జంఘాల శాస్త్రి చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు బొర్రయ్యశెట్టి ఇంకా రాలేదేమోనని. కొత్త విషయాలు బోధించి రాపిద్దామని. ఇంతలో నీరసంగా రానేవచ్చాడు బొర్రయ్యశెట్టి.
జంఘాలశాస్త్రి: ఏంటి శిష్యా ఇంత ఆలస్యం.
బొర్రయ్యశెట్టి: ఏముంది గురువు గారూ కాంగ్రెస్‌కు అధిష్ఠానం చేసింది కాయకల్ప చికిత్సా లేక రోగం ప్రకోపించే పనికిరాని వైద్యమా అనేది అర్థం కావటం లేదు. అంటూ బుర్ర గోక్కున్నాడు.
శాస్త్రి: ఏమైంది?
బొర్రయ్య: ఏముంది గురువు గారూ పార్టీకి కొత్తరక్తం ఎక్కిద్దామనుకొని కార్యవర్గాన్ని ప్రకటించింది. ఓహో చాలా పెద్ద దే. పార్టీ టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి ని పెట్టారు కదా. వైస్ ప్రెసిడెంట్‌గా బోలెడు మంది ఇంకా వేర్వేరు పదవుల్లో బోలెడు మంది. కానీ ఇంతలోనే పార్టీ మొత్తం అల్లకల్లోలమయ్యేలా ప్రకటనలు. ఇదేమిటి గురువు గారూ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లయింది కదా.
జంఘాలశాస్త్రి: అవును శిష్యా, ఆ పార్టీ ఎప్పుడూ అంతే. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఇంతకుముందు నుంచీ చాలామంది ఎదురుచూశారు. బీసీ వర్గం నుంచి ఇవ్వాలని, సీనియర్ నాయకుడు హనుమంతరావు, ఇంకా కొందరు పట్టుబట్టారు. బీసీల్లో యువతరానికి అవకాశం ఇవ్వాలని మరికొందరు అడిగారు. ఇక ఎస్సీ వర్గం నుంచి కావాలని మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి వారు కూడా భావించా రు. సీనియర్ నాయకుడు మధుయాష్కీ ఆశించాడు. రేవంత్‌రెడ్డి సామాజిక వర్గానికే చెందిన నాయకులు చాలామంది ఉదాహరణకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఇంకా కొందరు ఆశించారు. కానీ అధిష్ఠానం రేవంత్ పట్ల మొగ్గు చూపడానికి దాని కారణాలు దానికి ఉంటాయి. రేవంత్ గట్టిగా మాట్లాడగలడని, అందరినీ కలుపుకొనిపోగలడని ఇలాంటి ఊహలు లేదా భ్రమలేవో ఉండి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ పాదులోని రాజన్న రాజ్యం తెస్తానని పార్టీ పెట్టిన షర్మిలమ్మకు చెక్‌పెట్టే ప్రయత్నం కూడా కావచ్చు. కానీ ఏం జరిగిం ది. కోమటిరెడ్డి బహిరంగంగా బయటికి వచ్చి తీవ్రమైన విమర్శ చేశాడు. ఇక మర్రి శశిధరరెడ్డికి ఈ నియామకం
ఏమీ ఇష్టం లేనట్లు తెలుస్తున్నది. అందుకే పార్టీ కి రాజీనామా చేయలేక చేస్తున్న పదవికి రాజీనామా చేశాడు. ఇక ఇప్పటిదాకా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి అసెంబ్లీలో, బయటా తన పార్టీని గట్టిగా నిలబెడుతూ అధికార పార్టీపైన విమర్శలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నాననుకొన్న భట్టి తనకు పీసీసీ అధ్యక్ష పద వి వస్తుందని భావించడంలో ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కానీ అధిష్ఠానం అలా చేయకపోయేసరి ఆయనా హతాశుడై మౌనం వహించాడు.ఇలా చాలామంది నాయకులను హతాశులను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. కానీ రేవంత్‌కు పదవి ప్రకటించగానే, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పి తన ధీమాను వ్యక్తం చేశాడు. ఇలాంటి పని ఆయన చేయగలడనే భ్రమలోనే అధిష్ఠానం ఆయనకు ఈ పదవిని కట్టబెట్టిందని ఇప్పటికి స్పష్టం అవుతుంది కదా.
