‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పచ్చదనం ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియచేస్తూ ప్రతి గ్రామం పచ్చదనంతో వెల్లివిరియాలి. అందరూ తమ ఇండ్ల ముందు, ఇంటి ఖాళీస్థలాల్లో మొక్కలు నాటాలన్నారు.ఇందుకోసం అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటించాలి అని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధితోపాటుగా 33 శాతం వున్న అటవీ ప్రాంతంగా కూడా ఉండాలన్న కేసీఆర్ ఆకాంక్షను అందరూ అర్థం చేసుకొని ఈ హరితహారంలో భాగస్వాములు కావాలి.
రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా చేయాలంటే 230 కోట్ల మొక్కలను నాటాలి. ఇంతకు మించిన అద్భుతమైన కార్యక్రమం ప్రపంచంలో మరొకటి లేదు. సృష్టిలోని ప్రతి ప్రాణి బతకాలంటే చెట్లే ఆధారం. చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ మాత్రమే అన్ని ప్రాణులను రక్షిస్తుంది. రాష్ట్రంలో ఆరేండ్లుగా హరితహారం అద్భుతంగా అమలు జరుగుతున్నది. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సర్పంచ్, గ్రామ కార్యదర్శిని బాధ్యులను చేయడం వల్ల పచ్చదనం పెరిగింది. చెట్లకు నీళ్లు పోయడానికి వీలుగా ప్రతి గ్రామానికి ట్యాంకర్, ట్రాలీతో కూడిన ట్రాక్టర్‌ను కూడా ప్రభుత్వం సమకూర్చింది.
ఇప్పుడు ఉనికిలో ఉన్న అడవులను రక్షించుకోవటంతోపాటుగా, గతించిపోయిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి వీలుగా చేపట్టిన హరితహారం సజావుగా సాగిపోతున్నది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు జీవ వైవిధ్యంతో కూడుకొని ఉన్నది. అక్కడ మనుషులకే కాదు.. అన్నిరకాల జీవులకు వందేళ్లు బతకడానికి సరిపోయే ఆక్సిజన్ దొరుకుతుంది. రాష్ట్రప్రభుత్వం మొత్తం 109 ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్రీ లను నెలకొల్పింది. నగరాలు, పట్టణాల్లో మేజర్ పార్కులు, థీమ్ పార్కులతో పాటుగా కాలనీ పార్కులు, సెంట్రల్ మీడియన్సు, ట్రాఫిక్ ఐ-ల్యాండ్స్, ట్రీ పార్కులను నిర్మిస్తున్నది. సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్టు కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 డిసెంబర్ 11న ప్రారంభించారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని పరిరక్షించే ఆశయంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న ఉద్యమాన్ని ఇటీవల ప్రధాని ప్రశంసించారు. ఇది మన తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవంగా భావించాలి. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి హరిత సవాల్ విసరడం, ఆ ముగ్గురు మూడేసి మొక్కలు నాటడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలలో గ్రీన్ ఛాలెంజ్ వినూత్నమైనది.
పర్యావరణంలో సమతూకం లేనందువలన తలెత్తే కొత్త కొత్త వ్యాధులు, అకాల వర్షాలు, కరువు, కార్చిచ్చులను చెట్ల పెంపకం ద్వారా నివారించవచ్చును. సముద్రాల్లో, చెరువుల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ అక్కడున్న జీవజాతులకు ముప్పు ఏర్పడుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల వలన మంచు కరిగిపోతూ ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడి నదుల్లోని నీరు ఉప్పొంగి జల ప్రళయం సంభవిస్తున్న తీరును మనం చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ ఆశయంతో 2015 జూలై 3 న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ముఖ్యమంత్రి హరిత హారం ప్రారంభించారు. దీని లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడంతో పాటుగా అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం.
‘వానలు తిరిగి వాపస్ రావాలి, కోతులు అడవికి వాపస్ పోవాలి’ అనే నినాదంతో అటవీ సంపదను పెంచుకోవడం జరుగుతున్నది. హరితహారంలో మియావాకీ పద్ధతిని కూడా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మొక్కలు చాలా తొందరగా దట్టంగా పెరుగుతాయి. 230 కోట్ల మొక్కలు నాటాలనే హరిత హారం లక్ష్య సాధనలో భాగంగా విరివిగా మొక్కలు నాటటమే కాదు.. వాటిని సంరక్షించుకోవాలి.
అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, మిగతా ప్రాంతాల్లో.. అంటే పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలు, పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ,వ్యవసాయ క్షేత్రాలు , మార్కెట్ యార్డులలో, రహదారుల పక్కన, పొలం గట్ల మీద చెరువు గట్ల మీద, ఇంటి పరిసరాల్లో 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు మొత్తం 230 కోట్లు మొక్కలు నాటి, సంరక్షించుకోవాలి. అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర వైశాల్యంలో 33 శాతానికి విస్తరించుకోవాలి. రాష్ట్రంలో పచ్చదనం ఇప్పటికే 28 శాతానికి చేరుకున్నందున మరో 5 శాతాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రం 33 శాతం అడవులున్న రాష్ట్రంగా దేశానికే ఒక రోల్‌మోడల్ అవుతుంది. మంత్రి కేటీఆర్ అత్యంత చొరవ తీసుకుని అర్బన్ ఫారెస్ట్రీ కింద అత్యాధునిక హంగులతో ప్రజలకు అనుకూలంగా వుండే పార్కులను ఏర్పాటు చేయిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, బ్యారేజీల వద్ద వున్న ఖాళీ స్థలాలలోను, చెరువు గట్ల మీద మొక్కలు పెంచడం జరుగుతున్నది. పల్లె ప్రగతి కింద భారీఎత్తున గ్రామాలలో నర్సరీలు ఏర్పాటు చేయడం విశేషం.
కండ్లకోయలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆక్సిజన్ పార్కు జీవ వైవిధ్యంతో కూడుకొని ఉన్నది. అక్కడ మనుషులకే కాదు.. అన్నిరకాల జీవులకు వందేళ్లు బతకడానికి సరిపోయే ఆక్సిజన్ దొరుకుతుంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరాణాన్ని పరిరక్షించే ఆశయంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న ఉద్యమాన్ని ఇటీవల ప్రధాని ప్రశంసించారు. ఇది మన తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవంగా భావించాలి.
–కన్నోజు మనోహరా చారి