e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఎడిట్‌ పేజీ త్యాగాల ఫలాలు నిజమైన కలల

త్యాగాల ఫలాలు నిజమైన కలల


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. ఒకప్పుడు రాష్ట్ర సాధన ఓ కల. లెక్కలేనన్ని ఆటుపోట్లు, ఒడిదొడుకులు ఎదుర్కొని పోరాడటంతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. సబ్బండ వర్గాలు ఈ మహోద్యమంలో టీఆర్‌ఎస్‌ అధినేత ఉద్యమనాయకుడు కేసీఆర్‌ నేతృత్వంలో విజయం సాధించడంతో రాష్ట్ర సాధన పరిపూర్ణమైంది.

త్యాగాల ఫలాలు నిజమైన కలల

తెలంగాణ రాష్ట్ర సాధన నాడు కల.. నేడు నిజం. గొప్ప అనుభూతి, అనుభవం. ఒక మధుర స్వప్నం ఫలించింది. తెలంగాణ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం రాష్ట్ర అవతరణ. ఎన్నో విధాల రకాల అవరోధాలను అధిగమించి సాధించుకున్న తెలంగాణ దేనికోసం అని ప్రశ్నించుకుంటే.. అభివృద్ధి, నీళ్ళు, నియామకాలు, స్వయంపాలన, తదితర అంశాలు మన మదిలో మెదులుతాయి.

తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఏర్పాటు తర్వాత జరిగిన మార్పులను గమనిస్తే మనం సాధించిన విజయాలు ఏమిటి, ఇంకా కావలసిన ప్రగతి ఏంటి అనేది అవగతం అవుతుంది.

మొదటగా నీళ్ళు.. తలాపున గోదావరి, కాళ్ళకట్టకు మానేరు. మధ్యలో తెలంగాణ ఎడారి. రెక్కాడితే గాని డొక్కాడని రైతుల పరిస్థితి ఆగమ్య గోచరం. వ్యవసాయం ఒకటేమిటి, నీటిబొట్టు కోసం స్త్రీలు కిలోమీటర్లు నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. బిందె నిండా నీళ్లు దొరికితే ప్రాణం లేచివచ్చేది. ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ బిందెలతో మహిళల నిరసన కార్యక్రమాలు సర్వ సాధారణం. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య ప్రాణాలు తీసేది. నేడు ఆ పరిస్థితి లేదు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలతో నీటి సమస్య తీరింది. చెరువులు కుంటలు, నిండి మత్తడి పారుతున్నాయ్‌. నేడు తెలంగాణా కోటి ఎకరాల మాగాణి.

ఇక కరెంటు విషయం చూస్తే, నాటి పాలకుల నిర్లక్ష్యం, పక్షపాత ధోరణితో నాలుగు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అయ్యేది కాదు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకొనే దుస్థితి. రాష్ట్ర సాధన తర్వాత నేడు 24 గంటల నాణ్యమైన కరెంటు రైతులకు ఉచితంగా లభిస్తున్నది. అటు పరిశ్రమలకు, ఇటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు కోతలు లేకుండా లభ్యం అవుతున్నది.

నాడు ఉద్యమం ఉవ్వెత్తున లేచిన దగ్గర్నుంచి తెలంగాణ బిల్లు ఆమోదం వరకు విద్యార్థులు మొక్కవోని దీక్షతో పోరాడారు. నాటి తెరాస అధ్యక్షుడు నేటి ముఖ్య మంత్రి కేసీఆర్‌ పిలుపు ఇచ్చిన ప్రతీ సందర్భంలో తమ వంతు కృషి చేశారు. అట్టి విద్యార్థి లోకం నేడు రాష్ట్రంలో జరుగుతున్న నియామకాలతో ఉద్యోగాలు పొందుతూ తమ కలలు నిజమవు తున్నాయని సంబుర పడుతున్నారు.

ఇక అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. రైతుబందు నేడు దేశానికే ఆదర్శవంతమైన పథకం. అప్పుల బాధ తప్పి, నీటి గోస తీరి నేడు అన్నపూర్ణగా రాష్ట్రం భాసిల్లుతున్నది. సంక్షేమ పథకాల అమలుతో బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, వృద్ధాప్య పింఛన్లు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు మొదలగు కార్యక్రమాలతో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నది.

ఈ ప్రగతి అప్రతిహతంగా కొనసాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వాములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహకారం ప్రభుత్వానికి అందించాలి. అప్పుడే బంగారు తెలంగాణ మన కండ్లెదుట ఆవిష్కారమవుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది.

వై. రఘునాథరావు

(వ్యాసకర్త: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎంఎల్‌ఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త్యాగాల ఫలాలు నిజమైన కలల

ట్రెండింగ్‌

Advertisement