చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు? ఎక్కడికి పోతారు? చావంటే ఏమిటి? బతుకుకు చావుకు మధ్య ఏముంది? ఆత్మ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. మనిషికి కాలక్రమేణా తలెత్తిన సందేహాలు. తత్వశాస్త్రంలో, మతంలో ఈ రోజుకూ వెతుక్కుంటున్న ప్రశ్నలు. అందుకే మన సామాజిక జీవనం, సంస్కృతి ఎదుగుతున్న దశలో జనన, మరణాలకు సంబంధించిన భావాలే మానవ సమాజపు తొలినాళ్ళ మత భావనలుగా ఏర్పడ్డాయి. అందుకే ఈ భూమ్మీద మనిషి మొట్ట మొదట కట్టిన కట్టడం చనిపోయిన వారి సమాధి.
తెలంగాణలో ఇప్పటికి సుమారు 4వేల ఏండ్ల కిందట ఈ నేలపై తిరుగాడిన మానవులు వారి అస్తిత్వాన్ని సమాధులు, వాటిలో పెట్టిన వస్తువుల రూపంలో మనకు మిగిల్చి పోయారు. భారత ఉపఖండంలో సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలోనే దక్కన్ భూభాగంలో, మన తెలంగాణలో ఏ సంస్కృతి ఉండేదో చెప్పే ఆధారాలివి. క్రీ.పూ. 2500 కాలం నుంచి క్రీ.శ. 200 వరకు అంటే సుమారు 3వేల ఏండ్ల్ల మన చరిత్ర బృహత్ శిలాయుగం రూపంలో మన ముందున్నది.
తెలంగాణలో ఏ మూలకు పోయినా ఊళ్ళ శివార్లలో, గుట్టల మధ్య, నదీ తీరాల్లో, పెద్ద పెద్ద రాళ్లు, బండలు ఒక పద్ధతిలో అమర్చి కనిపిస్తాయి. స్థానికులు వీటిని ‘రాక్షస గూళ్ళు’ అంటారు. కొంత మంది ఈ రాళ్ళ కింద నిధి నిక్షేపాలున్నాయని భావించి తవ్వేస్తుండటం నేటికీ మనం చూస్తున్నదే. ఇట్లా తవ్విన వాళ్లకు కనిపించేవి ఎముకలూ, కుండ పెంకులూ, తుప్పు పట్టిన ఇనుప వస్తువులూ మాత్రమే. ఎందుకంటే ఇవి మన పూర్వీకుల సమాధులు కాబట్టి.
కొత్త రాతి యుగంలో భాగంగానే ఎదిగిన సంస్కృతి ‘బృహత్ శిలా యుగ సంస్కృతి’. దీన్నే ఇంగ్లిష్ లో ‘మెగాలితిక్ కల్చర్’ అంటారు. రాతి యుగంలో రాతి పనిముట్ల నైపుణ్యం, తయారీలను బట్టి.. పాత, మధ్య, కొత్త రాతి యుగాలు అన్నాం. కాని బృహత్ శిలా యుగం పేరు మాత్రం పనిముట్ల ఆధారంగా కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో సమాధుల్ని నిర్మించుకొనే పద్ధతి ఆధారంగా వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి కొత్త రాతి యుగంలోనే ఒక అభివృద్ధి. మెసొపొటేమియా, ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికా, బలూచిస్థాన్, స్పెయిన్, ఫ్రాన్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇలా అన్ని దేశాల్లోనూ, మన భారత ఉపఖండంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమాధులు నిర్మించే సంస్కృతి కనిపిస్తుంది. తెలంగాణ మొత్తం బృహత్ శిలాయుగ సంస్కృతికి ఒక పెద్ద వర్క్ షాప్ లాంటిది. ఎందుకంటే ఈ కాలపు అన్ని రకాల సమాధులు మన దగ్గర కనిపిస్తాయి.
