e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home ఎడిట్‌ పేజీ అందరివాడు ఆధునికుడు

అందరివాడు ఆధునికుడు

రెండు వారాల కిందట కేరళలోని ఒక టీవీ ఛానెల్లో పనిచేసే మిత్రుడు మెసేజ్‌ చేశాడు. ‘ఇక్కడ మా బంధుమిత్రుల వాట్సాప్‌ గ్రూపులన్నిట్లో కేటీఆర్‌ వీడియోలే షేర్‌ చేస్తున్నారు తెలుసా’ అంటూ. మచ్చుకి కొన్ని వీడియోలు కూడా ఫార్వార్డ్‌ చేశాడు. మరునాడే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే మరో మిత్రుడు ఇంకొక మెసేజ్‌ పంపాడు. ‘కేరళ, తమిళనాడులో అనేక మంది యూట్యూబ్‌లో ఉన్న కేటీఆర్‌ ప్రసంగాల వీడియోలు షేర్‌ చేస్తున్నారు’ అని.

తెలంగాణలో భారీ పరిశ్రమను నెలకొల్పుతామని కేరళలోని ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీ కిటెక్స్‌ అంతకు రెండు రోజుల కిందటే ప్రకటించింది. ఈ పరిశ్రమ కోసం పది రాష్ర్టాలు పోటీ పడితే, ఒక్కరోజులోనే ప్రత్యేక విమానంలో ఆ కంపెనీ ప్రతినిధులను హైదరాబాద్‌ రప్పించి, వారిని మెప్పించి, పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించిన తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పేరు దేశమంతటా మార్మోగిపోయింది. ఆ ఒక్క పరిశ్రమ రాకతో సుమారు 4,000 ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయి.

- Advertisement -

ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 2016 మే నెలలో అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ ‘హైదరాబాద్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించినప్పుడు మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగం ఒక సంచలనం రేపింది. ఆ ప్రసంగానికి దేశవిదేశాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కొన్నాళ్ల తరువాత హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన చైనా ప్రతినిధి బృందం సభ్యులు తాము వీచాట్‌లో (చైనాలో వాడుకలో ఉన్న వాట్సాప్‌ వంటి యాప్‌లో) కేటీఆర్‌ చేసిన ప్రసంగం విన్నామని చెప్పడం ఎల్లలు దాటిన ఈ యువనాయకుని కీర్తిప్రతిష్ఠలకు నిదర్శనం.

ఒక రాష్ట్రంలో మంత్రిగా ఉన్న నాయకునికి రాష్ట్రం వెలుపల కూడా ఇంతటి గుర్తింపు దక్కడం అరుదు. కానీ కేటీఆర్‌ మాత్రం ఇటు తెలంగాణలోనేగాక అటు పలు రాష్ర్టాల్లో అనితరసాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. దేశంలోనే కాదు, అటు శ్రీలంక నుంచి ఇటు అమెరికా వరకూ అనేక ప్రతిష్ఠాత్మక వేదికల మీద కేటీఆర్‌ ప్రసంగాలు ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకట్టుకుని తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాయి.

ఆకట్టుకునే వాగ్ధాటి ఒక్కటే కాదు, రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు ఎన్నో వినూత్నమైన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఘనత కేటీఆర్‌ సొంతం. ఆయన మదిలో పుట్టిన ఒక్కో ఆలోచన ఇవ్వాళ పూర్తిస్థాయి సంస్థలుగా ఎదిగి లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నవి. నైపుణ్య శిక్షణాసంస్థ టాస్క్‌; ఉద్యోగార్థులకు టీశాట్‌ నిపుణ టీవీ ఛానెల్‌; అంకుర పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌; ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్‌; విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ – ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.

రాష్ట్ర సాధన ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు గిట్టనివారు అనేక దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఖాళీ అవుతుందని, ఉన్న పరిశ్రమలు తరలిపోతాయని, కొత్తవి అసలు రానే రావన్నారు. కానీ, నూతన రాష్ట్రంలో మంత్రిగా ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే కేటీఆర్‌ కార్యక్షేత్రంలోకి దూకారు. ఐటీ రంగంలో అప్పటికే ఉన్న దిగ్గజ కంపెనీల యాజమాన్యాలతో సమావేశమై.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రగతిశీల ప్రభుత్వమని, పారిశ్రామిక రంగానికి అన్నివిధాలా అండగా ఉంటామనీ భరోసా ఇచ్చారు. తొలి ఆరునెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంతో ఐటీ మంత్రి కేటీఆర్‌ పలుదఫాలుగా జరిపిన ఈ భేటీలు రాష్ట్ర పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని పాదుకొల్పాయి. ఫలితంగా ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రం వదిలివెళ్లలేదు. అంతేకాదు, అప్పటికే ఇక్కడ ఉన్న పరిశ్రమలు అనేకం తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించాయి. గడచిన ఏడేండ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెలంగాణలోకి ప్రవహించాయి. తత్ఫలితంగా ప్రైవేటు రంగంలో సుమారు 15 లక్షల ఉద్యోగావకాశాలు తెలంగాణ బిడ్డలకు ఏర్పడ్డాయి. ఒక్క ఐటీ రంగంలోనే మూడు లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చాయి. రాష్ర్టావతరణ జరిగిన 2014లో తెలంగాణ నుంచి ఐటీ ఉత్పత్తులు, సేవల ఎగుమతులు రూ.57,000 కోట్లు ఉంటే అవి ప్రస్తుతం రెట్టింపు కన్నా ఎక్కువై ఈ ఏడాది రూ.1,45,000 కోట్లకు చేరుకున్నాయంటే దానికి కేటీఆర్‌ నాయకత్వపటిమే కారణం.

