‘ఎవరో జ్వాలను రగిలించారు- వేరెవరో దానికి బలియైనారు’ 1964లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి ఆత్రేయ రాసిన ఈ పాట ఆ రోజుల్లో శ్రోతల హృదయాలను ద్రవింపజేసేది. ఆ గీతం పల్లవిలోని ఆవేదనను నిన్నమొన్నటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిరసనకారులకు అన్వయించుకుంటే వారి దీనస్థితికి అది చక్కగా సరిపోతుంది.
నిశితంగా పరిశీలిస్తే… ఆ నిరసనకారులెవరికీ నేరచరిత్ర లేదు. వారు సంఘ విద్రోహశక్తులు కారు. ఇక ఉద్యమకారులు అసలే కాదు. వారంతా తమ శరీరంలోని అణువణువులో దేశభక్తిని నింపుకొన్న దేశభక్తులు. పదికాలాలు జీవించడమంటే దేశం కోసం మరణించడమేనని నమ్ముతూ, మాతృదేశ రక్షణలో తమకు తాము సమిధలుగా సమర్పించుకొనేందుకు ఉవ్విళ్ళూరుతున్న, ఉడుకురక్తం ప్రవహిస్తున్న యువకులు. తమను కన్న తల్లిదండ్రులకు, తాము పుట్టిన ఊరికి గొప్పపేరు తేవాలని కలలుగన్న ఆశాజీవులు. కానీ వాళ్లంతా ఈ రోజున విధ్వంసకారులుగా ముద్రవేయబడి కఠినశిక్షలు అనుభవించడానికి మన న్యాయస్థానాల ముందు నిలబెట్టబడ్డారు.
ఏ దేశం కోసమైతే తమ సర్వస్వాన్ని, చివరికి తమ ప్రాణాలను బలిపెట్టడానికి వారు సిద్ధపడ్డారో ఆ దేశ చట్టాలే ఇపుడు వారికి కఠిన శిక్షలను విధించే అవకాశాలున్నాయి. అయితే వీరి ఈ దుస్థితికి కారకులెవరు? పాలకులు-ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొంటున్నారు. ఈ యువకులంతా గత నాలుగేండ్లుగా శారీర ధారుడ్య శిక్షణ పొందుతూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అర్థంపర్థం లేని ‘అగ్నిపథ్’ పథకంతో, మీకు శాశ్వత ఉద్యోగమంటూ లేదు- కేవలం నాలుగేండ్లే ఉద్యోగమని చెప్పి, వాళ్ల చిరకాల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో ఈ విధ్వంసకాండ జరిగిందని ప్రతిపక్షాలు అంటుంటే.. ప్రతిపక్షాలే కూడగట్టుకొని ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించాయని కేంద్రంలోని పాలక పార్టీ విమర్శిస్తున్నది. ఆ విషయాన్ని మన నేర విచారణ సంస్థల దర్యాఫ్తు ఆధారంగా, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మన సమాజం ఆలోచించవలసిన విషయం చిద్రమవనున్న ఈ నిరసనకారుల భవిష్యత్తు గురించి, వారికి పడబోయే కఠినశిక్షల గురించి మాత్రమే.
ఈ పాపానికి అసలు సూత్రధారులు వారికి శిక్షణ ఇచ్చిన శిక్షణాసంస్థల స్వార్థమేనన్న ఒక కొత్త కోణం బయటపడింది. వెలుగుచూస్తున్న ఈ కోణం నుంచి వాస్తవాలను పరిశీలించినపుడు గమనించవలసిన ఒక ముఖ్య విషయం.. నిరసనకారులందరూ చాలాకాలంగా మిలిటరీ లో చేరడానికి అవసరమైన శిక్షణ పొందుతున్నారు. ఒకవిధంగా వాళ్లంతా దట్టించిన తుపాకుల్లాంటివారు. మీట నొక్కితే తుపాకీ పేలుతుంది. ఆ విధంగా మానసికంగా శిక్షణలో మలచబడ్డ ఈ నిరసనకారులకు తమ శిక్షణాధికారులిచ్చే ఆఙ్ఞలు ఎప్పుడూ ఒప్పుగానే కనిపిస్తాయిగాని తప్పుగా కనిపించవు.
అటువంటి మానసికంగా మలచబడ్డ యువకులను కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంలో మీ భవిష్యత్తు నాశనం అవుతుందని, మన దేశ రక్షణ వ్యవస్థనే బలహీనపరుస్తుందని, మన దేశానికి చాలా ప్రమాదకరమని నూరిపోసింది శిక్షణ సంస్థలు. కాబట్టి మీరంతా నిరసన తెలపాలని, ఆ నిరసన తీవ్రరూపంలో ఉండి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కసి రగిలించారు. ఏ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను బలిపెట్టేందుకు ఆ యువకులు సిద్ధపడ్డారో ఆ దేశం కోసం వాళ్లు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. అందువల్ల సికింద్రాబాద్‌లో, దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన విధ్వంసకాండను, ఒక ప్రత్యేక కోణంలో చూడాలి కానీ, సాధారణ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసుగా మాత్రం చూడకూడదు.
ఇక ఈ సందర్భంగా బ్రిటిష్ నేరచట్టాలను గౌరవించి వాటి అధారంగా, నేర చట్టాలను రూపొందించుకున్న మనం, బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో తీవ్రాతి తీవ్ర నేరంగా పరిగణించబడిన చక్రవర్తిపై యుద్ధం (Waging of war against His majesty The king Emporer of India) కేసుల్లోను, హత్యానేరాల కేసుల విషయంలోను, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఏన్ఏ) దేశభక్తుల పట్ల అనుసరించిన ఉదాసీన వైఖరిని కూడా పరిశీలించాలి.
ఐఎన్ఏ ట్రయల్ (1945-1946)గా పిలువబడే ఈ కేసుల విచారణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఐఎన్ఏకు చెందిన ముగ్గురు అధికారులు కెప్టెన్ షా నవాజ్‌ఖాన్, కెప్టెన్ ప్రేమ్‌కుమార్ సెహగల్, లెఫ్ట్‌నెంట్ గురుబక్ష్ సింఘ్ ధిల్లాన్, పైన చెప్పబడిన నేరాల కింద కోర్ట్ మా ర్షల్ చేయబడి, ఢిల్లీలోని ఎర్రకోటలో విచారించబడి, బ్రిటి ష్ మిలిటరీ కోర్టు చేత దోషులుగా నిర్ధారించబడ్డారు. నాటి కోర్టు వీరికి యావజ్జీవ ప్రవాస శిక్షను విధించింది. అయితే ఈ శిక్షలను ఆమోదించవలసిన అప్పటి సర్వ సైన్యాధికారి, దేశం పట్ల ఈ నిందితులకున్న దేశభక్తిని గౌరవించి తనకున్న విశేషాధికారాలతో వారి ప్రవాస శిక్షను రద్దుచేశారు.
ఆ కేసు వివరాలను, ఆ విచారణ పట్ల, యావత్ దేశం స్పందించిన తీరును సాక్షాత్తు కీ.శే.లెఫ్ట్‌నెంట్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ గతంలో నాకు వివరించి చెప్పినప్పుడు నా ఒళ్లు భావావేశంతో పులకరించింది. దోషులుగా నిర్ధారించబడి యావజ్జీవ ప్రవాస శిక్ష ఖరారు చేయబడిన నాటి ఒక బానిస దేశపు ఖైదీల విషయంలో, తమ దేశం పట్ల వారికున్న దేశభక్తిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం దానిని గౌరవించగలిగినప్పుడు, దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఒక స్వతంత్ర దేశానికి చెందిన, మన దేశపు న్యాయవ్యవస్థ, ఈ దేశ యువకులైన సికింద్రాబాద్ నిరసనకారుల దేశభక్తిని, దేశం పట్ల వారికి ఉన్న ప్రేమను గుర్తించి వారిని నేర విముక్తులను చేస్తూ.. వారు మన రక్షణశాఖలో చేరేందుకు ఏ ఆటంకం లేకుండా చూడగలిగితే మన దేశ రక్షణవ్యవస్థకు మేలు చేసినట్టవుతుంది.
– బసవరాజు నరేందర్‌రావు
99085 16549