కేంద్రం సాచివేత, ఆధిపత్య శక్తుల నుంచి అణిచివేత… తన వారి నమ్మక ద్రోహం, అయినా విఫలం కాని వ్యూహం… తెలంగాణ కోసమే తన్లాట… రాష్ట్ర సాధన కోసం ప్రయాణమంతా ముళ్లబాట.. చిట్టచివరి క్షణం దాకా ఉత్కంఠ!
‘రుక్ జానా నహీఁ తూ కహిఁ హార్ కే కాంటోపే చల్కే మిలేంగె సాయ్ బహార్‌కే..’మజ్రూహ్ సుల్తాన్‌పురి గేయం అంతరార్థం తెలంగాణ విషయంలో మరోసారి రుజువైంది.
విరహంలోంచి వచ్చిన ప్రేమ, బాధ తర్వాతి ఆనందం ఎక్కువ మధురంగా ఉంటాయంటారు. తెలంగాణ సాధన కేసీఆర్‌కు ఇలాంటిదే. తానొక్కడుగా, తన వెంట ముగ్గురుగా నడక మొదలుపెట్టి, మూడు కోట్ల తెలంగాణ ప్రజలను వెంట నడిపించిన నాయకుడు కేసీఆర్. రాష్ట్రం వస్తుందో రాదో అనుకున్న తెలంగాణకు, వచ్చి తీరుతుందన్న నమ్మకం కలిగించి, తెచ్చి నిరూపించిన నేత కేసీఆర్. ఇప్పుడెవరైనా ఎన్నైనా మాట్లాడవచ్చు. అంతా తామే సాధించామంటారు. తాను కాళ్లు పట్టుకుంటేనే తెలంగాణ వచ్చిందంటారు ఒకరు. తాను బెదిరించి తెచ్చానంటారు మరొకరు. తెలంగాణ రాక సమయాన్ని, సన్నివేశాన్ని, సందర్భాన్ని రచించింది కేసీఆర్.
14 ఏళ్ల ఒడిదుడుకుల ప్రయాణంలో.. తాను ఎన్నోమార్లు కంటతడి పెట్టుకున్నారు. కానీ తన బాధను మనసులోనే దాచుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు. వైఫల్యం విజయానికి సోపానం అన్నట్టుగా, ప్రతి ఎదురు దెబ్బను ఎత్తి కుదేసి దానిపై విజయ శిఖరాలకు దారి వేశారు. అనేక ఆవేదనల నుంచి అంతులేని విజయాన్ని సాధించిన తీరుపై వి. ప్రకాశ్ జ్ఞాపకాల జాలు ఇది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఆవిర్భావానికి 8 నెలలకు ముందు కేసీఆర్‌ను తొలిసారి కలిశాను. మా మొదటి సమావేశం సుమారు 10 గంటల పాటు జరిగింది. వివిధ రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆయన ముఖంలో బాధ వ్యక్తమవ్వడం గమనించాను. కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాడని అర్థమైంది. ఆనాటి నుంచి తెలంగాణ ఆవిర్భావం నాటివరకు ఎక్కువకాలం కేసీఆర్‌తో గడిపే అవకాశం నాకు కలిగింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో కేసీఆర్ బాధపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
పార్టీ ఏర్పాటుకు ముందు
టీఆర్ఎస్ ఆవిర్భావానికి పూర్వం అనేక మంది నాయకులతో, ప్రజాప్రతినిధులతో, శాసనసభ్యులతో కేసీఆర్ చర్చించారు. వీరిలో చాలామంది ముందుకొచ్చినట్టే కనిపించారు, ప్రోత్సహించారు. తీరా పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించిన నాడు వీరిలో అత్యధికులు కేసీఆర్ వెంటరాలేదు. టీడీపీలో తనతో పనిచేసిన కొందరు నాయకులు, బీజేపీ, కాంగ్రెస్‌లలోని కొందరు నాయకులు, దిగువస్థాయి కార్యకర్తలను, కొంత కాలంగా తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేస్తున్న నా వంటివారిని వెంటబెట్టుకొని తన తెలంగాణ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కేసీఆర్. పార్టీని ముందుకు
నడిపించడానికి చేతిలో డబ్బు లేకపోయినా కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగారు.
ఉద్యమ పాఠాలు.. పాలకుల కుట్రలు
2002 ఫిబ్రవరి రెండో వారంలో పార్టీ ముఖ్య నాయకులకు, స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రాజకీయ శిక్షణా తరగతులను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న సందర్భంలో, హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ‘జలదృశ్యం’పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడి చేసి ఆఫీసును ఖాళీ చేయించారు. ప్రముఖ తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉచితంగా తన ఇంటిని టీఆర్ఎస్ వినియోగానికై ఇచ్చారు. టీఆర్ఎస్ ఆఫీసుతో పాటు బాపూజీ ఇంటిని కూడా ఖాళీచేసి సామగ్రినంతా గోషామహల్‌కు తరలించారు పోలీసులు. శిక్షణాతరగతులు నిర్వహిస్తున్న కేసీఆర్‌కు విషయం తెలిసింది. పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఆయన ముఖంలో బాధను, ఆవేశాన్ని చూశాను. క్షణకాలంలోనే ఆ బాధను, ఆవేశాన్ని దిగమింగుకొని నగర కార్యకర్తలను శాంతియుతంగా నిరసన తెలపాలని ఆదేశించారు.
ఇద్దరూ గెలుస్తారనుకుంటే..
2003 మే 20-25 తేదీల్లో రాజోలిబండ డైవర్షన్ పథకం కాల్వ కింది ఆయకట్టు ప్రాంతం (ఆలంపూర్, గద్వాల, నియోజకవర్గాల పరిధిలోని)లో కేసీఆర్ పాదయాత్ర నిర్వహించారు. మండుటెండలు, ఒంట్లో విపరీతమైన జ్వరం. శారీరక బాధను బయటికి తెలియనివ్వకుండా అనుకున్న ప్రకారం పాదయాత్ర పూర్తిచేశారు. అప్పటిదాకా ఆర్డీఎస్ కాల్వను ఏ నాయకుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పాదయాత్ర సందర్భంగా వచ్చిన స్పందన చూసి ఆ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో గెలిచి తీరుతారని ప్రతిపక్షాలు కూడా భావించాయి. ఎన్నికల పొత్తులో భాగంగా టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంతో పాటు, గద్వాల స్థానాన్ని కూడా కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసి తీసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ చేసిన మోసంతో గద్వాలలో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాముడు, ఆలంపూర్లో డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఓడిపోవడం కేసీఆర్‌ను బాధించిన మరో సందర్భం. పాదయాత్రలో తన వెంట కదిలిన వేలాది ప్రజలు ఎందుకు ఓట్లేయలేదని మథనపడ్డారు.
రాష్ట్ర ప్రకటన.. పొద్దుపొడుపు
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వాలు 2004లో ఏర్పడినాయి. యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరాలని కేసీఆర్‌ను సోనియా గాంధీ అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రం కోసం యూపీఏలో చేరడమే మేలని మేమంతా పట్టుబట్టి కేసీఆర్‌ను ఒప్పించాం. రాష్ట్ర, కేంద్రమంత్రి వర్గాలలో టీఆర్ఎస్ చేరింది. దీన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్కు వెలుపల ఉన్న కొందరు ‘తెలంగాణవాదులు’ కేసీఆర్‌ను ‘తెలంగాణ ద్రోహి’ అంటూ నోటికొచ్చినట్టు నిందించారు. మరో చెన్నారెడ్డి అని వ్యాఖ్యలు చేశారు. ఈ తెలంగాణవాదుల వైఖరి కేసీఆర్‌ను ఎంతో బాధించింది. వట్టి ఆవేశం, ఆగం తప్ప వీరెప్పుడు సరిగ్గా ఆలోచిస్తారంటూ తన ఆవేదనను మాతో పంచుకున్నారు. నిజానికి ఆనాడు యూపీఏలో భాగస్వామ్యం ఉన్నందుకే ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’లో తెలంగాణ ఎజెండా అంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్‌కు సాధ్యపడింది. దాని కొనసాగింపే డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన.
