e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News కేంద్రానిది నేలబారుతనం

కేంద్రానిది నేలబారుతనం

వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు.

మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో సత్యశోధక సమాజ్‌ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలే కొన్ని చేపట్టారు. సరిగ్గా 140 ఏండ్ల తర్వాత తెలంగాణ వైతాళికుడు కేసీఆర్‌ ఒక అడుగు ముందుకేసి రైతు సంక్షేమానికి, అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఒక అధ్భుతమైన పరిణామం. కానీ పండిన పంటకు సరైన ధర ప్రకటించకుండా, పంటను కొనకుండా, రైతాంగాన్ని కార్పొరేట్‌శక్తుల దగ్గర తాకట్టు పెట్టేలా కేంద్రం నూతన రైతు చట్టాలతో వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని సృష్టించింది. కానీ రైతుల పోరాటంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో 2014కు ముందు 1.54 కోట్ల ఎకరాలుగా ఉన్న వ్యవసాయ భూమి 2021 నాటికి 1.85 కోట్ల ఎకరాలకు పెరిగింది. దాదాపు 31 లక్షల ఎకరాల బీడు భూములు నూతనంగా సాగులోకి వచ్చాయి. ఈ అభివృద్ధి, సంక్షేమ విధానాలను ప్రపంచ బ్యాంకు, ఐరాస ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వంటి ప్రపంచస్థాయి సంస్థలు కూడా కొనియాడుతున్నాయి. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి సంస్థ సైతం అధ్యయనం చేసి ప్రశంసల వర్షం కురిపించింది.

కార్పొరేట్‌, ప్రైవేట్‌ రంగానికి విద్యుత్‌ సంస్థలను ధారాదత్తం చేయటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. దీంతో కరెంట్‌ బిల్లు లు అనివార్యంగా పెరిగి రైతాంగానికి గుదిబండలా మారనున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర కల సాకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు అనతికాలంలోనే పూర్తిచేసిన అసామాన్యుడిగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచారు. అలాంటి దార్శనికుడిని అసత్య ప్రచారాలతో, అతని కృషిని, శ్రమను గుర్తించకపోవడం నేలబారుతనానికి నిదర్శనం. నిజం నిప్పులాంటిదే అయినప్పుడు, దాచితే దాగని సత్యమే అయినప్పుడు, రాష్ర్టానికి ఒక కోటి 40 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రణాళికను సుసాధ్యం చేసిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజా హృదయాల్లో నిలిచే ఉంటాడనే విషయం కూడా నిజమే.

జల విప్లవ పునాదుల్లో వ్యవసాయ విప్లవంతో పాటు, శిథిలమైన కులవృత్తులకు జీవం పోసేవిధంగా పశుపోషణను అనుసంధానం చేస్తూ చైనా తరహా గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఊపిరిపోసిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణయే అనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ తర్వాత ధాన్యం ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఉత్పత్తి పెరిగితే సరిపోదు. దానికి మద్దతు ధర దక్కి సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మార్కెటింగ్‌ వసతులు కల్పించి పంటను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కొనాలి. అయితే మద్దతు ధర కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అలాగే.. జగిత్యాల, నిజామాబాద్‌, ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతంలో పండే పసుపు మార్కెటింగ్‌ కోసం ‘పసుపు బోర్డు’ ఏర్పాటును పూర్తిగా విస్మరించింది. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఆహార కొరత రాకుండా చూసే బాధ్యత కేంద్రానిదే. కానీ ధాన్యం కొనుగోలుకు కేంద్రం విముఖత చూపుతూ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.

ఈ నేపథ్యంలోంచే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించారు. భూమి సారాన్ని, శీతోష్ణస్థితిని బట్టి ప్రత్యామ్నాయంగా, మార్కెట్‌ అవసరాలకు తగినట్టుగా పంటలను పండించడం ద్వారా రైతుకు లాభసాటిగా ఉంటుంది. మార్కెటింగ్‌ సమస్యలు తలెత్తవు. డిమాండ్‌కు తగిన సైప్లె ఉన్నప్పుడే సరైన ధర లభిస్తుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి పెద్ద ఎత్తున ఉన్నా దేశంలో ఆకలి కేకలు ఉండటం పాలకుల విధాన లోపమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాలకుగానూ మన దేశం 101 స్థానంలో ఉండటం కేంద్ర పాలకుల పాపమే. ఇదిలా ఉంటే తప్పుడు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడం కేంద్ర ప్రభుత్వానికి పరిపాటి గా మారింది. అలాంటి వారికి తెలంగాణలో మనుగడ లేదని చాటిచెప్పాలి.
(వ్యాసకర్త: వైస్‌ ఛాన్స్‌లర్‌, కాకతీయ యూనివర్సిటీ)

ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌
97016 82924

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement