రంగులు పూసుకున్న రాజ్యంలో
రంగురంగుల ముఖ కవళికలు
ముఖాముఖికి తలపడ్డాయి..!!
నవ్వులు రాలని చోట
ప్లాస్టిక్ పూల గుత్తులు వంగి
వంగి నమస్కరిస్తున్నాయి.!!
నాలుగు రోడ్ల కూడలిలో
రుధిర సంద్రంలో ఓ దేహం
కొట్టు మిట్టాడుతూంటే చరవాణిలో
ఛాయాచిత్రం సామాజిక
సేవకి నడుం కట్టింది..!
పొత్తిళ్ల బంధాలన్నీ వలస పిట్టలై
కనుమరుగవుతుంటే
అమ్మ కొంగుకు దుఃఖాన్ని ముడేసి
జ్ఞాపకాల కావడిని మంచంలో మోస్తోంది..!!
ఎక్కడో బంధం తెగిపోతుంటే
ఇంకెక్కడో స్వార్థం ప్రేమను ఉరితీస్తుంది..!!
ఇంటి గొడవల్లో.. ఆస్తి పంపకాల్లో
రక్త సంబంధం పొలం గట్లపై
వెలివేయబడుతుంది..!!
డబ్బుకు లోకం దాసోహంతో ధనాశలో
పేరాశకి తెగ ఆరాటపడుతుంది..!!
చిగురించని లేత కొమ్మలని
కరుణ లేని పాదాలు కర్కశంగా
నలిపేస్తున్నాయి..!!
అడుగడుగునా స్వార్థపు నీడలే
నిలువునా కాటేసే కాలనాగులే..!!
ఇప్పుడు విలువలు
గల ప్రపంచం కావాలి..
కాలం కొమ్మకు కొత్త చిగుర్లు వేసినట్టు
బంధాలకు చిగురు పూత
పూస్తే బాగుండు..!!
పొలం గట్లపై విడిపోయిన
అన్నదమ్ముల ఆప్యాయతలు
అమ్మ ప్రేమ చేతి ముద్ద కమ్మదనం
గుర్తుకొస్తే బాగుండు..!!
వాడిపోయిన స్వప్నాలకు
కొత్త రెక్కలు మొలిచినట్టు
వీడిపోయిన బంధాలకు రక్త సంబంధపు
ఆనవాళ్లు హృదయంలో రాగాలు పలకాలి..!!
అంతరువులన్నీ సమసి
స్వార్థపు రంగులను తరిమి
బంధాలన్నీ భరోసాగా నిలిచి
ఇంద్ర ధనస్సు వన్నెలు
స్వచ్ఛమైన పూలతోటలో
పరిమళించాలి..
ఆలోచనలన్నీ పునరుద్ధరణలోకి
స్వాగతించినట్టు మళ్లీ చిగురించాలి..
సరికొత్తగా..!!