది.
ఐరోపా దేశాలు సహా అనేక ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఈవీఎంల పనితీరు, వాటి దుర్వినియోగంపై జనంలో విశ్వాసం, నమ్మకం సన్నగిల్లింది. కేటీఆర్ చెప్పినట్టు ఇంగ్లండ్, జర్మనీ, ఇటలీలు తమ దేశాల్లో ఈవీఎంల సాయంతో ఎన్నికలను పూర్తిగా నిర్వహించడం లేదు.
అమెరికాలో సైతం అనేకరకాల మెషిన్లను వాడే సంప్రదాయం ఉన్నప్పటికీ ఇండియాలో మాదిరిగా ఒకే రకమైన ఈవీఎంలను వాడటం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాతంత్ర వ్యవస్థకు ప్రాణప్రదమైన ఎన్నికల్లో ఉపయోగించే యంత్రాలపై జనంలో అపనమ్మకం పెరుగుతున్నప్పుడు బ్యాలెట్ పత్రాల పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని భారత ఎన్నికల సంఘం గుర్తిస్తే మంచిది. ఇకనైనా ఈవీఎంలు తొలగించి పేపర్ బ్యాలెట్ వినియోగంపై ఎన్నికల సంఘం అన్ని రాజకీయపక్షాలతో సమావేశం ఏర్పాటుచేయాలి. ఎన్నిక ల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం తగ్గితే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.