 
                                                            Plastic Pollution | సాంకేతికత విస్ఫోటించి కృత్రిమ మేధస్సు ఊపిరి పోసుకుంటున్న ప్రస్తుత యుగంలోనూ మానవ పరిజ్ఞానం రెండింటి విషయంలో ఇంకా పరిమితంగానే ఉండిపోయింది. అందులో మొదటిది మనిషి మెదడు కాగా, రెండోది సముద్రం. రెండూ లోతైనవి కావడమే అందుకు కారణం కావచ్చు. భూగోళం విస్తీర్ణంలో 71 శాతం సముద్ర జలాలే పరుచుకుని ఉంటాయి. రుతువులు మారడం, ఉష్ణోగ్రత స్థిరీకరించడం, అధిక మొత్తంలో ఆక్సిజన్ సమకూర్చడం విషయంలో సముద్రాల పాత్ర అద్వితీయమైంది. భూగోళం మనుగడలో ఇంత ముఖ్యపాత్ర పోషించే సముద్రం గురించి తెలిసింది చాలా తక్కువే. ఉదాహరణకు సముద్రం అడుగు భాగం మ్యాపింగ్ 26 శాతం మాత్రమే పూర్తయింది.
ఇక వాతావరణంపై సముద్రం వేసే ప్రభావం గురించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రంలో ఖనిజాలు, ఇతర వనరుల అన్వేషణ ఇటీవలి కాలంలో కొంత ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో సముద్ర శాస్త్రం పురోగతి దిశగా అడుగులు వేసేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకున్నది. ప్రస్తుత దశాబ్దిని సాగర దశాబ్దిగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధికి సముద్ర శాస్త్రం అనేది దీని లక్ష్యంగా నిర్ణయించింది. మన దేశం ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మండలాల సమీపంలో సముద్రం అడుగు భాగం అన్వేషణలకు 2023లో శ్రీకారం చుట్టింది.
సుస్థిర అభివృద్ధికి సముద్ర శాస్ర్తాన్ని ఆలంబనగా నిలపడం ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పెను సవాలుగా మారిందని చెప్పక తప్పదు. అన్వేషణ కన్నా ముందు సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అత్యవసర స్థితి నెలకొన్నది. ఎందుకంటే మహాసాగరాలు ప్రస్తుతం కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. రసాయనాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం ప్రాణాంతకంగా తయారవుతున్నది. సముద్రగర్భం ప్లాస్టిక్‌కు శాశ్వత రిజర్వాయర్‌గా మారిపోయింది. పసిఫిక్‌లో దాదాపు ఫ్రాన్స్ భూభాగమంత సైజులో అతిపెద్ద ప్లాస్టిక్ తెట్టు తేలియాడుతున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏటా సముద్రంలో 80 లక్షల నుంచి కోటి మెట్రిక్ టన్నుల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చిచేరుతున్నాయి.
దవాఖానల వ్యర్థాలు, అణు వ్యర్థాలు కూడా అదనంగా వచ్చిపడుతుండటంతో సముద్రాలను కాలుష్యం ఊపిరి సలుపనివ్వడం లేదు. ఫలితంగా సముద్ర జీవులు మనుగడ సాగించలేక సతమతమవుతున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్న జీవజాతుల్లో 17 శాతం అంతరించే దిశగా పోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తున్నది. కాలుష్యం కారణంగా సముద్రాల ఉష్ణోగ్రత నిరంతరాయంగా పెరుగుతుండటం మరో సమస్య. దీనివల్ల తుఫానులు, వడగాలుల వంటి తీవ్ర వాతావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. 2030లోగా సముద్రాల్లో 30 శాతం విస్తీర్ణంలో రక్షిత వనాల తరహాలో రక్షిత మండలాలను ఏర్పాటు చేయాలని సూచించే ఐక్యరాజ్య సమితి సముద్ర ఒప్పందం వచ్చే ఏడాది (2025) నుంచి అమలులోకి వస్తుంది. అంటే దాని అమలుకు ఐదేండ్ల సమయం మాత్రమే ఉంటుందన్న మాట.
సముద్ర పరిరక్షణ కృషి ప్రధానంగా సాంకేతికత మీదే ఆధారపడతున్నది. సాగర జలాల్లోంచి కార్బన్‌ను వేరుచేసి, తొలగించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. కానీ, జరగాల్సింది మనుషుల లేదా దేశాల ధోరణిలో మార్పు రావడం. భూమి మీద ఇప్పటిదాకా తయారైన ప్లాస్టిక్‌లో వందశాతం యథాతథంగా ఉండిపోయిందనేది గుర్తుంచుకోవాలి. అది కొంత భూమి మీద, చాలావరకు సముద్రాల్లో నిక్షిప్తమై ఉంది. ప్లాస్టిక్ వినియోగాన్ని సున్నాకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది అంత సులభంగా సాధ్యమయ్యేది కానప్పటికీ ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మానవజాతి తనకు మాత్రమే కాకుండా యావత్తు జీవకోటికి మరణశాసనం రాసుకున్నట్టే అవుతుంది.
 
                            