ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైంది. నాటినుంచి నేటిదాకా మాదిగలు పోరాడుతూనే ఉన్నారు. ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చిన రాజకీయ పార్టీలన్నీ మోసం చేస్తూనే ఉన్నాయి. అందులో బీజేపీ ముందువరుసలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభ తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం గర్హనీయం.
1994 లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఐదారేండ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎమ్మార్పీఎస్ ఇప్పటికీ పోరాటం చేస్తున్నది. రాష్ట్ర విభజనతో పాటు చట్ట, న్యాయ, సాంకేతికమైన సమస్యలు ఏర్పడిన కారణంగా ఈ అంశం నేటికీ ఎటూ తేలకుండానే మిగిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 59 కులాలు ఎస్సీ కేటగిరీ జాబితాలో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది (48.2 శాతం) కాగా, మాలలు 55,70,244 (40 శాతం) మంది. ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం ఉంటుందని అంచనా. జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువైనప్పటికీ విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో మాదిగలు చాలా తక్కువ ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. నాటికి మాదిగలు 18 వేల మంది ఉద్యోగాల్లో ఉండగా, వారిలో 80-90 శాతం నాల్గో తరగతి ఉద్యోగులే. మరోవైపు, మాలలు 72 వేల మంది ఉద్యోగులున్నారు.
రిజర్వేషన్‌తో ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం మాలలకు దాని ఉపకులాల వారికి దక్కగా, మాదిగ దాని ఉపకులాలకు దక్కింది 20 శాతమే. ఈ నేపథ్యంలోంచే ఎస్సీ కులాలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్ ముందుకువచ్చింది.
జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న, నాటి ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ జీవో విడుదల చేసింది. గ్రూపు ఏ-లో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటా ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ‘బీ’- గ్రూపులో మాదిగ దాని ఉపకులాలు- మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటా కేటాయించారు. ‘సీ’- గ్రూపులో మాల దాని ఉపకులాలు- మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా కేటాయించారు. ‘డీ’ గ్రూపులో అది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1 శాతం కోటా నిర్ణయించారు.
2000 సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. నాటి రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాను నిర్ణయించారు. 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. దాంతో పంచాయితీ మళ్లీ మొదటికే వచ్చింది. వర్గీకరణ అమలైన ఐదేండ్లలో మాదిగలకు 22 వేల వరకూ ఉద్యోగాలు వచ్చాయని ఓ అంచనా. ఆ తర్వాత మాదిగల న్యాయమైన కోరిక అనుసరించి 2004లో అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా కేంద్రం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
2008 మే నెలలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫారసు చేశారు. కానీ కేంద్రం దీన్ని ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత పక్కనపెట్టడం ఆనవాయితీగా చేశాయి. ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చి వారి స్వార్థానికి వాడుకొని వదిలివేశాయి. ఈ పార్టీల కుట్రపూరిత కసాయి ఎత్తుగడలు అంచనా వేయటంలో ఉద్యమం విఫలమైంది.
‘దళిత బంధు’ లాంటి పథకంతో దళితవర్గాల అభ్యున్నతికి పాటుపాడుతున్న కేసీఆర్, వర్గీకరణ ఉద్యమానికి మొదటినుంచీ అండగా నిలుస్తున్నారు. నిజాయితీగా దళితుల పక్షాన నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచి ముందుకుపోదాం. కుల, మత రహితంగా అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్న కేసీఆర్‌కు అన్నివేళలా అండగా నిలుద్దాం. వర్గీకరణను సాధించుకుందాం.
(వ్యాసకర్త: మంగళపెల్లి శ్రీనివాస్ 98497 99674, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మహబూబాబాద్)