ఈ సమాధుల్లో పెట్టిన సామాగ్రి మరణానంతర జీవితం మీద నమ్మకం గురించి మన కు చెపుతాయి. ఆత్మకు ఆకలి దప్పికలు, ఇతర అవసరాలు ఉంటాయనే నమ్మకం సమాధుల్లో మట్టి పాత్రల్లో నీళ్లు, ఆహారం పెట్టేలా చేసింది. ఇప్పటికీ మనం అంతిమ సంస్కారా ల్లో చేసే కర్మ కాండకు తొలి ఆనవాళ్లు ఈ బృహత్ శిలాయుగపు సమాధుల్లో దొరుకుతాయి. సమాధుల్లో మానవ అవశేషాలతో పాటు మట్టి పాత్రలు, ఇనుము, రాగి వంటి లోహాలతో చేసిన వస్తువులు, ఆయుధాలు, విలువైన రంగు రాళ్లు, మట్టితో చేసిన పూసలు, మట్టితో చేసిన బొమ్మలు.. ఇలా మనిషి బతికి ఉన్నప్పుడు వాడుకున్న అన్ని వస్తువుల్ని శవంతో పాటు పెట్టే వా ళ్ళు. కుమ్మరి సారె పై చేసిన నలుపు, ఎరుపు, నలుపు-ఎరుపు పాత్రలు ఈ కాలపు ప్రత్యేకత. ఈ రకరకాల వస్తువులు మనకు కొత్త రాతి యుగపు వృత్తుల గురించిన అవగాహన కల్పిస్తాయి.
ఈ సమాధులు ఎవరివి? వీటిని ఎట్లా కట్టారు?
ఇంత పెద్ద సమాధులు కట్టడం ఒక సామూహిక కార్యక్రమం. డ్రిల్లింగ్ మిషిన్లు, డైనమైట్లు లేని ఆ కాలంలో పెద్ద రాళ్లను పగలగొట్టే పద్ధతి ఇప్పటికీ అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. బండలను బాగా వేడి చేసి దాని మీద చల్ల నీళ్లు పోస్తే, ఉష్ణోగ్రతల్లో వచ్చే ఆకస్మిక మార్పులకు బండలు పగులుతాయి. అలా పెద్ద బండ రాళ్లతో కట్టిన వే ఆ కాలం నాటి సమాధులు. ఖననం చేసే పద్ధతుల్లో కూడా వైవి ధ్యం ఉంది. పెద్దవారు చనిపోతే పూర్తిగా పాతిపెట్టడం, చిన్న పిల్లలైతే కుండల్లో పెట్టడం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద వారిని సైతం మొత్తం ఖననం చేయకుండా పార్థివ శరీరాన్ని బయటే ఉంచి జంతువులు, క్రిమి కీటకాలు హరించిన తర్వాత ఎముకల్ని సేకరించి సమాధుల్లో మళ్లీ మనిషి ఆకారంలో అమర్చి ఖననం చేసేవా ళ్ళు. ఈ సమాధులు స్థిర నివాసం ఏర్పడిన తర్వాత ఎదుగుతున్న రాజకీయ ఆర్థికపరిస్థితికి సూచిక అంటారు ఆర్కియాలజిస్ట్ రవి కోరిసెట్టర్. ఈ సమాధుల్లో ఖననం చేసిన శవా లు సాధారణ ప్రజలవి కావనీ, ఎదుగుతున్న మిగులు ఆర్థికవ్యవస్థపై అధికారం ఉన్న పాలకవర్గ వ్యక్తులు లేదా వారి కుటుంబసభ్యులవని ఆయన అభిప్రాయం.
