e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఎడిట్‌ పేజీ మానవాళిపై ప్రకృతి కన్నెర్ర

మానవాళిపై ప్రకృతి కన్నెర్ర

ఇటీవలి కొన్ని సంఘటనలు చూస్తే మానవాళిపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటున్నదనిపిస్తున్నది. 2013లో కేదార్‌నాథ్‌ దుర్ఘటన, 2019లో కేరళలో వరద విధ్వంసం, 2020లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2021లో జరిగిన రుషిగంగా నదికి ఆకస్మిక వరదలు,అమెరికా దక్షిణ రాష్ర్టాలైన టెక్సాస్‌, మిసిసిపిలలో కనీవినీ ఎరుగని మంచు తుఫానులు, తీవ్రమైన ఎండలు, అమెరికా, ఆస్ట్రేలియాల్లో సంభవిస్తున్న భయంకరమైన కార్చిచ్చులు, ఇటీవల చైనాలో వెయ్యేండ్లలో చూడని వర్షపాతం దరిమిలా వచ్చిన వరద బీభత్సం, ఇప్పుడు పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలు.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులు మనముందు సాక్ష్యాలుగా ఉన్నాయి.

వాతావరణ మార్పులను నియంత్రించి తిరిగి గాడిలో పెట్టాలంటే భూగోళంపై అడవుల నరికివేతను నియంత్రించాలి. అడవులను పునరుజ్జీవింపజేయాలి. కర్బన ఉద్గారాలను నియంత్రించాలని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వృక్షవేదం’ పుస్తకంలో రాసిన పీఠికలో విలువైన సమాచారం పొందుపర్చారు. 10 వేల ఏండ్ల కిందట భూగోళం 45 శాతం అడవులతో నిండి ఉండేది. ఇప్పుడు అది 31 శాతానికి పడిపోయింది. అంటే గడిచిన పదేండ్లలో ఏటా 5.20 మిలియన్‌ హెక్టార్ల అడవిని మనం నరికివేశాం.

- Advertisement -

పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు దశాబ్దకాలంగా అంతర్జాతీయ వేదికలపై ప్రకృతి విపత్తులపై విస్తృతంగా చర్చిస్తున్నారు. భూగోళంపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వరుస కరువులు, అతివరదలు సంభవించి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది చదరపు కిలోమీటర్ల మేర అడవుల నరికివేత, మనిషి ఆధునిక జీవన విధానం, పలు రూపాల్లో ప్రసరిస్తున్న కర్బన ఉద్గారాలు ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు. 2000 నుంచి 2012 వరకు ప్రపంచవ్యాప్తంగా 2.30 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల అడవి మాయమైందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రతి నిమిషం ఒక ఫుట్‌బాల్‌ మైదానమంత అడవి అమెజాన్‌ అడవుల నుంచి తగ్గిపోతున్నది. 2018లో సుమారు 3.60 మిలియన్‌ హెక్టార్ల ఉష్ణ మండల అడవులు నరికివేస్తున్నట్టు ఒక అంచనా. అడవుల నరికివేత వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రుతుపవనాలపై ఆధారపడిన భారత్‌, పాక్‌, బంగ్లా, శ్రీలంక, నేపాల్‌, మయాన్మార్‌ తదితర దక్షిణాసియా వ్యవసాయిక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు వానకాలం నాలుగు నెలల పాటు వానలు కురిసేవి. ఇప్పుడు వార్షిక సగటు వర్షపాతంలో తగ్గుదల లేకపోయినా వాన కురిసే రోజులు సుమారు 30 రోజులకు పడిపోయాయి. వానలు నెల, నెలన్నర రోజులు అసలే కురువవు. కురిస్తే రెండు మూడు రోజుల్లో ఎక్కువ వానలు పడుతాయి. ఈ దోబూచులాట మనం కొన్నేండ్లుగా చూస్తున్నాం. ఈ పరిస్థితి 2020లో కూడా మన అనుభవంలోకి వచ్చింది. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో వానలు లేక కరువు పరిస్థితులను చూశాం. సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో భారీ వర్షం, నదుల్లో వరద బీభత్సం చూశాం. ఫిబ్రవరి నుంచి తిరిగి ఎండలు దంచికొట్టాయి. ఈ కారణంగా దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంటున్నది. కరువులు- వరదలు- కరువులు దాదాపు ఏటా పునరావృతం అవుతున్నాయి.

భూగోళంపై చెట్ల విస్తీర్ణాన్ని పెంచడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మానవ ప్రయత్నాలు అనేక రూపాల్లో జరుగుతున్నాయి. చైనా ఉత్తర ప్రాంత రాష్ర్టాల్లో గోబి ఎడారి విస్తరణ అడ్డుకోవడానికి 500 కోట్ల చెట్లతో గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా, బ్రెజిల్‌లో అట్లాంటిక్‌ వర్షాధారిత అడవుల పునరుద్ధరణ, సహారా, సాహెల్‌ ఎడారుల విస్తరణను అడ్డుకోవడానికి 8 వేల కి.మీ. పొడవునా ఆఫ్రికన్‌ యూనియన్‌ దేశాలు చేపట్టిన గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆఫ్రికా, తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ తదితర ప్రాజెక్టులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ‘హరితహారం’ కార్యక్రమం భూగోళంపై గ్రీన్‌ కవర్‌ను పెంచే అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో ఒకటిగా చోటు సంపాదించుకోవడం రాష్ర్టానికే గర్వకారణం. రాజస్థాన్‌లో ఉన్న థార్‌ ఎడారి విస్తరణను నిరోధించడానికి గుజరాత్‌ పోర్‌ బందర్‌ నుంచి హర్యానా పానిపట్‌ వరకు 1400 కి.మీ. పొడవునా గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టును కేంద్రం రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నది. ఇది పూర్తయితే గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధికెక్కనున్నది.

మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా పర్యావరణానికి చేస్తున్న హాని పరిమాణం ముందు చాలా చిన్నవే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 229 హెరిటేజ్‌ సైట్లలో 114 అభివృద్ధికి బలవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుద్ధిపూర్వకంగా అడవుల నరికివేతను తగ్గించుకోవాలి. అటవీ భూములను పునరుద్ధరించుకోవాలి. పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలి. శిలాజ ఇంధన వినియోగం నుంచి పునరుత్పాదక ఇంధన వినియోగం వైపునకు మళ్లించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు ఏకోన్ముఖంగా సుదీర్ఘ కాలం పై కార్యక్రమాలు చేపడితే తప్ప ప్రకృతి ప్రకోపం తగ్గే అవకాశం లేదు. ఇప్పటికైనా మానవాళి కండ్లు తెరువాలని ఆశిద్దాం.

శ్రీధర్‌రావు దేశ్‌పాండే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana