చీకటిలో
నల్లని కాటుక తిమిరంలో
అనంతం నుంచి
పాతాళ కుహరంలోనికి
వెన్నెల శకలమో
కాంతి కలశమో
అమృత బిందువో
రేతస్సింధువో
అంతర్లోకపు గుహలో
నెత్తుటి గోడల గదిలో
ఉల్కలా రాలిన కణం
ప్రాణమై మొలిచి
కడుపు కడలిలో
ఆత్మశక్తి పొంది
జ్ఞాన తేజమై
తిమిర కాంతిలో
వెలుగుతూ ఎదుగుతూ
అంతరాళ వ్యోమగామై
కదులుతూ మెదులుతూ
కాలగర్భ రోదసిలో
నవ మాసాలు సంచరించి
అధోముఖాభిగమనంతో
స్వచ్ఛ మంచు స్ఫటికమై
గర్భం నుండి భూగర్భంలోనికి
చిరు చిగురు మొలకై
రోదిస్తూ వచ్చి ఆనందం పంచే
నిష్కళంక నగ్నముని
ఏవో లోకాలనుండి
అరుదెంచిన ఆత్మజ్ఞాని
సవ్యసాచి: 82470 10450