‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్యతను విస్మరించకూడదు.
నెహ్రూ నుంచి మోదీ దాకా.. మన పాలకుల విధి విధానాలను పరిశీలిద్దాం. మనది వ్యవసాయాధారిత దేశం. దీన్ని గ్రహించిన నెహ్రూ బాక్రానంగల్, నాగార్జున సాగర్ వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించారు. నాటి సోవియట్ రష్యా సహకారంతో భిలాయ్, రూర్కెలా ఉక్కు కర్మాగారాలను నెలకొల్పి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధనకు పునాది వేశారు. ‘జై జవాన్, జై కిసాన్’ నినాదంతో లాల్‌బహదూర్ శాస్త్రి దేశరక్షణకు, వ్యవసాయాభివృద్ధికి పునాదిని పటిష్టం చేశారు. జగజ్జీవన్‌రామ్ వంటి అనుభవజ్ఞున్ని వ్యవసాయ మంత్రిగా నియమించి ఆహారధాన్యాల స్వయం సమృద్ధిని సాధించారు. బ్యాంకులను జాతీయం చేసి వ్యవసాయ, కుటీర పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు ఇందిరాగాంధీ. ఆ తర్వాత కాలంలో రాజీవ్‌గాంధీ నూతన ఆర్థిక విధానాల వైపు మళ్లినా వ్యవసాయరంగాన్ని విస్మరించలేదు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి సుడిగుండం నుంచి ఆర్థిక వ్యవస్థను ఒడ్డుకు లాగాడు.
ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలకు ప్రభుత్వాలు ధర్మకర్తలు మాత్రమే. వాటిని అమ్మేస్తే భావి ప్రభుత్వాలేమీ చేయలేవు. ఉదాహరణకు.. గత ప్రభు త్వం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోగలిగాం. అదే అమ్మేసి ఉంటే.. మనమేం చేయగలిగే వాళ్లం? అని అనటమే కాదు, అంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా ప్రభుత్వ సంస్థల్లోని కొద్ది శాతం వాటాలను ఉపసంహరించుకోవటం ద్వారానే దేశాన్ని గట్టెక్కించారు పీవీ నరసింహారావు. సామాన్యులకూ అభివృద్ధి ఫలాలు అందజేయాలన్న సత్సంకల్పంతో నూతన ఆర్థిక విధానాల అమలులో ఆచి తూచి అడుగేశారు మన్మోహన్సింగ్. ఇవన్నీ.. వారి వారి రాజనీతిజ్ఞతకు నిదర్శనాలే.
పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా శత్రు దేశాలకు భారత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు వాజపేయి. అంతేగాక.. పాక్, చైనాలతో సహా ఇరుగు పొరుగు దేశాలతో సామరస్యాన్ని పెంపొందించాడు. వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తించి నదుల అనుసంధాన అంశాన్ని తెరమీదికి తెచ్చాడు వాజపేయి. ఇవన్నీ ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనాలు. కానీ ప్రభుత్వ సంస్థల అమ్మకానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయటంలో ఆయన ప్రజాభిమాన మందిరం కుప్పకూలింది.
అవినీతి మచ్చలేని మానవీయ నేత ఐనప్పటికీ, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవలసిన బలహీనత వల్ల, ఆయా పార్టీల నేతల అవినీతిని అరికట్టలేక పోవటం వలన ప్రజలు; అధిక లాభాలను సమకూర్చలేని మెతక నేత అని కొర్పొరేట్లు మన్మోహన్సింగ్ పట్ల యాష్ణీభావం వహించారు. ఈ నేపథ్యంలో.. అవినీతిని అరికడతాను, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు రప్పించి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానంటూ మోదీ ప్రజల ముందుకు వచ్చాడు. మరో వైపు మీకు చెప్పింది చేసి తీరుతానంటూ కార్పొరేట్లనూ ఆకర్షించి ప్రధాని అయ్యాడు నరేంద్రమోదీ. సర్జికల్ దాడులతో పాక్‌పై ప్రతీకార చర్యలు, చైనా దురాక్రమణ దాడుల్ని తిప్పి కొట్టటం, కశ్మీర్‌కు 370 ఆర్టికల్ రద్దు చేస్తానంటూ మోదీ ఇమేజ్ పెంచుకొని రెండో సారి మరింత మెజారిటీతో ప్రధాని అయ్యాడు. కశ్మీర్‌కు 370 రద్దు చేసి దేశ భద్రతా పునాదిని పటిష్టం చేసి, రాజనీతిజ్ఞునిగా ప్రశంసలందుకున్నారు మోదీ!