బొర్రయ్యశెట్టి: కానీ గురువుగారూ టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులైన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏమన్నారో గమనించారా.
జంఘాలశాస్త్రి: అవును శిష్యా రేవంత్‌రెడ్డి తన పార్టీని అధికారంలోనికి తీసుకురావడం సంగతి అటుంచి ముందు తన సంసారాన్ని, అంటే పార్టీని చక్కదిద్దుకునేసరికే ఈ రెండేండ్లు సరిపోతుందన్నారు. ఇదే నిజం శిష్యా. ఇప్పుడున్న అంతర్గత పరిస్థితిలో ఈ కుమ్ములాటలు ఒక దారికి రావడానికే ఆయన అన్నట్లు రెండేండ్లు పడుతుంది. ఇక ఆ తర్వాత ఎలక్షన్ ప్రకటించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అనే మీమాంస వస్తుంది. ఒకరి పేరు చెప్తే తొమ్మిది మంది కాదు నా పేరు ఉండాలంటారు. ఈ విధమైన అనైక్యత కారణంగానే 1983లో ఏమి జరిగిందో గుర్తుకువచ్చిందా శిష్యా. ముగ్గురు ముఖ్యమంత్రు లు అనతికాలంలో మారారు. ఈ పరిస్థితిలోనే తెలుగుజాతి ఆత్మగౌరవం అనే ఒకే ఒక నినాదంతో కొత్త పార్టీని అధికారంలోకి తెచ్చాడు ఎన్టీవోడు. శిష్యా వచ్చేకాలంలో కాంగ్రెస్‌కు మరిన్ని చిరుగులు పడవచ్చు, కానీ కొత్త అధ్యక్షు డు ఉన్న చిరుగులను కుట్టే పనేచేయలేడని నాకు అనిపిస్తున్నది.
బొర్రయ్యశెట్టి: గురువుగారూ టీఆర్ఎస్ కూడా తెలంగాణ ఆత్మగౌరవం అనే ప్రధాన నినాదంతో పాటు ‘నీళ్లు, నిధులు నియామకాలు’ అనేదానిపై రాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది కదా. చెప్పిన నినాదాలను సాకారం చేస్తూ బంగారు తెలంగాణను సృష్టించే పనిలో ఉంది కదా, ఇలాంటి పార్టీని మిగతా పార్టీలు ఏమి చేయగలవు. బీజేపీ పరిస్థితి ఏమిటి గురువు గారూ.
జంఘాలశాస్త్రి: శిష్యా బీజేపీ జాతీయ పార్టీ దాని రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా దాని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. వారికి జాతీయస్థాయిలో ఉన్న ఎజెండానే రాష్ట్రంలోనూ అమలుచేసే ప్రయత్నం చేస్తారు. అంతేకానీ తెలంగాణ పట్ల వారికి ప్రత్యేకమైన ప్రేమ ఏదీ ఉండదు. అంతెందుకు ఇప్పుడు కేంద్రంలో వారి పార్టీయే ఉంది కదా. వారు తెలంగాణ రాష్ర్టానికి కావలసిన ఒక్క పనైనా చేయించారా. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవచ్చు. దాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు. రాష్ట్ర విభజన జరగగానే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి మొత్తం ఖర్చును భరించిన ప్పుడు ఆ పని ఇక్కడ కూడా చేయవచ్చు కదా, చేయలేదు. నిబంధనల ప్రకారం రాష్ర్టానికి రావలసిన ఆర్థిక వ్యవహారాలలో కూడా సమస్యలు సృష్టిస్తూ ఉంది కానీ రాష్ర్టానికి చేయూతనిచ్చే పని చేయ డం లేదు. అందుకే వారికి జాతీయ ఎజెండా ముఖ్యం తెలంగాణ ఆత్మగౌరవం కానీ దాని అస్తిత్వంతో కాని దానికి పనిలేదు. ఇక వచ్చే ఎన్నికలలో దాని పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితికి భిన్నంగా ఉండకపోవచ్చు.అందుకే శిష్యా ప్రాంతీయ అస్తిత్వాల ను ప్రాంతీయ పార్టీలే కాపాడతాయి. కాబ ట్టి శిష్యా కాంగ్రెస్ పార్టీకి అధిష్ఠానం చేసిన కాయకల్ప చికిత్స వికట చికిత్స అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.