e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home Top Slides Telangana History | ఇనుము పట్టి తీసినం.. ఉక్కును కనిపెట్టినం..

Telangana History | ఇనుము పట్టి తీసినం.. ఉక్కును కనిపెట్టినం..

భారతదేశ చరిత్రను చదువుకునే వాళ్లకు సింధులోయ ప్రజలకు కంచు తెలుసనీ అందుకే దాన్ని కంచుయుగం అంటారనీ తెలుసు. ఆ తర్వాతే భారతదేశంలో ‘అయో యుగం’ అంటే ఇనుము యుగం వచ్చిందని చదువుకుంటాం. అంటే సుమారు క్రీస్తు పూర్వం 1300 నుంచి మన దేశంలో ఇనుము వాడకం తెలిసిందని చరిత్ర చెప్తున్నది. ఇక మన దక్షిణ భారతంలో ఇంకొంచెం తర్వాత అంటే క్రీస్తు పూర్వం 1000 నుంచే ఇనుము గురించి తెలిసిందని ఇప్పటివరకు రాసుకున్న చరిత్రలో ఉన్నది. కానీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బయటపడిన సమాధిలో క్రీస్తు పూర్వం 2100 నాటి ఇనుప వస్తువులున్నాయంటే దక్షిణ భారత చరిత్రను అందులో తెలంగాణ చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంత ఉందో తెలుస్తుంది.

‘కమ్మరి కొలిమి, కుమ్మరి సారె జాలరి పగ్గం, సాలెల మగ్గం..’
శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలైన ఈ సాధనాలు కొత్త రాతియుగం నుంచి మన నాగరికతను ముందుకు నడిపినయి. పారిశ్రామిక విప్లవం తర్వాత నుంచి కమ్మరి కొలిమి రూపుమార్చుకొని ఫ్యాక్టరీలలో ‘బ్లాస్ట్‌ ఫర్నేస్‌’గా మారినా, తెలంగాణ నాగరికతా వికాసంలో ఇనుము పాత్ర చాలా ఉంది.

- Advertisement -

ఇనుము ఎక్కడ దొరుకుతుంది?
తెలంగాణ నేలలో ఇనుము విస్తారంగా దొరుకుతుంది. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా మాగ్నటైట్‌ రూపంలో, దక్షిణ తెలంగాణలో లాటరైట్‌ రూపంలో ఇనుము ఉంది. అందుకే భారత ఉపఖండంలో కెల్లా సుమారు 4000 ఏండ్ల ముందే ఇక్కడ ఇనుము వాడకం మొదలైంది. ఇక్కడి నేలలోని పై పొరల్లోనే ముడి ఇను ము ఉండటం వల్ల ఎక్కువ తవ్వకుండానే తీయగలిగేవారు. ఆ ముడి ఖనిజాన్ని పొడిచేసి మట్టినీ, మాలిన్యాల్ని నీళ్లతో కడిగేసి ఇనుము సేకరించేవాళ్లు. వానకాలంలో నీటి ప్రవాహంలో కూడా కొట్టుకువచ్చిన ముడి ఖనిజం కూడా ఒక వనరే.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ సిర్పూర్‌ ప్రాంతంలో వ్యాపించిన చికియాల రాతి పొరల్లో అపారమైన ఇనుప ఖనిజం ఉన్నది. ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో కిలోమీటర్ల మేర నెలపైనే ముడి ఇనుప ఖనిజం విస్తృతంగా దొరుకుతున్నది.

రణంకోట బట్టీ- మన ఇనుము ఉక్కు తయారీ కేంద్రాలు: వేల ఏండ్ల కిందటే మనం ఇనుము ఎలా తయారు చేసుకున్నామన్న ప్రశ్నకు జవాబు ‘రణంకోట’లో దొరికింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుగ్గారం దగ్గరి రణంకోట ప్రాంతంలో ఇనుము తయారీకి వాడిన బట్టీ ఆనవాళ్లు దొరికినాయి. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని నైకుండ్‌ అనే ఊళ్లో దొరికిన పురాతన బట్టీలు కూడా ఇలానే ఉన్నాయి. దీనితో రణంకోట బట్టీలు కొత్తరాతి యుగపు బట్టీలని నిర్ధారించారు. ఇలాంటి ఆధారాలే వరంగల్‌ జిల్లా ధర్మారావుపేట గ్రామ పరిధిలోని పరశురాంపల్లిలో కూడా దొరికాయి. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ దగ్గర రేకొండలో, పెద్దపల్లి జిల్లా తేళ్లకుంట దగ్గర గుట్టల్లో పెద్ద ఎత్తున చిట్టెం, కాల్షియం కార్బొనేట్‌ అవశేషాలను 1980 దశకంలోనే పురావస్తు శాఖ రికార్డు చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా యాపర్లదేవిపాడు దగ్గర తవ్వకాల్లో దొరికిన సుమారు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న బట్టీలు కృష్ణా తీరంలో కొత్త రాతియుగంలో ఇనుము తయారీకి చారిత్రక సాక్ష్యాలు.

కుండలు తయారుచేసే ప్రక్రియలో కుండలను కాల్చే క్రమంలో ఆ వేడికి కరిగిన మట్టిలోని ఇనుప ఖనిజం కొత్త రాతియుగపు మానవులకు ఇనుము కరిగించే పద్ధతిని నేర్పిందని దక్కన్‌లో పరిశోధనలు చేసిన మున్‌ అనే ఆర్కియాలజిస్టు భావించాడు.

ఊరి పేర్లు, పాత గోడలు చెప్పే కథలు
తెలంగాణలో చాలా ఊర్లు ఇనుము, ఉక్కు తయారీతో ముడిపడి ఉన్నాయని చెప్పేందుకు పేర్లే సాక్ష్యం. ఇనుము పదం చేరిన ఇనుకుర్తి, ఇందూరు, ఇందుర్తి లాంటి పేర్లున్నాయి. ఇనుము తయారుచేసినప్పు డు వచ్చే చిట్టెంతో ముడిపడిన చిట్యాల, చిట్టెంల, చిట్టాపూర్‌ పేర్లున్నాయి. కొలిమి నుంచి కొలిమికుంట, కొడిమ్యాల వంటి ఊర్లు, కమ్మ రి వారి ఉనికి చెప్పే కమ్మరిపల్లి, కమ్మరిపేట, కమ్మర్ల – ఇలా చెప్పుకొం టూపోతే తెలంగాణలో వందల ఊర్లతో ఇనుము ముడిపడి ఉన్నది.

పురాతత్వ పరిశోధకులకు ఊర్లలో పాత మట్టిగోడల ఇండ్లు మార్గం చూపిస్తాయి. మట్టి గోడల్లో ఉండే చిట్టెం ముక్కలు ఇనుము తయారీ గురించిన ఆధారాలు చూపుతాయి. సాధారణంగా ఇనుము, ఉక్కు తయారీ గ్రామ పొలిమేరల్లో ఉండటం వల్ల, చిట్టెం కూడా అక్కడి మట్టిలో మిగిలిపోయి, ఆ మట్టితో గోడలు, ఇండ్లు కట్టినప్పుడు, చిట్టెం ముక్కలు గోడల్లో కనిపిస్తాయి. దానితోపాటే ఉండే గోడల్లో ఉన్న పాత కుండ పెంకులు ఆ గ్రామం ప్రాచీనత గురించిన వివరాలు చెప్తాయి.

ప్రపంచ విపణిలో మన ఉక్కు
కొత్త రాతియుగం నుంచే ఇనుము, ఉక్కు తయారీలో తెలంగాణ కమ్మర్లు సాధించిన నైపుణ్యం వివిధ చారిత్రక దశల్లో విదేశీయులను ఆకట్టుకుంది. 17వ శతాబ్దంలో గోల్కొండకు వచ్చిన టావెర్నియర్‌ అనే ఫ్రెంచ్‌ యాత్రికుడు నిజామాబాదు దగ్గరి కోనసముద్రం ఉక్కు అత్యంత నాణ్యమైనదిగా వర్ణించాడు. బాహుబలి సినిమాలో కట్టప్పకు కత్తులు అమ్మడానికి వచ్చిన బాగ్దాద్‌ వ్యాపారి భూగర్భం నుంచి చీల్చితీసిన ఇనుముతో చేసిన కత్తి అని వర్ణిస్తాడు. అది అర్ధసత్యమే. ఎందుకంటే మధ్యయుగాల్లో సైతం అరబ్బులు ప్రేమగా, గొప్పగా పిలుచుకున్న డమాస్కస్‌ (సిరియా) కత్తులకు సైతం తెలంగాణ ఉక్కు వాడారని ఆధారాలున్నాయి.

మధ్య యుగాల్లో జగిత్యాల, ఎలగందుల, కోనసముద్రం, కథలాపూర్‌ కత్తులు, కొడిమ్యాల ఫిరంగులు లాంటి ఆయుధాలే కాదు, బట్టలు కత్తిరించేందుకు కావాల్సిన నాణ్యమైన కత్తెరలు సైతం మనం కొత్తరాతి యుగం నుంచి వారసత్వంగా పొందిన లోహ పరిజ్ఞాన ఫలితమే.

సుమారు 4 వేల ఏండ్ల కిందట ఇనుము ఉక్కు ఆవిష్కరణలతో మొదలైన మన నాగరికతా ప్రస్థానం తెలంగాణలో మానవ వికాసానికి ఉక్కు లాంటి దృఢత్వాన్ని ఇచ్చింది. అందుకే భారత ఉపఖండంలో 2,600 ఏండ్ల కింద మహాజనపదాలు ఏర్పడుతున్న సమయంలో, వింధ్య పర్వతాలకు ఇవతలి భాగాన, మొత్తం దక్షిణ భారతంలోనే మొదటి ఏకైక మహా జనపదం అశ్మక మహా జనపదానికి ఈనేల పురుడు పోసింది.

మమ్మాయి- విశ్వకర్మల దేవత

విశ్వకర్మలుగా పిలుచుకునే కమ్మర్లు, ఇతర లోహ వృత్తికారులు, వడ్రంగులు, రాతి పనివాళ్లు కొలిచే దైవం మమ్మాయి. బహుశా మన సంస్కృతిలో వృత్తి పనుల దైవంగా మొదలైన దేవతల్లో మొదటి దేవత మమ్మాయే కావచ్చు. ఇప్పటికీ ఫాల్గుణ మాసంలో పనులు ఆపేసి కమ్మర్లు పనిముట్లని మమ్మాయి ముందు పెట్టి పూజ చేస్తారు. పెద్దబంకూరు, కోనసముద్రం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న మమ్మాయి ఆలయాలు వేల ఏండ్ల లోహ విజ్ఞాన- సాంస్కృతిక పరంపరకు కొనసాగింపు.

ఉక్కు తయారీ దేశీ పరిజ్ఞానంకరిగించిన ఇనుముకు కర్బనాన్ని (కార్బన్‌) కలుపడం ద్వారా ఇనుమును ఉక్కుగా మార్చిన తొలినాళ్ల విజ్ఞానం మనది. ఇక్కడ తయారైన ఉక్కు పదమే ఊట్జ్‌ (wootz)గా మారింది. డాక్టర్‌ జైకిషన్‌ 4000 ఊళ్లు సర్వే చేశారు. ఇందులో 2,600 గ్రామాల్లో ఇనుము తయారీ ఆనవాళ్లు లభించాయి. 600 గ్రామాల్లో ఉక్కు ఉత్పత్తి చేసిన దాఖలాలున్నాయి. వేల ఏండ్లుగా ఇప్పటికీ ఎన్నో గ్రామాల్లో ఆ పరంపర వారసత్వంగా కొనసాగుతూ వస్తున్నది.

లోహాన్ని కరిగించే మూసల్లో (crucibles) ఉక్కు తయారీ పద్ధతి పూర్తిగా మన ప్రాచీన కమ్మర్ల సృష్టే. ఇనుముతో పాటు తంగేడు కట్టె, పులియాకుల లేప్యం వేసి, కర్ర బొగ్గుతో 24 గంటలు కాల్చి ఇనుముకు కర్బనాన్ని చేర్చడం ద్వారా ఉక్కును తయారుచేస్తారు. మన ఉక్కుపై ఒక పద్ధతిలో గీతలు కనిపిస్తాయి. దీన్నే తెలంగాణ ఉక్కు ట్రేడ్‌ మార్కుగా ప్రపంచం గుర్తించింది.

ఇనుప వస్తువు మన దగ్గరే మొదట దొరికింది


భారత చరిత్రలోనే ఇనుము గురించిన మొదటి ఆధారాన్ని హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆవరణలో దొరికిన బృహత్‌ శిలాయుగపు సమాధి అందించింది. ఈ సమాధిని నిర్మించిన కాలం క్రీస్తు పూర్వం 2795 నుంచి క్రీస్తు పూర్వం 2145 మధ్య అని శాస్త్రీయ పరీక్షలు తేల్చినయి. అందుకే ఈ సమాధుల్లో దొరికిన ఇనుప వస్తువులు, కుండలు వంటి ఖనన సామగ్రి కూడా కనీసం క్రీస్తు పూర్వం 2145 నాటికి చెందినవే అయి ఉంటాయని ఈ సమాధి తవ్వకాలు, వాటిపై విస్తృత పరిశోధన చేసిన ప్రొఫెసర్‌ కేపీ రావ్‌ నిర్ధారించారు. అంటే మన దగ్గర దొరికిన ఇనుప వస్తువులంత పాతవి దేశంలో ఇంకెక్కడా దొరకలేదు. దీని అర్థం ఇనుపయుగం మన దగ్గర మొదలైనట్టే కదా!

ఇనుప యుగం ఎందుకు ముఖ్యం?
రాతియుగం (రాతి పనిముట్లు, వేట- ఆహార సేకరణ చేస్తున్న దశ) నుంచి చారిత్రక యుగం (జనపదాలు, మహా జనపదాలు, రాజ్యాలు ఏర్పడేకాలం) మధ్య ఉన్న కొత్తరాతి యుగం చివర్లో లోహాల పరిజ్ఞానం పెరిగి, వాటి వాడకం మొదలైంది. దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి తెలంగాణలో మిగతా భారత ఉపఖండంలో లాగా కంచుయుగం, తామ్ర (రాగి) యుగం రాకుండానే ఇనుము వాడకం మొదలైందని తెలుస్తున్నది. ఎందుకంటే మన భూమి పొరల్లో, సమాధుల్లో కంచు, రాగి కంటే ఇనుము వాడిన ఆధారాలే ఉన్నాయి. భారత చరిత్ర రచన ఉత్తర భారత, సింధు, గంగా ప్రాంతాల చరిత్రనే కొలమానంగా తీసుకొని రాయడం జరిగింది. వింధ్యకు ఇవతల సముద్రం వరకు ఉన్న దక్షిణ భూభాగం, దక్కన్‌ ప్రాంతం, అందులో తెలంగాణ గురించిన చరిత్రను నిర్లక్ష్యం చేసినందున మన ఇనుప యుగ సంస్కృతి చరిత్రలో సరిగ్గా నమోదు కాలేదు.

ఇక్కడ ఇనుము వాడకం పెద్ద మార్పునే తెచ్చింది. అడవులు కొట్టి వ్యవసాయ భూముల్ని తయారు చేసుకోవడం, వ్యవసాయ పనిముట్లు, ఇంటి వాడకానికి పనిముట్లు, వేటకు, ఆహార సేకరణకు ఆయుధాలు, పశుపాలనకు అవసరమయ్యే పనిముట్లు.. ఇలా అన్ని పనుల్లో ఇనుము ఉపయోగం పెరిగింది. కత్తులు, బాకులు, ఈటెలు, బాణపు ములికి, గొడ్డళ్లు, ఒకవైపు లేదా రెండు వైపులా పదునున్న కత్తులు, చేతిపారలు, ఉలి, మేకులు, పెనం వంటి పాత్రలు, గాజులు, గంటలు, వేలాడే దీపాలు, నాగలికర్రు.. ఇలా ఎన్నో పనిముట్లు మన జీవితంలో భాగమైనాయి. ఇదే మార్పు గ్రామీణ జీవితాల్లో అభివృద్ధి, మిగులుకు దారి తీసింది. ఇదేక్రమంగా చారిత్రక యుగంలోకి ప్రవేశించేందుకు తలుపులు తెరిచింది.

డాక్టర్‌ జైకిషన్‌ మన ఉక్కు మనిషి
తెలంగాణలో ఇనుము, ఉక్కు పరిశ్రమకు సంబంధించి, కొత్తరాతి యుగం నుంచి అసఫ్‌జాహీల కాలం వరకు చరిత్రను రికార్డు చేసి, తెలంగాణ ఉక్కుకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన చరిత్రకారుడు, పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్‌ సంస్థ (ప్రిహా) అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీపెరుంబుదూర్‌ జైకిషన్‌. తెలంగాణ పురావస్తు శాస్ర్తానికి ఆర్కియోమెటలర్జీ (పురాతత్వ లోహ శాస్త్రం)లో చేసిన పరిశోధన ద్వారా మన చరిత్రకు మెరుగులు దిద్దినవాడు. ప్రఖ్యాత లోహ శాస్త్రవేత్త ఐఐటీ ప్రొఫెసర్‌ ఆర్‌. బాలసుబ్రమణియం వంటివారితో కలిసి చేసిన పరిశోధనలతో వేల ఏండ్లుగా తెలంగాణలో వర్ధిల్లిన ఇనుము, ఉక్కు పరిశ్రమ విశ్వవిఖ్యాతమైనది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఎక్సెటర్‌ యూనివర్సిటీ వంటి సంస్థలు డాక్టర్‌ జైకిషన్‌తో కలిసి 183 గ్రామాల్లో ఇనుము- ఉక్కు పరిశ్రమ గురించిన వివరాలను రికార్డు చేసినయి.

డా. ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement