పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రజా పాలన మేకప్ పూర్తిగా కరిగిపోయింది. మేక తోలు కప్పుకున్న గుంట నక్కగా ప్రజల ముందు నగ్నంగా నిలిచింది. సత్యం, అహింస ఆయుధాలుగా స్వాతంత్య్ర సమరాన్ని నడిపించిన గాంధీకి వారసులమని రేవంత్‌రెడ్డితో సహా, కాంగ్రెస్ నాయకులు గప్పాలు కొడుతూ గొప్పలు చెప్తుంటారు. సారాంశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరమహంస కాదు, పరమహింస అని చరిత్ర నిరూపిస్తూ వస్తున్నది.
ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యమని, పౌరహక్కులని, భావప్రకటనా స్వేచ్ఛని, ఆంక్షలు లేని పాలనని, కంచెలు లేని భవనాలని, ఆరు గ్యారెంటీలకు తోడుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ మా ఏడో గ్యారెంటీ అని తెగ ఊదరగొట్టారు. ప్రజాస్వామ్య పాలనకు తాము పూచీగా నిలుస్తామని కాంగ్రెస్ పక్షాన నిలిచిన సోకాల్డ్ సివిల్ సొసైటీ మేధావులు సైతం హామీ ఇచ్చారు. ప్రశ్నించే గొంతుకలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్లని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. కాంగ్రెస్ తోవ తప్పితే దాన్ని తోవలో పెట్టే బాధ్యత తమదని వాగ్దానం చేశారు. పది నెలల పరిపాలన తర్వాత కాంగ్రెస్ ఒక బుల్డోజర్గా అవతరించింది. బీజేపీ బ్రాండ్ బుల్డోజర్ను సొంతం చేసుకున్న రేవంత్ పేద ప్రజల ఇండ్లు కూల్చే పనిని కసిగా కొనసాగిస్తున్నాడు. మొహబ్బత్ కీ దుకాన్ తెరువలేదు గానీ పేద, మధ్యతరగతి ప్రజల మకాన్కే ఎసరు పెట్టాడు. మూసీలో ఇప్పుడు పారుతున్నది మురుగు నీరు కాదు, పేద ప్రజల గుండె మంటలతో మరిగిన కన్నీరు పారుతున్నది. ఆదుకునే దిక్కు కోసం హైడ్రా బాధితులు, మూసీ నిర్వాసితులు తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. తమ గూడు చెదిరిన గోడు వెళ్లబోసుకున్నారు.
చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి చట్టాన్ని చట్టుబండలు చేస్తుంటే, పేద, మధ్య తరగతి ప్రజల బతుకులను నడి రోడ్డున పడేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం చూస్తూ ఉండలేదు కదా. ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు కేటీఆర్, హరీశ్‌లు నిర్వాసితులకు అండగా నిలిచారు. ఈ పరిణామం బాధితులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. గులాబీ జెండా అండగా రావడంతో బాధితుల పిడికిళ్లు మరింత బలంగా బిగుసుకున్నాయి. కాంగ్రెస్ దాష్టీకానికి వ్యతిరేకంగా వారి గళాలు మరింత పదునుగా విచ్చుకున్నాయి. హైడ్రాకు జై కొట్టిన కాంగ్రెస్ అనుకూల మీడియా సైతం ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసి అప్రమత్తం చేయాల్సిన అగత్యం ఏర్పడింది.
సహజంగానే ఈ పరిణామం రేవంత్ రెడ్డిలో ఉక్రోషాన్ని పెంచింది. రేవంత్ రెడ్డికి ఉక్రోషం పెరిగినప్పుడల్లా ప్రతిపక్షం మీద దాడులు చేయించడం పరిపాటిగా మారింది. దానికి కొనసాగింపే నిన్న కేటీఆర్ మీద జరిగిన అప్రజాస్వామిక, దుర్మార్గ దాడి.
పత్రికా సమావేశాల్లో కేటీఆర్, హరీశ్‌రావు వేస్తున్న పదునైన ప్రశ్నలు కాంగ్రెస్ నేతల గుండెల్లో బాకుల్లా దిగుతున్నాయి. మూసీ సుందరీకరణ అనే అందమైన పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టే కాంగ్రెస్ దురాలోచనకు హరీశ్‌రావు, కేటీఆర్ ఇద్దరూ అడ్డంకిగా మారారు. ఈ క్రమంలో వారు బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని, పిడికిలి బిగిస్తే కాంగ్రెస్ పునాదుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆర్థిక వనరులు అందించే అవినీతి పథకానికి ద్వారాలు మూసుకుపోతున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డికి కోపం నషాళానికంటింది. ఇంకేముంది.. మరో భౌతికదాడికి కనుసైగ చేశాడు. రౌడీ మూకలు కేటీఆర్ మీద దాడికి తెగపడ్డాయి. సాకులు వేరే చూపించవచ్చు. ఆర్థిక దోపిడికి వచ్చిన ఆటంకమే అసలు కారణం.
మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. ఓట్లు వేసిన పాపానికి మాకిదా శిక్ష అని బాధితులు కోపాన్ని వెళ్లగక్కారు. సీఎం పర్యటన నిండా ఛీత్కారాలే ఎదురయ్యాయి. అదే సమయంలో పరామర్శించడానికి వచ్చిన హరీశ్‌ను ప్రజలు గుండెకు హత్తుకున్నారు. తమ గుండె కోతను వినిపించారు. తమను ఆదుకోవడంలో నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ మీద నిప్పులు కక్కారు. ప్రజల నుంచి తిరుగుబాటు వేడి, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రశ్నల వాడి రెండింటికీ జవాబు చెప్పలేక రేవంత్ అప్పుడు కూడా దాడినే ఎన్నుకున్నాడు. హరీశ్‌రావు కారు మీద రాళ్లు వేయించాడు.
బానెట్ మీద బండలు వేయించాడు. కాంగ్రెస్ మూక దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త కాలు చితికిపోయిన దుస్థితి. రుణమాఫీ నిజానిజాలు తేల్చడానికి ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోయిన మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ అల్లరి మూకలు అసభ్యకరంగా దాడి చేశాయి.
కొండా సురేఖ మెడలో రఘునందర్ రావు నూలు దండ వేస్తున్న ఫొటోపై సోషల్ మీడియాలో అవాంఛనీయమైన వ్యాఖ్య చేసిన ఘటనను బీఆర్ఎస్ నాయకత్వం ఖండించింది. ఇది నిజంగా గర్హనీయం. రాజకీయాల్లో జెండర్ సెన్సిటివిటీ లోపించడం శోచనీయం. ఇద్దరు నాయకుల సన్మాన సంఘటనపై వికృతంగా వ్యాఖ్యలు చేయడం మానసిక వైకల్యమే. ఎవరో సరైన చైతన్యం లేని ఒక వ్యక్తి ఆ తప్పుడు పనికి పాల్పడ్డాడు. దానికి చింతిస్తున్నామని హరీశ్‌రావు బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. సురేఖ ఆవేదన పట్ల ఒక సోదరుడిగా సానుభూతిగా స్పందించాడు. ఇలాంటి వికృత ధోరణులను బీఆర్ఎస్ అంగీకరించదు. సభ్యత ఉన్న వ్యక్తులెవరైనా దీన్ని గర్హిస్తారు. కేటీఆర్ మీద కాంగ్రెస్ దాడికి తెగబడటం వెనుక కారణం మాత్రం మూసీ నిర్వాసితుల పట్ల కేటీఆర్ తీసుకున్న కచ్చితమైన వైఖరే. ఈ దాడి ద్వారా హైడ్రా, మూసీ నిర్వాసితుల కోసం గట్టిగా నిలబడే నాయకుల మనో నిబ్బరాన్ని దెబ్బకొట్టాలనేది రేవంత్ అసలు పన్నాగం. అంతిమంగా ప్రజా పాలన, ప్రజా పీడనగా మారి ప్రశ్నించే వారి మీద భౌతికదాడులు జరిపే విష సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపింది. బీఆర్ఎస్ పరిపాలనలో బండి సంజయ్ నుంచి రేవంత్‌రెడ్డి దాకా ‘పాదాల మీద నడిచే యాత్ర’లు ఎన్నో చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. దానివల్ల ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు జరుపుకొన్నాయి.
గాంధేయవాదంతో అహింసా మార్గంలో శాంతియుత పంథాలో కూడా ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ఉద్యమం నిరూపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యవస్థలను ప్రశ్నార్థకం చేస్తూ ప్రధాన ప్రతిపక్షం మీదనే హింసాయుత దాడులకు తెగబడితే తెలంగాణ తిరిగి సంక్షోభంలోకి పోతుంది.
ఇవ్వాళ ప్రశ్నించేవారి మీద కాంగ్రెస్ మూకదాడులకు పాల్పడుతున్నది. ఇదిట్లనే కొనసాగితే తెలంగాణలో ఫ్యాక్షనిస్టు తరహా వాతావరణం వ్యాపించే ప్రమాదం ఉన్నది. ప్రశ్నలను రాజకీయంగా ఎదుర్కోవాలి. సంయమనంతో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా ప్రతిదానికి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ఎత్తుగడను కాంగ్రెస్ అనుసరిస్తున్నది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మార్పు. ఆరు గ్యారెంటీలను తీర్చలేని అసహాయత ప్రజల మీద అణచివేతగా పరిణమిస్తున్నది. కుదిరితే డైవర్షన్, కుదరనప్పుడు మూక దాడి అనే పద్ధతిని కాంగ్రెస్ అనుసరిస్తున్నది. ఈ పద్ధతి చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
సమైక్య పాలనలో ప్రజా వ్యవస్థలు దారుణంగా విఫలం కావడం వల్ల హింసాయుత ప్రతిఘటనలు చెలరేగాయి. హింస, ప్రతిహింసలతో తెలంగాణ గ్రామాలు అట్టుడికిపోయాయి. ప్రజలు నైరాశ్యంలోకి మళ్లుతున్న సందర్భంలో అహింసను ఎంచుకున్న తెలంగాణ పోరాటం ప్రజలను ఆకర్షించింది. ప్రజా వ్యవస్థలపై విశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేసింది.
ఎన్నికలను, అసెంబ్లీని, పార్లమెంట్‌ను ఉపయోగించుకుంటూ ఉద్యమాన్ని నడిపింది. గాంధేయవాదంతో అహింసా మార్గంలో శాంతియుత పంథాలో కూడా ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ఉద్యమం నిరూపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యవస్థలను ప్రశ్నార్థకం చేస్తూ ప్రధాన ప్రతిపక్షం మీదనే హింసాయుత దాడులకు తెగబడితే తెలంగాణ తిరిగి సంక్షోభంలోకి పోతుంది. హింస, ప్రతి హింసల వాతావరణం తిరిగి చుట్టు ముడుతుంది. దానికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుంది. అవాంఛనీయ దుష్పరిణామాలు తలెత్తకముందే తెలంగాణ సమాజం మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. గాంధీ జయంతి స్ఫూర్తితో సకలజనులు అందుకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.