‘ఆల్త్ ఫాల్త్ మనిషిని గాదు, నేను కేసీఆర్‌ను. తెలంగాణల ఏ మూలనైనా నాదే’ అని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సభలో అన్నారు. నిజమే తెలంగాణలో జరుగుతున్న సుస్థిర ప్రగతిని చూస్తుంటే తెలంగాణను కేసీఆర్ ఓన్ చేసుకున్నంతగా ఏ నాయకుడూ చేసుకోలేడనేది నగ్న సత్యం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యం కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలో కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి. సాధించుకున్న తెలంగాణను విజయవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడే తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత. అందుకే ఉద్యమ లక్ష్యాలను ఒక్కొక్కటిగా కేసీఆర్ నెరవేరుస్తూ తెలంగాణ అంటే దేశానికే ఒక రోల్ మోడల్ అని నిరూపిస్తున్నారు.
చదువుకునే బడి, సాగుచేసే మడి, దేవుడుండే గుడి, అమ్మ ఒడి.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నింటా అభివృద్ధే. గత డబ్భు ఏండ్లలో అభివృద్ధి అంటే కేవలం కాగితాలు, శిలాఫలకాలకే పరిమితం. కానీ గత ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి తెలంగాణ ప్రతి పల్లెలో కండ్లముందు కదలాడుతున్నది. ఇంతకాలం జరగని ప్రగతి ఇప్పుడెలా సాధ్యమైంది? ఢిల్లీలో అధికారంలో ఉన్న జాతీయపార్టీల నాయకులు గతంలో ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకంటే జాతీయపార్టీలకు తెలంగాణ అంటే ఒక రాజకీయ ప్రయోగశాల. తెలంగాణ ప్రజలంటే వాళ్లకు ఓట్లు సీట్లు. కానీ కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధే ఎజెండా. తెలంగాణ ప్రగతే తన జెండా. తెలంగాణ పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమే నేడు అన్నిరంగాల్లో విజయాలనందిస్తున్నది. తెలంగాణ అభివృద్ధి కోసం అహర హం కృషిచేస్తున్నారు. బీటలువారిన నేలలన్నీ నేడు పచ్చని చీర కట్టుకున్నాయి. నాడు కాలువల్లో సర్కారు తుమ్మలు మొలిస్తే నేడు గంగమ్మ పారుతున్నది. ఇలా సమస్త రంగాలు కొత్తరూపును సంతరించుకున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నా రే తప్ప, కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ సాధించిందేమిటో, ఇప్పుడు గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తూ తెలంగాణకు బీజేపీ చేసిందేమిటో చెప్పలేకపోతున్నాయి. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిని లెక్క చేయకుండా ప్రజల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ ముందుకుసాగుతున్నారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యల ప్రాంతంగా విలసిల్లిన తెలంగాణలో ఇప్పుడు సిరులు కురిపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు సంతోషంగా, ఆత్మ గౌరవంతో బతుకుతున్నాడు.
రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నామం టే దీనివెనుక ఎంత కఠోర శ్రమ ఉన్నదో తెలంగాణ ప్రజ లకు తెలుసు. గత ఎనిమిదేండ్లలో రూ.50 వేల కోట్లతో రైతుబంధు, లక్షన్నర కోట్లతో కాళేశ్వరంతో పాటు వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి, 76,751 రైతు కుటుంబాలకు 3,8 37.45 కోట్ల సాయం, రూ.28,473 కోట్లతో వ్యవసాయానికి విద్యుత్ సదుపాయాల కల్పన, ఏడాదికి రూ.10,500 కోట్లతో ఉచిత నిరంతర విద్యుత్ ఇలా అనే క విధాలుగా రైతుకు దన్నుగా కేసీఆర్ నిలుస్తున్నారు.
వందేండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఎనిమిదేండ్లలో జరిగితే ఏమవుతుంది. కొన్ని దుష్టశక్తులు ద్వేషం పెంచుకుంటాయి. తెలంగాణ, రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతున్న కేసీఆర్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదే చేస్తున్నారు. ప్రజల నుంచి ఆయన్ను దూరం చేసేందుకు వికృత చేష్టలు చేస్తున్నారు. వీళ్లేం చేసినా ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకో లేని స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరనేది జగమెరిగిన సత్యం.
ఒక మనిషి చరిత్రలో భాగం కావొచ్చు, కానీ తానే ఒక చరిత్ర అవ్వడం అరుదు. తరాలు మారినా తరిగిపోని చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం. యాదాద్రి పునర్నిర్మాణం ఒక అద్భుతం. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, దేశం గర్వించేలా అతికొద్ది రోజుల్లోనే ఒక దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం. అది కేసీఆర్ చేశారు. రూ.2 వేల కోట్లతో రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిల, 800 మంది శిల్పులు, 1500 మంది కార్మికులు, 6 వేలకు పైగా శిల్పాలు… నేడు దేశమే అబ్బురపడేలా యాదాద్రి కొత్త శోభను సంతరించుకున్నది. ఆలయం ఉన్నంతకాలం కేసీఆర్ పేరు సుస్థిరం. చిరస్మరణీయం.
కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ఏం చేస్తున్నదో ప్రజలకు తెలుసు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే బీజేపీ ప్రభుత్వం మొండికేస్తున్నది. ‘మా ధాన్యం కొనండ’ని ఢిల్లీ వెళ్లిన మంత్రులతో ‘తెలంగాణ ప్రజలు నూకలు తినండి’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉచిత సల హాలు ఇవ్వడం గర్హణీయం. కార్మిక వ్యతిరేక విధానాలతో హక్కులను హరిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. కానీ దేశంలో ఉన్న వనరులను ప్రజలకు ఉపయోగపడేలా ఎలా వాడుకోవాలో మాత్రం పట్టించుకోరు. ఇది అత్యంత దురదృష్టకరమే కాదు, దేశానికి ప్రమాదకరం కూడా. ఈ నేపథ్యంలోంచే.. దేశంలో కేంద్రం చేస్తున్న అన్యాయంపై గళమెత్తిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఇవ్వాళ దేశానికి తెలంగాణ మోడల్ అవసరం. రేపు దేశంలో సైతం కేసీఆర్ అతిపెద్ద ప్రభావశీలశక్తిగా మారనున్నారనటంలో సందేహం లేదు. దేశ వనరులను వినియోగించుకొని వాటి ఫలాలను ప్రజలకు అందించినప్పుడే దేశాభివృద్ధి ప్రగతిపథంలో ముందుకుసాగుతుంది. అం దుకు తగిన అద్భుతమైన అవగాహన, కార్యదక్షత ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. ఈ దేశాన్ని మార్చే శక్తి ఆయనకే ఉన్నది. తెలంగాణను ఎలాగైతే అభివృద్ధి చేశారో రేపు దేశానికి కూడా కేసీఆర్ కొత్త తొవ్వ వేస్తారనటంలో సందేహం లేదు. వెయ్యేండ్లు గడిచినా తరగని చరిత్రను నిర్మించిన నేత కేసీఆర్.
-తాడబోయిన విజయ్ , 94919 98702