ప్రపంచంలోనే టాప్‌ పొజిషన్‌లో ఉండే టెక్‌ కంపెనీలు గూగుల్‌, ఆపిల్‌, అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌తోపాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవల సంస్థలు గోల్డ్‌మన్‌ శాక్స్‌, స్టేట్‌ స్ట్రీట్‌, మాస్‌ మ్యూచువల్‌, డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌, టెక్స్‌టైల్‌ దిగ్గజ కంపెనీలు యంగ్‌ వన్‌, వెల్‌స్పన్‌, కిటెక్స్‌, ఏరోస్పేస్‌ రంగంలో బోయింగ్‌, లాఖీద్‌ మార్టిన్‌, జీఈ ఏవియేషన్‌.. ఇంకా అనేక ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు ఇవ్వాళ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కేటీఆర్‌ చేసిన అవిశ్రాంత కృషే కారణం.

2020 మార్చి నుంచి కొనసాగుతున్న కరోనా విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ కేటీఆర్‌ విశ్వరూపం చూపారనే చెప్పాలి. లాక్‌డౌన్‌ కాలాన్ని సదవకాశంగా మలుచుకోవాలని సూచించిన కేటీఆర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్లు, రోడ్ల పనులను చకచకా పూర్తిచేయించారు. కొవిడ్‌ వ్యాధి బారినపడి ప్రాణరక్షక మందు లు, ఆక్సిజన్‌, దవాఖాన బెడ్స్‌ దొరకని వేలమందికి కేటీఆర్‌ ఆపద్బాంధవుడిగా నిలిచారు. రాత్రీ పగలూ తేడా లేకుండా ఆయన గొప్ప స్ఫూర్తిదాయకమైన పనితీరు కనబరిచారు. మన రాష్ట్రం నుంచే కాక ఎక్కడో సుదూరాన ఉన్న గుజరాత్‌ నుంచి కూడా కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా సాయం చెయ్యమని విజ్ఞప్తులు అందాయంటే ఆయన సేవాగుణం గురించి తెలంగాణ వెలుపల కూడా ఎంతమందికి తెలుసో మనకు అవగతమవుతుంది.

ఒకనాడు సంక్షోభానికి చిరునామాగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం నేడు కేటీఆర్‌ సారథ్యంలో సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నది. గత రెండేండ్లుగా ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ పేరిట తన పుట్టినరోజునాడు ఆపన్నులకు అండగా ఉండాలనే పిలుపునిస్తున్నారాయన. గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడాలని ఆయన స్వయంగా ఆరు అంబులెన్సులను ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కార్యక్రమం కింద బహూకరించారు. కేటీఆర్‌ పిలుపును అందుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, దాతలు ముందుకు వచ్చి 100 అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా ఇచ్చారు. ఇక ఈ ఏడాది పుట్టినరోజుకు ఇంకో వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నారు కేటీఆర్‌. దివ్యాంగులకు 100 స్కూటర్లను తాను ఇస్తూ, ఇతరులు కూడా ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కింద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి విశేష స్పందన వస్తున్నది.

ఇవ్వాళ దేశంలో ఏ రాష్ర్టానికి లేని ఒక గొప్ప కాంబినేషన్‌ తెలంగాణకు ఉన్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ రాష్ట్ర విధానాలు, పథకాల రూపకల్పన, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటి పారుదల వంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. బ్రాండ్‌ హైదరాబాద్‌, పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించటం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు కేటీఆర్‌ చూసుకుంటున్నారు. అందువల్లనే అటు వ్యవసాయం నుంచి ఇటు ఐటీ వరకు అన్ని రంగాల్లో తెలంగాణ రికార్డులు బద్దలుకొట్టే విజయాలను నమోదు చేయగలుగుతున్నది. సమ్మిళిత అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ నేడు రూపాంతరం చెందింది అంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, యువమంత్రి కేటీఆర్‌ ఆచరణ.
రాష్ట్రం విడిపోతే మిమ్మల్ని మీరు పాలించుకోగలరా? ఆ సత్తా ఉన్న నాయకులు ఉన్నారా? అని వెటకారం చేసిన పరిస్థితి నుంచి ఇవ్వాళ మాకూ కేటీఆర్‌ లాంటి యువనాయకులు ఉంటే బాగుండు అని పొరుగు రాష్ర్టాల ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ కీర్తి పతాకను ప్రపంచ యవనిక మీద సగర్వంగా ఎగరేసే డైనమిజం, ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించే నాయకత్వ పటిమ, ఎంతటి వారినైనా మెప్పించి ఒప్పించే వాక్చాతుర్యం, అబ్బురపరిచే విషయపరిజ్ఞానం, అన్నిటికీ మించి సాటి మనిషి పట్ల చూపే ఔదార్యం కేటీఆర్‌ సొంతం. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

కొణతం దిలీప్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana