జాతీయపార్టీలుగా చెలామణిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత తెలంగాణపై వివక్ష చూపుతునే ఉన్నాయి. ఈ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనడానికి అనేక సాక్ష్యాలున్నాయి.
విశాలాంధ్ర పేరుతో తెలంగాణను ఏపీలో విలీనం చేసిన నాటినుంచి తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేస్తూనే ఉన్నది. పెద్ద మనుషుల ఒప్పందం మొదలుకొని స్వరాష్ట్రం ఆవిర్భవించేవరకు అవహేళన, అవమానం, వివక్షలు తెలంగాణలో కొనసాగాయి. ఇక 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ప్రజా ఉద్యమాన్ని గౌరవించాలన్న ప్రజాస్వామ్య విలువలను మరిచి విద్యార్థి ఉద్యమకారులపై పాశవికంగా జరిపిన కాల్పుల్లో 369 మంది విద్యార్థులను బలి తీసుకుంది. నాటి కాంగ్రెస్ రాక్షస క్రీడకు ఆనవాళ్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో అనేక సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సెంటర్లో నిర్మించిన అమరవీరుల స్థూపం కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు చిహ్నం. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ సమాజంపై తీవ్ర అణచివేత కొనసాగిందనడానికి నాటి ఘటనలే చెప్తాయి. ఆ తర్వాత సీఎంలుగా పనిచేసిన వైఎస్ సైతం తెలంగాణపై విషమే చిమ్మారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో నాటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించిన అణచివేతను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదు. అరువై ఏండ్లు గా తెలంగాణ ప్రజలు అరిగోస పడుతుంటే రాజకీ య పబ్బం గడుపుకున్న కాంగ్రెస్ ఎన్ని టక్కు టమా రా జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లో లేరు. భవిష్యత్‌లో కూడా విశ్వసించరని కాంగ్రె స్ నమ్మాల్సిందే!
ఏపీలో ఒక ప్రకటన, తెలంగాణలో ఒక ప్రకటన చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించిన చరిత్ర బీజేపీది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపినా, ఆంధ్ర నాయకత్వం ఆదేశాల మేరకే తెలంగాణ బీజేపీ నడుచుకున్నది. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టానికి అండగా ఉం డాల్సిన కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్, అడుగడుగునా అన్యాయానికి గురిచేస్తున్నది. ఇక్కడి పథకాలు అద్భుతమంటూ, మెచ్చుకుంటూ.. నిధుల కేటాయింపులో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు.
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కనీసం నిధులు కూడా కేటాయించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఇప్పటివరకు అది జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని ఇప్పటివరకు అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు.
విభజన చట్టంలోని అంశాలతో పాటు ఇతర హామీలు సైతం 90 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు లాంటి ఎన్నో అంశాలపై కనీసం కనికరం కూడా చూపించడం లేదు. ‘పౌరస్మృతి’ అంటూ నీతులు చెప్పే బీజేపీ తెలంగాణపై వివక్ష ఎందుకు చూపుతోందో చెప్పాలి. కరువు నిధుల కేటాయింపుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురవుతుంటే బీజేపీ ఎంపీలు తెలంగాణ అభివృద్ధిపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నది. జాతీయపార్టీలు తెలంగాణకు మోసం చేస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటినుంచీ చెప్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్‌లో కాంగ్రెస్, బీజేపీలను పాతరేయడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త!
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు)
దూగుంట్ల నరేశ్ ప్రజాపతి