జిత్తుల నక్క, ఉత్తుత్తినె, నీళ్లకాడ కూకున్ననని,
మాయ జేసి, మల్లన్న జలనిధిని, బీగం విరగ్గొట్టి,
వచ్చిన గంగను, అమాంతం, పోతిరెడ్డిల పోస్తుంటె,
మోమెత్తి, నొసటేలెట్టుకొని, సొంచాయిస్తున్నరు.
తెల్లోళ్లు, అంగడని వచ్చి, దేశాన్ని కొల్లగొట్టినట్టు,
అభినవ తిమింగలం, మింగుతుంటె ఏలుబడోళ్లు,
కూలబడి కళ్లు తేలెస్తే, పాలమూరోళ్లెంగావాల?
మళ్లా మట్టిన బొర్లి, వెట్టిచాకిరి బతుకులేనా?
మోసాన మోకాళ్లడ్డం పెడ్తె, నందికొండ తెల్లబోద్ది.
కరెంటు పడావు బడి, తెలంగాణ చీకట్లమయం.
నిండుగున్న పాలకుండకి, పిల్లిని కాపలా బెడ్తె,
ఎలుకలన్ని గుటగుటా, తాగినవని వర్లుతరు.
నీళ్లు లేని తెలంగాణకు, మాట్లేసి మాయజేస్తె,
కొట్లాడి సకలజనులంతా పోరాడి, సావుకెదురేగి,
వేరు పడి, కడ్పు నిండ బువ్వ తింటుంటె,
కళ్లల్లో నిప్పులెట్టుకుని కుళ్లుకుంటున్నరు.
గోదారికి గండి పెట్టి, కృష్ణమ్మకు కాటుక పూస్తుంటె,
దిష్టిబొమ్మల్లా కావలున్నామని, కుర్చీల కూకుంటె,
మన బత్కులేంది? తెలంగాణేమైతదన్న సోయేది.
మనం పడ్డ వెతలు, ఏట్లొకెళ్తుంటె, నిద్రెలా పడ్తుంది.
మాది తెలంగాణ గడ్డ. సకలజనుల అడ్డా.
హననం మా తీరు గాదు, సహనం మా ఊపిరి.
మా సహనాన్ని, చేతగాని తనమనుకుంటె,
పరాయోళ్లను పొలిమెర దాటించి కంచెబెడ్తం,
ఇంటి దొంగల్ని, ఓట్ల చెట్లకు కట్టేసి కూకోబెడ్తం.
పాలించే ప్రభువులూ, పాలిటిక్స్‌ను పక్కనబెట్టి,
గోసబడ్డ తెలంగాణను, శ్వాస పీల్చుకోనియ్యండి
కృష్ణా, గౌతమిలో తనివిదీరా, జలభ్యాంగన మాడి,
తెలంగాణ కడుపు నిండా, పరమాన్నం తిన్నీయండి.
మాయల ఫకీరు మహానుభావుల్లారా, మాది మీది కాదు.
మా ఓపికను, తోపులు కావనుకోకండి, మా ఇలాఖాలో,
మాయబుచ్చి, వచ్చి, పోపులు పెడ్తె, పప్పులుడ్కవ్,
మా బిడ్డలు, గంగలా ఉప్పొంగి ముంచేస్తరు జాగ్రత్త.
– కమ్మ రంగారావు 94401 79410