ఎక్కడ చూసినా ఇప్పుడు ‘దళితబంధు’పైనే చర్చ. ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఏ రాష్ట్రం కానీ, కేంద్రం కానీ ఇప్పటివరకు ఇలాంటి విప్లవాత్మక సంస్కరణలతో కూడుకున్న పథకం గురించి ఆలోచన చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా దళితుల అభ్యున్నతి కోసం ఆలోచించలేదన్నదీ పచ్చి నిజం. ఇదేదో హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెచ్చిన పథకంగా ప్రతిపక్షాలు ఎప్పటిలాగే పసలేని విమర్శలు చేస్తున్నాయి.
‘దళితబంధు’ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు. పాతికేండ్ల కిందటే ఈ పథకానికి బీజం పడిందనేది అక్షర సత్యం. ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ దళితవర్గాల సంక్షేమం కోసం ఏండ్ల కిందటే దళితబంధు గూర్చి ఆలోచన చేసినట్లు చెప్పారు. విలేకరి చారి పేరు ప్రస్తావిస్తూ ఆయనతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 165 అణగారిన జాతుల గురించి అధ్యయనం చేసినట్టు గుర్తుచేశారు. అసలు ఎవరీ చారి? అప్పట్లోనే అణగారిన జాతుల గురించి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అధ్యయనం ఏమిటనే వివరాలు చర్చిద్దాం.
ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 1996-97లో ఉమ్మడి రాష్ర్టానికి రవాణా శాఖమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో భిన్నకులాలు, ఉపకులాల ఆస్తిత్వ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ఆర్థిక సంస్కరణలు కార్యరూపం దాల్చకపోవడంతో ఈ వర్గాలు నిరాశకు గురయ్యాయి. ఏ సంస్కరణకైనా మానవీయ దృష్టి కోణం ఉండాలని కేసీఆర్ గట్టిగా నమ్మేవారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన జర్నలిస్టు మిత్రులు కేఎన్ చారి, ఎస్.రామకృష్ణ తదితరులతో కలిసి తార్నాకాలో సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ (సీఎస్ఎస్)ను ఏర్పాటు చేశారు. దీన్ని స్థాపించడానికి ముందు సచివాలయం లోని కేసీఆర్ ఛాంబర్లో వివిధ అంశాలపై గంటల తరబడి చర్చలు చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న అన్నివర్గాల సమస్యలపై కూడా సీఎస్ఎస్ వేదికపై మేధోమథనం జరగాలని కేసీఆర్ సూచించారు. అణచివేత, దోపిడీ ఏ రూపంలో ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్ వాదన.
ప్రాంతం, కులం, జాతి, మతం, లింగపరంగా అణచివేతకు గురవుతున్న వర్గాల సమస్యలపై చర్చించేందుకే దీనికి ‘సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్’ అని పేరు పెట్టింది కూడా కేసీఆరే. ఈ వేదికపై అనేకరకాల వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పలు అంశాలపై సెమినార్లు జరిగాయి. అప్పటి ఉస్మా నియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామకిష్టయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సర్దార్ అలీఖాన్, పౌర హక్కుల సంఘం నాయకుడు కన్నాబిరాన్, ప్రణాళిక సంఘం సభ్యుడు సీహెచ్ హనుమంతరావు వంటి హేమాహేమీలు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వివిధ అంశాలపై పలువురు మేధావులు సమర్పించిన పత్రాలపై కూడా సీఎస్ఎస్ అధ్యయనం చేసింది. ఆనాటి ఎమ్మెల్యే పి.ఇంద్రారెడ్డి కూడా సీఎస్‌ఎస్‌ను సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడు తూ నిద్రాణంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు శ్రీకారం చుట్టడానికి కూడా సీఎస్ఎస్లో జరిగిన మేధోమథనమే కారణం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మొగ్గ తొడిగింది.
వెల్జాల చంద్రశేఖర్