4000 ఏండ్ల కిందటే హైదరాబాద్‌లో జన సంచారం
హైదరాబాద్‌లో మానవ సంచారం వేల ఏండ్ల కిందటే మొదలైందనడానికి ఆధారాలు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించాయి. మౌలాలి, గచ్చిబౌలి, హష్మత్ పేటలలో దొరికిన సమాధులే ఇందుకు ఆనవాళ్లు. గచ్చిబౌలిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సమాధి క్రీ.పూ. 2795 నుంచి 2145 మధ్య కాలం నాటిదని ‘థెర్మోల్యూమినిసెన్స్’ అనే శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ణయించారు. మౌ లాలి ప్రాంతంలో 1916లో గు లాం యాజ్దాని, 1926లో ఈ. హెచ్.హంట్ జరిపిన తవ్వకా ల్లో వర్తులాకారపు రాళ్ళ మధ్య ఆరు రాతి పలకలతో చేసిన సమాధులలో రాగి, ఇత్తడితో చేసిన రెండు గంటలు, న లుపు, ఎరుపు రంగు కూజాలు లభ్యమైనాయి. హష్మత్ పే ట్లో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ మెకంజీ నేతృత్వంలో జరిపిన తవ్వకాల్లో కత్తి లేదా బాకు వంటి ఆయుధం, కొడవలి దొరికినయి. ఆ రోజుల్లోనే ఈ సమాధిని పునర్నిర్మించి ప్రజల కోసం సంరక్షించారు
ఉత్తర తెలంగాణ
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్లో సుమారు 500 సమాధులు ఉండేవి. ప్రస్తుతం చాలా కనుమరుగైనాయి. 1974-75లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, పెద్ద మట్టి పాత్రలు, ఎరుపు, నలుపు మట్టి పాత్రలు లభించాయి. ఇక ఖమ్మం జిల్లా జానంపేటలో దొరికిన సమాధులు విశేషమైన ఆధారాల్ని అందించాయి.
1917-18లో జరిపిన తవ్వకాల్లో మానవాకృతిలో చెక్కిన సమాధిరాళ్లు, అందులో ఒక శిలపై స్త్రీ సమాధిగా సూచిస్తూ వక్షోజాల వంటివి చెక్కి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కాజీపేటకు 6 కిలోమీటర్ల దూరంలో సింగపూర్, మలంగూర్, కరీంనగర్ జిల్లా సిరిసిపల్లి, బూడిగపల్లి, చిల్పూర్, జనగామ జిల్లా బమ్మెర, చిన్న తొర్రూరు, కోలకొండ, పోలకొండ, ప్రాజెక్టులో మునిగిన పోచంపాడుతో సహా ఉత్తర తెలంగాణలో అనేకచోట్ల కొన్ని వందల బృహత్ శిలా యుగపు సమాధులున్నాయి.
దక్షిణ తెలంగాణ
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాదులో రాయలగండి మందవాగు దగ్గర కొన్ని వందల సమాధులున్నాయి. జోగులాంబ – గద్వాల జిల్లా అలంపూర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో గొందిమల్ల తవ్వకాలలో తోవ సమాధులు అంటే ముఖ్య సమాధిను కలుపుతూ తోవ, ఒక కన్నం నిర్మించినట్టు కనిపిస్తుంది. ఇవి కుటుంబ సమాధులు. ఇదే కృష్ణా తీరంలోనే చాగటూరు లోని సమాధుల్లో రాతి పలకలతో బెంచీలు ఏర్పాటు చేసి ఉన్నాయి. పెద్దమారూర్‌లో రాతి పలకలను పటిష్ఠత కోసం స్వస్తిక్ ఆకారంలో నిలిపి సమాధుల్ని కట్టినారు. చిన్నమారూర్‌లో అస్థిపంజరంతో పాటు చేతికి గాజులు, చెవులకు కురవింద (కార్నిలియన్) తో చేసిన పూసలు, మానవాకృతితో ఉన్న బొమ్మ దొరికింది. యాదాద్రి-భువనగిరి జిల్లా రాయిగిరిలోని సమాధుల్లో దొరికిన కుండలపై చిత్రమైన గుర్తులున్నాయి. అవి బాబిలోనియా, అస్సిరియా వంటి సుదూర దేశపు పాత్రలపై ఉన్న లిపిని పోలి ఉన్నాయి. 1931లో జరిపిన తవ్వకాల్లో దొరికిన పుర్రెల్ని అధ్యయనం కోసం బ్రిటిష్ మ్యూజియంకు పంపించారు. ఇంకా వలిగొండ, రామునిపట్ల, పాలమాకుల, మందపల్లి ప్రాంతాల్లో సైతం మెగాలితిక్ సమాధులున్నాయి.
రాష్ట్ర పురావస్తు శాఖ ఈ దశాబ్ద కాలంలో జరిపిన తవ్వకాల్లో చెప్పుకోవాల్సినవి సిద్దిపేట జిల్లా నర్మెట, పుల్లూరు బండ, పాలమాకులలోని సమాధులు. నర్మెటలో సమాధిపై కప్పు బండ (క్యాప్ స్టోన్), మానవాకృతితో 6.70X4.00 X 0.65 మీటర్లు, 40 టన్నుల బరువు ఉంది. ఇది ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో దొరికిన అన్ని క్యాప్ స్టోన్ల కంటే పెద్దది. ఇంత పెద్ద రాతిని తొలిచి, తెచ్చి పెట్టడం ఒక అద్భుతమే. ఇక్కడి సమాధుల్లో మూడు కాళ్ళున్న ఒక పాత్ర, డైమండ్ ఆకారంలో ఎముకతో చేసిన ఆభరణ భాగాలు దొరికినయి. పుల్లూర్ బండ, పాలమాకులలో సైతం అనేక ఆధారాలు లభ్యమైనాయి. బృహత్ శిలా యుగపు సమాధులున్న ఈ మూడు గ్రామాల్లో తవ్వకాలు సిద్దిపేట ప్రాంత చరిత్రలో సుమారు 3500 ఏళ్ళ కిందటి మానవ జీవితపు విశేషాల్ని అందించాయి.
సమాధుల్లో రకాలు
ఈ సమాధులు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి శవాలను ఖననం చేసినవి, రెండోది మరణించిన తర్వాత స్మారకంగా ఏర్పాటు చేసినవి. వీటి నిర్మాణ పద్ధతిని బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వలయాకారంలో అమర్చిన రాళ్లను ‘కెయిర్న్ సర్కిల్స్’, గుంత సమాధులు (సిస్ట్లు), రాతిని చెక్కి ఏర్పాటు చేసిన సమాధులు (రాక్ కట్), నాలుగు రాతి పలకలను గూడు లాగా కట్టి దానిపై రాతి కప్పును పెట్టిన గూడు సమాధులు (డాల్మేన్స్).. ఇలా అన్ని రకాల సమాధులు తెలంగాణలో కనిపిస్తాయి. సమాధి పైన గుర్తుగా పాతిన నిలువు రాయిని ‘మెన్హిర్’ అంటారు. మృతదేహాన్ని , లేదా ఎముకల్ని కుండల్లో లేదా ప్రత్యేకంగా చేసిన మట్టి శవపేటికలో పెట్టేవాళ్ళు.
నిరంతరత తెలంగాణ లక్షణం
పాత రాతి యుగం నుంచి నేటి వరకు అన్ని చారిత్రక విభాత సంధ్యలకు, సందర్భాలకు తెలంగాణ సాక్షిగా నిలిచింది. అందుకే తెలంగాణ మొత్తం మనకు బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు కనిపిస్తాయి. వ్యవసాయ విస్తరణ, పట్టణీకరణ వల్ల ఎన్నో సమాధులు, ఆనవాళ్లు లేకుండా మాయమైనాయి. ఈ బృహత్ శిలాయుగం కథ విస్తారమైనది. ఈ కాలంలో సమాధుల మీద నిలిపిన నిలువు రాళ్లు (మెన్హిర్లు) ఏ కథల్ని చెపుతాయో, మనం ఆకాశంలో చుక్కల్ని ఎలా అర్థం చేసుకున్నామో, భూమికీ, అంతరిక్షానికీ నిచ్చెన వేసిన ఆలోచనలేమిటో వచ్చే వారం మాట్లాడుకుందాం.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000