వాళ్లు పొద్దున్నే నిద్ర లేచి
పూట కోసం వేటను
మొదలెడతరు
పొయ్యి మీదకు పిరికెడు గింజల కోనం
పొద్దంతా పెయ్యిని హూనం చేస్తరు
వాళ్లు చెమట చుక్కలను చిందిస్తేనే కదా
మన కంచంలో బువ్వ పూలు పూసేది
వాళ్ల కండలు కర్పూరంలా కరిగిపోతేనే కదా
మన గుండెల గోడలు గట్టి పడేది
వాళ్ల రెక్కలను ముక్కలుగా చేస్తేనే కదా
మనం నూలు పరుపులపై నులి వెచ్చగా
నిద్రపోయేది
వాళ్లు మట్టి వాసనలు వెదజల్లితేనే కదా
మన ప్రగతికి దారులు దృఢంగా పడేది
వాళ్ల చెమట చుక్కల తోటి
ఎంతోమంది పునాదులు గట్టి పడ్డాయి.
వాళ్ల అరిగిన హస్తాల తోటి
మన నగరాలు నందనవనంగా మారాయి
మనం స్వేచ్ఛా వాయువులు పీల్చబట్టి
ఏకంగా ఏడు దశాబ్దాలు దాటినా
ఎన్నుకున్న ఏలికలకు ఎజెండా లేదు
ఎంచుకున్న మార్గాలకు సత్తువ లేదు
బడుగుజీవుల బతుకుల్లో వెలుగు లేదు
పల్లు బట్టిన అంగీలు, చిల్లు బట్టిన లుంగీలు
నెర్రబారిన గోడలు, నీళ్లు గారుతున్న పైకప్పులు,
పాసిపోయిన అన్నం, పచ్చడి మెతుకులతోటి
వాళ్లు కాలం వంతెనపై
భారంగా కదులుతున్నారు.
జీవిత రేఖను మార్చే సూర్యుడి కోసం
వేయి కండ్లతోటి ఎదురుచూస్తున్నారు