e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home ఎడిట్‌ పేజీ ఇగ ఇంటికాడనే నిలవెడుదాం!

ఇగ ఇంటికాడనే నిలవెడుదాం!

కంటికి కనవడనంత దూరం నీళ్లుంటయి మా మానకొండూర్ పెద్ద చెరువుల. ఒకప్పుడు గంగాళంలా ఉన్న చెరువు వలస పాలనల తాంబాళం లెక్కయింది. నెర్రెలు వారి, గుండ్లు తేలినయి. కట్టపొంటి ఆడుకుంట, దూపైనప్పుడు దోసిట్ల పట్టుకొని తాగిన రోజులవి. ఆ తర్వాత చెరువు కట్టమీదికి పోతెనే ముక్కు మూసుకొనే కాలం దాపురించింది. వినాయకుని పండుగ వస్తే చాలు, కన్నారంతో పాటు మానకొండూరు, ఆ సుట్టూ ఉన్న పల్లెటూర్ల నుంచి పెద్దపెద్ద వినాయకులను మా చెరువుల నిమజ్జనం చేద్దురు.

వినాయకుని పండుగొచ్చిందంటేనే మానకొండూర్ పేరు వార్తలకెక్కేది. బజార్లల్ల వినాయకులు కొలువుదీరుతయి. భక్తికి చిన్న, పెద్ద ఏముంటది?. ఎవ్వరి ఐషత్ వట్టి వాళ్లు వినాయకులను నిలవెట్టేటోళ్లు. పల్లెటూర్లలో చిన్న వినాయకులను నిలవెడితే,కన్నారంల ‘నువ్వా, నేనా..’ అన్నట్టు పెద్ద వినాయకులను నిలవెట్టేది. ఈయన పేరు చెప్పుకొని కొందరు జేబులు నింపుకొనేటోల్లు. సందు దొర్కితే సాలు ఈ మతం, ఆ మతం అని గొడవలు పెట్టిద్దురు. ఈ గొడవలకు బలయ్యేది అమాయకులు. అట్లా అప్పుడు కన్నారం అంటే సాలు లొల్లులు, కొట్లాటలు అనుకునేటట్టు అయింది.కాదు కాదు, అట్ల మార్చిండ్రు.

- Advertisement -

ఏలొల్లీ, కొట్లాటలు కాకుండా, వినాయకులు నీళ్లల్ల వడేదాకా చూడటానికి పోలీసులకు, అధికారులకు తల పానం తోకలకచ్చేది. ఇగ ఆ వినాయకులను ఎక్కడ నిమజ్జనం చెయ్యాలె? అని తలకాయ వట్టుకునేటోళ్లు. సుట్టుముట్టూ సుక్కనీళ్లు కూడా కనిపించకపోయేది. ఏమున్నా ఒక్క మానేర్‌ డ్యామే కనవడేది. దాని కట్ట ఎక్కువనే ఎత్తుంటది. ఆడ నిమజ్జనం చేసుడు ప్రమాదమే. ఇగ అందరికి కనిపించేది మా మానకొండూరు చెరువే. కట్టమీద కలెక్టరు, అధికారులు, పోలీసుల హడావుడి. ఎండిపోయిన చెరువును రెండురోజుల్ల నింపుదురు. ముండ్ల కంపలు, జపాన్‌ చెట్లు చెక్కి కట్ట తొవ్వను సాఫ్‌ చేసేటోళ్లు. కట్ట సుట్టూ బారికేడ్లు, టెంట్లు, సభలు సమావేశాలు. మొత్తానికి నిమజ్జనం నాడు మా మానకొండూర్‌ కట్ట మీద జాతర లెక్క ఉండేది.

1998, ఏడో తరగతి సదువుతున్నా అనుకుంట. నిమజ్జన జాతరకు హీరో- మిద్దె రాములు! ఒగ్గు కథ మిద్దె రాములంటే కన్నారమొల్లకే కాదు, తెలంగాణోల్లెవరికైనా పానం. ‘ఈ తాప నిమజ్జనానికి కట్ట మీద మిద్దె రాములు కథ చెప్తుండహో.. ఇనేటోళ్లంతా కట్టమీదికి రావాలహో’ అనుకుంట ఒకరోజు ముందే డప్పు సాటింపు చేసిర్రు మా గడ్డమోల్ల వాడముందు. అమ్మా బాపు ఇద్దరికీ మిద్దె రాములు కథలంటే ఇష్టం. ఇప్పటికీ నేనింటికి వోతే సెల్‌ఫోన్ల ‘మిద్దె రాములు కథ వెట్టురా’ అంటరు. తెల్లారేదాంక ఆ కథ సాగుతది. నేను ఇనుకుంట, ఇనుకుంట నిద్రలకు వోతా. అసొంటిది మిద్దె రాములే మా ఊళ్లెకస్తున్నడంటే ఎంత సంబురమో! ‘చల్‌ ఇయ్యాల్ల ఎటుచేసి ‘మిద్దె రాములు కథ ఇనాల్సిందే’ అనుకున్నరు. ఓ చేత నన్ను, ఇంకో చేత ఓ చిన్న వరుకు సంచులు, రెండు శెద్దర్లు వట్టుకొని కట్టమీదికి నడిసిర్రు అమ్మా బాపు. దాదాపు ఊరు, ఊరంతా కదిలిందనుకోర్రి. రాత్రి ఏడైతంది. బ్యాండు సప్పుళ్లు, ప్పీ.. ప్పీ.. పీకలూదుతూ పిల్లల ఆటలు, వినాయకులు వెట్టుకొని ట్రాక్టర్లు అటు రెండు కిలో మీటర్లు, ఇటు రెండు కిలో మీటర్లు లైన్‌ కట్టినయి. కట్ట సుట్టూ పోలీసుల గస్తీ. అందరు మిద్దె రాములు కోసం ఎదిరిసూత్తున్నరు. ఎట్నుంచి అచ్చిండో ఏమో.. కాల్లకు గజ్జెలు కట్టుకొని, చేతుల యాపాకు కొమ్మలు వట్టుకొని ఎల్లమ్మ కథ షురూ జేయనే చేసిండు. ఏడు గొట్టంగా మొదలైన కథ తెల్లారి మూడింటిదాన్క నడిసింది. ఆ మూడింటికి బోనమెత్తిండు మిద్దె రాములు. స్టేజీ మీద బోర్లబొక్కల వండుకొని ఎల్లమ్మ తల్లికి దండం పెట్టిండు గని ఆ బోనం కింద వళ్లె, బోనంల ఉన్న దీపం ఆరిపోలే. జనం సప్పట్లే సప్పట్లు. నాలుగు రోజులైనా ఆగకుంటా కథ నడిపే సత్తా ఉన్న మనిషి మిద్దె రాములు.

నిమజ్జనం తెల్లారి సోపతిగాళ్లతో కలిసి వినాయకులను ఏరుకచ్చుకునుడు, మళ్లీ గుడిసెలేసుకొని ఆ వినాయకులకు మొక్కడం మాకలవాటు. మేం చెరువుమొకాన పోయేది చూసి ‘ఓ పోడా.. నీల్లల్ల వడ్డ వినాయకులను ఇంటికి తేవద్దురా’ అని అమ్మ మొత్తుకునేది. మేం ఇంటె గద. కట్టమీదికి వొయ్యేసరికి చెత్తాచెదారం, పెద్దపెద్ద వినాయకులతో చెరువు సగం బడా నిండిపోయింది. ఇంకా వినాయకులేసేటందుకు ట్రాక్టర్లు లైన్ల ఉన్న యి. అప్పటిదాకా హడావిడి చేసిన అధికారులు ఎక్కడోళ్లక్కడ పోయిండ్రు. పోలీసోళ్లు పొద్దుగాల్లనే మాయమైండ్రు. వినాయకుని పండుగకు ముం దు చెర్ల ఈతగొట్టినోళ్లం, చెర్ల దిగితే ఎక్కడ సలాకలు కుచ్చుకపోతయోనని, ఆ రంగుల నీళ్లల్ల తానం జేత్తే ఎక్కడ గజ్జి లేత్తదోనని ఉత్తగనే ఇంటి మొకాన వోయినం. నిమజ్జనం తెల్లారి నుంచి మళ్లా చెరువు మొకాన చూసిన అధికారులుండరు. ఇక నాయకులైతే కంటికి కనవడితే ఒట్టు. ఎండిపోయిన చెరువును నీళ్లతో నింపినందుకు సంబురపడాల్నో..? నింపిన నీళ్లలో విషం కల్పినందుకు బాధపడాల్నో సమజ్‌ కాకపోయేది. ఇదంతా ఆంధ్రోళ్ల పాలనలో జరిగిన తతంగం.

నిమజ్జనం తెల్లారి సోపతిగాళ్లతో కలిసి వినాయకులను ఏరుకచ్చుకునుడు, మళ్లీ గుడిసెలేసుకొని ఆ వినాయకులకు మొక్కడం మాకలవాటు. మేం చెరువుమొకాన పోయేది చూసి ‘ఓ పోడా నీల్లల్లవడ్డ వినాయకులను మళ్లా ఇంటికి తేవద్దురా’ అని అమ్మ మొత్తుకునేది.

తెలంగాణ వచ్చినంక మొదట మంచిగైనయి ఊరూరా ఉన్న చెరువులే. ఆ చెరువుల్లో మా చెరువొక్కటి. ఎండలు అగ్గిలెక్క మండంగ కూడా మా చెరువు మత్తడి దుంకింది. కట్టమీదికి బతుకమ్మల ను ఎత్తుకున్న తల్లీబిడ్డల విగ్రహమొచ్చింది. కట్టసుట్టూ ఇనపరాడ్లతో బారికేడ్లు పెట్టిర్రు. కట్ట తొవ్వ సాఫైంది. ఆ కట్టమీద వాకింగ్‌ చేస్తున్నరు. చెరువు పక్కనే పార్కు తయారవుతున్నది. చెరువునానుకొని వైకుంఠధామం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌లో భాగంగా- మా చెరువును మినీ ట్యాంక్‌బండ్‌ లెక్క చేయాలని ఎమ్మెల్యే రసమయి అనుకుంటున్నడు. బాగు చేసుకునుడే కాదు, ఉన్న నీళ్లను విషం చేసుకోవద్దు. అచ్చే యేటి నుంచి ఇంటికాన్నే మట్టి వినాయకున్ని పూజిద్దాం. చెరువులను కాపాడుకుందాం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement