న్యూఢిల్లీ: నడుస్తున్న వ్యక్తి బురద చిందించడంపై ఐదుగురు బాలురు ఘర్షణకు దిగారు. ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులైన బాలురను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (5 Minors Stab Man) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జూలై 9న అశోక్ విహార్ ప్రాంతంలో ఒక వ్యక్తి కత్తి గాయాలతో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. కత్తి గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఉధమ్ సింగ్ పార్క్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల బన్సీ లాల్‌గా మృతుడిని పోలీసులు గుర్తించారు. లాలా లజపత్ రాయ్ మార్కెట్లోని ఒక సీసీటీవీ షాపులో అతడు పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. బన్సీ లాల్ హత్యపై దర్యాప్తు చేశారు. కాలువ సమీపంలోని బురద ప్రదేశంలో అతడు నడుస్తుండగా కొందరు బాలురపై పొరపాటున బురద పడంతో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాలురు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేసి పారిపోయినట్లు దర్యాప్తులో బయటపడింది.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, నిఘా సమాచారం ఆధారంగా నిందితులైన మైనర్ బాలురను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. హత్యకు వినియోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.