రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించటం కోసం స్థలాలను కేటాయించటం చారిత్రాత్మకం. తెలంగాణలో 41 బీసీ కులాల కోసం కోట్ల రూపాయల విలువైన 82.30 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భవనాల నిర్మాణానికి కోకాపేట, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా స్థలాలు కేటాయించడం అభినందనీయం.
బీసీలలో కొన్ని కులాలు మాత్రమే రాష్ట్ర సంఘాలుగా నమోదు చేసుకొని ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షుడినని ప్రకటించుకుంటున్నారు. ప్రభు త్వం బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలాలను, ఆర్థికసహాయం ఎవరికివ్వాలో తెలువకపోవడం వల్ల ఈ మధ్యనే బీసీ కులాల రాష్ట్రస్థాయి సమావేశాలను ఏర్పాటుచేశారు. ఈ సమావేశాలకు హాజరైన బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర బీసీ ప్రభుత్వ పెద్దల ముందు స్థలాలను, ఆర్థిక సహాయాన్ని తమకే ఇవ్వాలని విన్నవించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు బీసీ కులాలు వేర్వేరు సంఘాలుగా కాకుండా ఒకే సంఘంగా ఏర్పడి రావాలని సూచించారు.
బీసీలలో చాలా కులాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సొంత భవనాలు లేక గ్రామాల నుంచి వివిధ పనుల మీద వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తున్నది. ఈ ఇబ్బందులను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయించడం ముదావహం. వచ్చిన అవకాశాన్ని బీసీ కులాలు సద్వినియోగం చేసుకొని కులసంఘాల నాయకులంతా కలిసి ఉమ్మడిగా ఒక ట్రస్టుగా ఏర్పడి ప్రభుత్వం దగ్గరకు వెళ్తే అందరికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి స్థలకేటాయింపు, ఆర్థికసాయం సులువు అవుతుంది. మంత్రులు, తెలంగాణ బీసీ శాఖ ముఖ్యకార్యదర్శి సూచనలు సలహాలు పాటించి అనేక కులాల ప్రతినిధులు ఒకేసంఘంగా ఏర్పడ్డారు.
తెలంగాణలో ఆరెకటిక, యాదవ, ముదిరాజ్, పూసల, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, గౌడ తదితర అనేక బీసీ కులాలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఏక సంఘంగా ఆయా కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేయాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో ఆరె కటికలు 11 గ్రూపులుగా ఉన్నారు. ప్రభుత్వ సూచనతో వారంతా ఏకసంఘంగా తెలంగాణ ఆరెకటిక ట్రస్టుగా ఏర్పడ్డారు. ఈ ట్రస్టు ప్రతినిధులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిని, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి ఆరెకటిక ఆత్మగౌరవ భవనం కోసం సాయం అందించాలని కోరారు.
రాష్ట్రంలో బీసీ కులాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలతో తలెత్తుకొని తిరుగుతాయనటంలో సందేహం లేదు. అన్నికులాల అభివృద్ధి సంక్షేమాల కోసం నిబద్ధతతో కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు జేజేలు.
(వ్యాసకర్త: -డాక్టర్.ఎస్.విజయభాస్కర్ , 92908 26988, రాష్ట్ర ఆరెకటిక ట్రస్ట్ వ్యవస్థాపకసభ్యులు)