కానీ కరోనా సంక్షోభంలో పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా అనేక బిల్లులకు ఆమోదం తెచ్చుకున్నాడు. అన్నదాతలు, కష్టజీవులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ, కార్మిక చట్టాలు చేశారు. ఇంతకు ముందు.. తన హయాంలోనే పెద్ద నోట్ల రద్దు వగైరాల ద్వారా ప్రజల ఆదాయాలకు గండికొట్టడం, కరోనా సంక్షోభంతో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల కన్న అధమ స్థాయికి మన జాతీయ ఆదాయం పడిపోవటం లాంటి వాటితో మోదీ ప్రతిష్ఠ మసకబారింది. అదే సమయంలో కార్పొరేట్ల ఆదాయం అమాంతంగా పెరగటం, పన్ను రాయితీలు, రుణమాఫీల ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు కార్పొరేట్లకు కట్టబెట్టి కార్పొరేట్ల అనుకూలుడని ముద్రవేసుకున్నాడు. ఆ లోటును పూడ్చుకోవటానికి పెట్రో ధరల్ని, తద్వారా నిత్యావసర ధరల్ని భారీగా పెంచుతూ కోట్లాది పేదల్ని దారిద్య్ర రేఖ దిగువకు నెట్టేయటంలో మోదీ పాత్ర కాదనలేనిది. రెండో దశ కరోనా కట్టడిలో వైఫల్యం మరింత తీవ్రమైనది. ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మటానికి, దశాబ్దాల తరబడి లీజుకివ్వటానికీ సంసిద్ధం కావటం.., చివరికి గ్రామ పంచాయతీల ఆస్తులను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకోమనటం వంటి మోదీ తిరోగమన విధానాలకు పాల్పడుతు న్నాడు.
ఈ నేపథ్యంలోనే ప్రజలు మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రైతులు తమను అభద్రతకు గురిచేసే వ్యవసాయ, కార్మిక చట్టాలను రద్దుచేయమంటూ ఢిల్లీ వద్ద చలి, వాన, ఎండల్లో నవ మాసాలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా అన్నదాతలను మోదీ పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మి మమ్మల్ని రోడ్డున పడేయకండి మహాప్రభో అంటూ వీధులకెక్కిన కార్మికులు, కష్టజీవుల గోడు వినటం లేదు. కరోనా భయంతో నెత్తిన లగేజీలను, చంకన బిడ్డల్ని వేసుకొని వందలాది మైళ్ళు నడిచివెళ్తున్న వలస కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. అమానవీయంగా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కర్మకు వదిలేశాడు. ఇటువంటి మోదీ ఉదాసీన కఠిన వైఖరికి, సామాన్య ప్రజల్లో మోదీ పట్ల అపనమ్మకమే కాదు, ఆయనంటే భయం కూడా తలెత్తిందన్నది సత్యం!
రాజనీతిజ్ఞులు ఎప్పటికీ విస్మరించని వాస్తవమేమంటే.. మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయానికి వృద్ధి వల్లనే దేశంలో సగానికి పైగా ఉన్న రైతు కూలీల జీవనం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి దేశంలోనే విదేశీ కార్పొరేట్లు పరిశ్రమలు నెలకొల్పుతారు. తద్వారా కోట్లాదిమందికి ఉద్యో గం, ఉపాధి లభిస్తాయి. అలా దేశం ప్రగతిపథాన పయనిస్తుంది! ఇది ఊహ కాదు, చైనా ఆచరించి రుజువు చేసిన వాస్తవం! మనకన్నా ఆలస్యంగా స్వాతంత్య్రం పొందిన, అధిక జనాభా కల్గిన, మనలాగే వ్యవసాయక దేశమైన చైనా ఈ బాటనే పయనించింది. మనకు అందనంత ఎత్తుకు ఎదగటమే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాను ఆర్థికంగానే కాదు, అన్ని విధాలా సవాలు చేసే స్థాయికొచ్చింది.!
కానీ మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ వాస్తవాన్ని విస్మరించి, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో నడుస్తున్నాడు. తనకిష్టమైన కార్పొరేట్ల కోరిక మేరకు.. పన్నురాయితీలు, రుణమాఫీల ద్వారా కార్పొరేట్ల ఆస్తుల్ని భారీగా పెంచాడు. కార్మికులను అణచి వుంచే చట్టాలను రూపొందించాడు! జాతీయ ఆదాయం అగ్రభాగాన్నందించే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లు ఆక్రమించుకోవటానికి అనువైన చట్టాలను చేశాడు. ఇన్ని జేసినా విదేశీ కార్పొరేట్లుగాని, స్వదేశీ కార్పొరేట్లుగానీ ఈ దేశంలో కొత్తగా ఒక పరిశ్రమనైనా పెట్టకపోవటానికి కారణం? ప్రజల కొనుగోలు శక్తి (డిమాండ్) లేకపోవటమే కదా! దేశంలో పెట్టుబడులు పెట్టకపోగా, మోదీ ద్వారా కుబేరులైన స్వదేశీ కార్పొరేట్లు కూడా డిమాండున్న మరో దేశాన్ని వెదుక్కుంటున్నారు!
‘వ్యాపారుల మధ్య పోటీని పెంచటం ద్వారా, ప్రజలకు వీలైనంత తక్కువ ధర కు వస్తువులను, మెరుగైన సేవలను అందించాలి’ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధాన సూత్రం. కానీ తద్విరుద్ధంగా అన్ని ఓడరేవులనూ ఒక్కరికే, అన్ని విమానాశ్రయాలనూ ఒక్కరికే కట్టబెట్టి, గుత్తాధిపత్యాన్ని పెంచేస్తున్నాడు మోదీ! ఇది ప్రభుత్వానికీ, దేశానికీ ప్రమాదమే. ఎందుకంటే సదరు గుత్తాధి పతులు, రేపు ప్రభుత్వాన్నే శాసిస్తారన్నది చారిత్రక వాస్తవం. రాజనీతిజ్ఞుడైన ఏ నాయకుడూ విస్మరించరాని ఈ వాస్తవాన్ని కూడా ‘జానే దేవ్’ అన్నాడు మోదీ! అది ఆయన ఇమేజ్‌కే కాదు, ఆయన పార్టీకీ గొడ్డలి పెట్టేనని గ్రహించలేకపోతున్నాడు ఆయన.
ఇక విదేశాంగ విధానంలో కూడా మోదీ తప్పటడుగులేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 1. తన లాభానికి, ఆధిపత్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం, 2. ఏ దేశాన్నైనా వాడుకొని వదిలేయడం, 3. తన స్వార్థం కోసం నియంతలను, ఉగ్రవాదులనైనా ప్రోత్సహించటం, 4. చమురు నిక్షేపాలున్న దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పలేక పోతున్నాడు.
గత పాలకుల కన్నా భారత్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాడు మోదీ అని ప్రజలం తా ఆశించారు. ఎందుకంటే ప్రపంచమంతా భారత్ వైపు తలెత్తి చూసేలా జీడీపీని (జాతీయాదాయాన్ని) పెంపొందిస్తానన్నాడు గదా! అయితే ఆయన ఇంకో రకంగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు! మోదీ పెంచుతున్న జీ(గ్యాస్). డీ (డీజిల్). పీ(పెట్రోల్) ధరలను నిజంగానే ఆకాశానికి చేరేలా చేశాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. మోదీ తిరోగమన విధానాలకు కరోనా తోడైంది. ఫలితంగా నేడు ప్రపంచంలోనే అధికంగా పేదలు, దారిద్య్రం, ఆహార కొరత, పోషకాహార లోపం, శారీరక-మానసిక రోగ పీడితులున్న పెద్ద దేశమే కాదు పేద దేశమైంది భారత్! అయితే కుబేరులున్న దేశాలలో మాత్రం మూడవ స్థానానికి ఎగబాకింది భారత్! ‘నల్లని పెద్ద మేఘం చుట్టూ, వెండితీగెలాంటి సన్నని వెలుగు కూడ ఉంటుంది గదా? సరిగ్గా అలా వుంది నేటి మన భారత్!
పాలకుడు మానవత్వం పరిమళించే రాజనీతిజ్ఞుడై ఉం టేనే.. అన్నదాతలు, కష్టజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మొదలైన అట్టడుగు ప్రజలందరి అభ్యున్నతికి పాటుపడుతాడు. ప్రజానేతగా వాళ్ళ గుండెల్లో కొలువుండిపోతాడు. అంతేకానీ, అతను బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినా సరే.. వర్గ రాజకీయ వాసన వచ్చే పాలకుడు అందరి మన్ననలను పొందలేడు. అణగారినవర్గాల వారికే నా జీవితం అం కితం! అందరి వాడను నేనని నమ్మిస్తూ.. మోదీ తనకిష్టులైన కొందరి (కార్పొరేట్ల)కే అంకితమై పోతాడన్నదే ఆ సత్యం!తమ పాలన ద్వారా ప్రజలకు ఇంత గొప్ప సందేశాన్నందించిన మీకు కృతజ్ఞ తాభివందనాలు మోదీజీ..!
పాతూరి వేంకటేశ్వరరావు