‘చదువుకోవాలి. చైతన్యవంతులు కావాలి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని విముక్తి సాధించాలి’ అంటూ 170 ఏండ్ల కిందట బాలికలకు, మహిళలకు విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు, స్త్రీవాది, సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే. ఆమె స్ఫూర్తితో తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగంలో జరుగుతున్న ప్రయోగాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకూ ఏ స్థాయి విద్యాసంస్థను తీసుకున్నా బాలికలు, అమ్మాయిల సంఖ్య సగానికిపైగా ఉంటున్నది. ఇది మహిళాభివృద్ధి కోణంలోనేగాక, సమాజాభివృద్ధి కోణంలోనూ సానుకూల పరిణామం. యువతులు చదువుకుంటే వారే కాకుండా కుటుంబం, సమాజం, దేశం కూడా బాగుపడుతుంది. తల్లులుగా భవిష్యత్ తరాలను కూడా వారు తీర్చిదిద్దుతారు. ఒక సమాజం ప్రగతి స్థాయిని కొలవాలంటే.. ఆ సమాజంలోని స్త్రీల స్థాయిని లెక్కిస్తే సరిపోతుందని నిపుణులు చెప్పేది ఇందుకే. తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామం భవిష్యత్తులో గొప్ప మార్పునకు నాంది పలుకుతుంది.
ఆధునిక, సంపన్న దేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా మొదలైన వాటిల్లో స్త్రీ విద్యకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీనివల్ల మహిళలు చదువు పూర్తయిన తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. జనాభాలో సగ భాగమైన స్త్రీలు ఉత్పాదకత రంగంలోకి పూర్తిగా దిగినప్పుడే ఆయా దేశాలు ప్రగతిబాట పడుతాయి. కానీ, దేశాన్ని ఇన్నాళ్లుగా పాలించిన ‘పేరు గొప్ప’ జాతీయ పార్టీల వల్ల 21వ శతాబ్దంలోనూ భారతదేశ జీడీపీకి మహిళలు అందిస్తున్న వాటా కేవలం 18 శాతమే. మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. ఉత్పాదక రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించగలిగితే 2025 నాటికి భారత జీడీపీకి అదనంగా రూ.58.43 లక్షల కోట్ల మొత్తం జమవుతుంది. ప్రస్తుతం మనదేశ జీడీపీ రూ.147 లక్షల కోట్లు. అంటే మహిళాశక్తిని పూర్తిగా వినియోగించుకోగలిగితే దేశ జీడీపీ కేవలం మూడేండ్లలో 39 శాతం పెరుగుతుంది.
బాలికా విద్య ద్వారా జరిగే మార్పులివి. దీనిని చూడటానికి దార్శనికత కావాలి. దీనిని అమలు చేయటానికి సాహసం కావాలి.‘విద్యార్థినులు ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు? హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావటం ఏమిటి?’ అంటూ లేని వివాదాలు, మతపిచ్చి రేపే వారికి ఇలాంటి విషయాలు అర్థం కానివి. వారి ఊహకు కూడా అందనివి. కానీ, ఈ దేశంలోనే అత్యంత పిన్న రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఆ దార్శనికతతో, ఆ సాహసంతో పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ విద్యారంగానికి, అందులోనూ బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వందల సంఖ్యలో గురుకులాల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు, ఇంగ్లిష్ మీడియంలో బోధన.. ఈ సమగ్ర కార్యాచరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. బడి నుంచి యూనివర్సిటీ దాకా ఆడబిడ్డలతో కళకళలాడుతున్నాయి.