కేంద్రం సంస్కరణల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, కేసీఆర్ సంస్కరణలతో సంక్షేమాన్ని సాధించారు. కేంద్రం రాష్ర్టాల పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజలకు కావాల్సింది బలవంతపు సంస్కరణలు కాదని, బతుకులు మార్చే పథకాలని కేంద్రం తెలుసుకోవాలి. కేసీఆర్ ఆవిష్కరించిన తెలంగాణ అభివృద్ధి నమూనాను ఆదర్శంగా తీసుకోవాలి.
తెలంగాణ అరవై ఏళ్ల గోస తీర్చడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలి దశ ఉద్యమం దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. పోరాటాలతో పాటు రాజకీయ చైతన్యం ద్వారా రాష్ర్టాన్ని సాధించగలుగుతామని నమ్మిన కేసీఆర్ ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి తేవడం ద్వారా, రాష్ట్ర సాధన ఉద్యమంలో యావత్తు సమాజాన్ని భాగస్వామ్యం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రతి పథకం చరిత్రాత్మకం. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు సుపరిపాలనకు నిదర్శనం. కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకు వచ్చారు. తెలంగాణ యువతులు ఆత్మ గౌరవంతో అత్త వారింట్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశ్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టి తల్లిదండ్రుల రందిని తీర్చారు కేసీఆర్. మిషన్ భగీరథ ద్వారా రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి మంచి నీళ్ల గోస లేకుండా చేశారు. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన సమస్యలకు కొత్త చట్టంలో పరిష్కారం చూపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రం, ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుని వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నాయి.
తెలంగాణలో కుల వృత్తులపై ఆధారపడి బతికే వారికి కేసీఆర్ అండగా నిలబడ్డారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందించారు. యాదవులకు గొర్రెల యూనిట్లను అంద జేశారు. చేనేత కారులకు అనేక రాయితీలు ఇచ్చారు. బడుగు వర్గాల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు. పరిశ్రమలకు అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేశారు. పోలీసులకు అధునాతన ఆయుధాలు, వాహనాలు సమకూర్చి శాంతి భద్రతలు పటిష్ఠం చేశారు. మన ఊరు-మన బడి ద్వారా సర్కారీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశారు.
గీత కార్మికులకు ఈత వనాల పెంపకం కోసం స్థలాలు కేటాయించారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధులు… ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్నారు. దళితులకు ఆర్థిక సాధికారత కల్పించినప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న అంబేద్కర్ సూచనను గౌరవించి ఎటువంటి షరతులు లేకుండా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించి దళితుల స్వయం ఉపాధికి బాటలు వేశారు. కేసీఆర్ చేసిన మరో గొప్ప సంస్కరణ… ఉద్యోగాల నియామకం కోసం జోనల్ వ్యవస్థను సంస్కరించడం. ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానాన్ని పటిష్ఠం చేయడంలో కేసీఆర్ సఫలం అయ్యారు. రాష్ర్టాన్ని జోన్లు, మల్టీ జోన్లుగా విభజన చేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా చేశారు. ప్రజల జీవన, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టి తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు.
కేసీఆర్ అద్భుతమైన సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా తీసుకొచ్చిన సంస్కరణలన్నీ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. నోట్ల రద్దుతో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధికి గండి కొట్టింది. ప్రైవేటీకరణ పేరుతో అనేక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసింది. ఉద్యోగాలివ్వమని అడిగిన యువతను పకోడి బండ్లు పెట్టుకోవాలని ప్రధాని మోదీ హేళన చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్టు ఉద్యోగాలు తీసుకొచ్చారు. అగ్నిపథ్‌లో చేరిన అభ్యర్థులకు బట్టలు ఉతకడం, క్షవరం చేయడంలో నైపుణ్యం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవమానకరమైన మాటలు మాట్లాడారు. అగ్నిపథ్ కాల పరిమితి ముగిసిన తర్వాత యువతను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీంతో భాషను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా దేశమంతటా ప్రభుత్వ వ్యవహారాల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో, ఉద్యోగ పరీక్షల్లో హిందీని అధికార భాషగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గ విద్యార్థులకు ఉపకార వేతనాలు తక్కువగా అందిస్తూ పరిశోధనకు వారిని దూరం చేస్తున్నది. రాజకీయ ప్రయోజనాలే ప్రధాన అస్త్రంగా సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను కష్ట పెట్టడం సిగ్గు చేటు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను, సంక్షేమాభివృద్ధి పథకాలను దేశమంతటా అమలు చేయాలి.
(వ్యాసకర్త: దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516