Tabu | భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి టబు ఇప్పుడు తన కుటుంబం నుంచి మరో నట వారసుడిని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఆమె సోదరి, ఒకప్పటి ప్రముఖ నటి ఫరా నాజ్ కుమారుడు ఫతే రంధవా త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో టబు, ఫతే కలిసి దిగిన సెల్ఫీలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో వారి మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించడంతో పాటు, ఫతే లుక్స్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫతే రంధవా మరెవరో కాదు… ప్రముఖ నటి ఫరా నాజ్, సీనియర్ నటుడు విందు దారా సింగ్ కుమారుడు. అంటే లెజెండరీ నటుడు, రెజ్లర్ దారా సింగ్ మనవడు కూడా. గత కొంతకాలంగా నటనలో శిక్షణ తీసుకుంటున్న ఫతే, తన తాత దారా సింగ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయంలో టబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు కెరీర్ కోసం సరైన కథలు, దర్శకులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఫతే ప్రముఖ నిర్మాణ సంస్థల వద్ద సహాయ దర్శకుడిగా పని చేసి సినీ రంగంలోని మెళకువలు నేర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
టబు, ఫరా నాజ్ సోదరీమణులు హైదరాబాద్‌కు చెందినవారే. టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లో చదువుకున్న ఆమె తర్వాత ముంబైకి వెళ్లి సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. మరోవైపు 1980లలో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగిన ఫరా నాజ్, తర్వాత కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఫరా నాజ్ తన కుమారుడు ఫతేతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. తన కుమారుడు మంచి నటుడిగా ఎదగాలని ఆమె ఆశిస్తుండగా, ఫతే కూడా తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని కృషి చేస్తున్నాడు. టబు అనుభవం, పరిచయాలు ఫతే కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి టబు మేనల్లుడు ఫతే రంధవా వెండితెర అరంగేట్రంపై ఆసక్తి పెరుగుతోంది