ప్రణబ్ కమిటీ సాచివేత
తెలంగాణ కోసం ప్రణబ్ కమిటీని నియమించి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కేసీఆర్‌ను బాధించిన మరొక వ్యవహారం. కేసీఆర్‌తో మేం పలుమార్లు సోనియాగాంధీని, ప్రణబ్‌ముఖర్జీని, మన్మోహన్సింగ్ను, అహ్మద్ పటేల్‌ను కలిశాం. ఏదో వంకతో వారు తెలంగాణ అంశాన్ని నాన్చుతున్నట్లు కేసీఆర్ గ్రహించారు. నమ్మిన కాంగ్రెస్ ఎందుకు ఇలా చేస్తున్నదని కేసీఆర్ తరచూ ఆవేదన చెందేవారు.
నిధులివ్వని వైఎస్
కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖామంత్రిగా ఉన్నరోజుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి పథకాన్ని మంజూరు చేయించారు. తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు సిద్దిపేట
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మంచినీటి పథకం అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రన్నాయుడు సహకారంతో తెచ్చి విజయవంతంగా అమలుచేశారు. అలాంటి పథకాన్నే కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అమలుచేయాలనుకుంటే ఆనాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి
నామమాత్రపు రాష్ట్ర వాటా నిధులిచ్చేందుకు నిరాకరించారు. కేసీఆర్, వినోద్‌రావు చేసి న కృషి వృథా అయ్యింది. ఆ బాధలో నుంచి పు ట్టిందే ‘మిషన్ భగీరథ’ పథకం. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి గడపకు తాగు నీరందిస్తున్నది.
తనవాళ్లే వెళ్లిపోతే..
టీఆర్ఎస్ యూపీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్లోని పది మంది శాసనసభ్యులను వైఎస్ ప్రలోభాలకు గురిచేసి తన గూటికి చేర్చుకున్నారు. ప్రమాదవశాత్తు కాలు విరిగి కేసీఆర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో తన ఉద్యమ సహచరులు వైఎస్ ప్రలోభాలకు లొంగిపోవడం కేసీఆర్‌ను ఎంతో బాధించింది. 2008లో చట్టసభలకు ఎన్నికైన తమ పార్టీ వారితో కేసీఆర్ రాజీనామా చేయించారు. నలుగురు ఎంపీలు, 16 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరిలో ఎంపీలుగా కేసీఆర్, వినోద్‌రావు, శాసనసభ్యులుగా ఏడుగురు, ఎమ్మెల్సీలుగా ఇద్దరు తిరిగి ఎన్నికైనారు. యూపీఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామ ని మాట ఇచ్చి, కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో చేర్చి మోసం చేసినందుకు నిరసనగా కేసీఆర్ మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ సాధనలో భాగంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలెందుకు అర్థం చేసుకోలేదని కన్నీళ్లు పెట్టుకుని టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బహుశా టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ను ఇంత ఎక్కువగా బాధించి న విషయం మరొకటి ఉండకపోవచ్చు. తాను నమ్ముకున్న ప్రజలే ఇలా చేయడం ఊహకందనిది.
ఊహించని కుట్ర
2009 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చీలిక తేవడానికి తద్వారా తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకోవడానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరో కుట్ర చేశాడు. పార్టీపై కొంత అసంతృప్తితో ఉన్న వికారాబాద్ మాజీ శాసన సభ్యులు డాక్టర్ ఎ. చంద్రశేఖర్‌ను, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ను, మరికొందరు నేతలను తన కుట్ర కోసం వినియోగించుకోవాలనుకున్నారు. ఈ నేతలు తెలంగాణ భవన్‌లోకి చొరబడి టీఆర్ఎస్కు అసలైన నాయకులం మేమేనంటూ అల్లరి చేశారు. అల్లరవుతుంది, పోలీసులు వచ్చి అందరినీ పంపించి భవన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు.. ఇదీ స్కెచ్. అనుకున్న వేళకు పెద్ద సంఖ్యలో పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టారు. ఇదంతా గమనించిన డాక్టర్ ఎ. చంద్రశేఖర్ అసంతృప్త నేతలతో సమావేశాన్ని తన ఇంట్లో పెట్టాడు. వైఎస్ కుట్రలో భాగం కాదల్చుకోలేదు. తన వాళ్లతోనే వైఎస్ ఇంత నీచమైన కుట్రకు తెగబడుతాడని కేసీఆర్ ఏనాడూ ఊహించలేదు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసినడిచే సహచరులే వెన్నుపోటుకు సిద్ధపడడం కేసీఆర్‌ను బాధించిన మరో సందర్భం.
చంద్రబాబు దగా
2008 విజయదశమి రోజున టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసి ఆలేఖను కమిటీకి ఇచ్చింది. తదనంతరం జరిగే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ సానుకూల ఓట్లు చీలిపోగూడదనే సదుద్దేశంతో తెలంగాణ ఏర్పాటుకు టీడీపీని పూర్తిస్థాయిలో కమిట్ చేయించడానికి కేసీఆర్ చంద్రబాబుతో ఎన్నికల పొత్తుకు సిద్ధపడ్డారు. పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు ఇచ్చిన స్థానాల్లో చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు ‘బీఫాం’లు ఇచ్చి వెన్నుపోటు పొడవటం, టీఆర్ఎస్ కేవలం పది స్థానాల్లోనే గెలవడం కేసీఆర్‌ను ఇబ్బందికి గురిచేసిన మరో సందర్భం. ఎంపీలుగా కేసీఆర్, విజయశాంతి మాత్రమే గెలిచారు. కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోలు పోసుకొని అంటించుకుని, ఆతర్వాత మరణించటం, నిమ్స్ ఆస్పత్రిలో నిరాహారదీక్ష చేస్తున్న కేసీఆర్ ఈ విషయం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకోవటం అక్కడున్న అందరికీ కంటతడి పెట్టించిన సంఘటన.
2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం
తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసి డిసెంబర్ 24న తెలంగాణ ఏర్పాటును పక్కన పెట్టడం కేసీఆర్ ఊహించని పరిణామం. కొద్దిసేపు బాధపడ్డా వెంటనే తేరుకొని జానారెడ్డి ఇంటికి చేరుకొని ‘టీ-జాక్’ను ఏర్పాటు చేశారు. తాను ఎంపిక చేసిన జాక్ కన్వీనర్ కోదండరాంను ‘మిలియన్ మార్చ్’ వాయిదా వేయమని కోరితే తన మాటను ఖాతరు చేయకపోవటం కేసీఆర్‌ను ఎంతో బాధ పెట్టింది. వారిద్దరికీ సంధానకర్తగా ఆరోజు నేనే ఉన్నాను. మిలియన్ మార్చ్ వాయిదాకు సహేతుకమైన కారణం ఉందని నేను నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా కోదండ వినలేదు. వాయిదా వేస్తే రాంగ్ మెసేజ్ పోతుందని వాదించారు. ఆ రోజునుంచే ఇద్దరు నేతల మధ్య దూరం మొదలైంది.
జయశంకర్‌ను చూసి కన్నీళ్లు
2011లో జయశంకర్ సార్ మరణం కేసీఆర్‌ను ఎంతో బాధకు గురిచేసింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రి నుంచి జయశంకర్‌ను డిశ్చార్జి చేస్తున్నారని, ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని తెలిసి వెంటనే కేసీఆర్ ఆస్పత్రికి వచ్చారు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న నాకు, ఆర్.విద్యాసాగర్‌రావుకు కూడా దుఃఖం ఆగలేదు. ఆరోగ్యస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్న కేసీఆర్ హెలికాప్టర్లో క్షేమంగా సార్‌ను వరంగల్ చేరుస్తానన్నారు. జయశంకర్ సార్ నన్ను దగ్గరకు పిలుచుకొని హెలికాప్టర్ వద్దని అంబులెన్స్ చాలని కేసీఆర్‌కు చెప్పమని నాతో అన్నారు. గవర్నర్ నరసింహన్ అమెరికాకు పంపించి చికిత్స చేయిస్తానంటేనే తాను నిరాకరించానని జయశంకర్‌సార్ నాతో చెప్పారు. అందరం సారు మాటకు విలువనిచ్చి అంబులెన్స్‌లోనే పంపించాం. చివరిసారి సారుతో విడిపోతున్నప్పుడు కేసీఆర్‌కు కన్నీళ్లు ఆగలేదు. బాధను లోలోపలే దిగమింగుకొని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
రాజ్యసభలో ఉద్వేగం
తెలంగాణ ప్రస్థానంలో చివరిసారి కేసీఆర్‌ను కన్నీళ్లు పెట్టించిన సంఘటన 2014 ఫిబ్రవరి 20. రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్నది. బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు పలు సవరణలను తెస్తూ ఎలాగైనా బిల్లును తిరిగి లోక్‌సభకు పంపాలనే పట్టుదలతో ఉన్నారు. అప్పటికే లోక్‌సభ రద్దయ్యింది. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం బిల్లు పెడుతుందో లేదో తెలియదు. సభ గ్యాలరీలో ఉన్న కేసీఆర్‌కు, బీజేపీ నేత మాజీ కేంద్రమంత్రి విద్యాసాగర్ రావుకూ కన్నీళ్లు ఆగలేదు. ఆమోదం పొందకపోతే ఇన్నాళ్లు పడ్డ శ్రమ వృథా అవుతుంది. తెలంగాణ వెనక్కిపోతుంది. ఎంతో ఉత్కంఠ మధ్య చివరికి వెంకయ్యనాయుడు తెచ్చిన సవరణలన్నీ తోసిపుచ్చి బిల్లును ఆమోదించింది రాజ్యసభ. తుగ్లక్‌రోడ్‌లోని తన ఇంటికి వచ్చిన కేసీఆర్ నన్ను, మధుసూదనాచారిని ఆలింగనం చేసుకున్నారు. ఆ సాయంత్రం కేసీఆర్ ఆనందానికి అవధుల్లేవు. మా
అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
‘రుక్ జానా నహీఁ తూ కహిఁ హార్ కే కాంటోపే చల్కే మిలేంగె సాయ్ బహార్‌కే..’
మజ్రూహ్ సుల్తాన్‌పురి గేయం అంతరార్థం తెలంగాణ విషయంలో మరోసారి రుజువైంది.
కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమేమిటంటే..
తనలో ఎంతో బాధ, దుఃఖం ఉన్నా కొద్దిమంది అంతరంగికులతో మాత్రమే పంచుకునేవారు తప్ప నాయకులకు, కార్యకర్తలకు తెలియనిచ్చేవారు కాదు. ఎలాంటి విపత్కర ప్రతికూల సమయాల్లోనైనా నాయకుడు తన దృఢ చిత్తాన్ని ప్రదర్శిస్తేనే అనుచరులు, సహచరులకు మనో ధైర్యం కలుగుతుందని నమ్ముతారు కేసీఆర్.
ఎంతో ఉత్కంఠ మధ్య చివరికి వెంకయ్యనాయుడు తెచ్చిన సవరణలన్నీ తోసిపుచ్చి బిల్లును ఆమోదించింది రాజ్యసభ. తుగ్లక్‌రోడ్‌లోని తన ఇంటికి వచ్చిన కేసీఆర్ నన్ను, మధుసూదనాచారిని ఆలింగనం చేసుకున్నారు. ఆ సాయంత్రం కేసీఆర్ ఆనందానికి అవధుల్లేవు. మా అందరితో కలిసి
సెలబ్రేట్ చేసుకున్నారు.
వి.ప్రకాశ్