తెలంగాణ ప్రజలను కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దారుణంగా మాట్లాడారు. ‘నూకలు తినడం నేర్చుకోండి’ అంటూ ఎగతాళి చేశారు. దక్షిణాది అంటేనే ఉత్తరాదివారికి ముఖ్యంగా బీజేపీ నేతలకు చిన్నచూపే. సమస్య పరిష్కారం కోసం పోతే ఆహార సంస్కృతిని హేళన చేస్తూ మాట్లాడటం వారి దురహంకారానికి నిదర్శనం.
తరతరాల చరిత్రలో తెలంగాణ అనేక ఆటుపోట్లను దాటివచ్చింది. కరువు కాటకాలను గెలిచివచ్చింది. ఆ క్రమంలో అంబలి తాగింది. నూకల బువ్వ తిన్నది. కానీ ఉనికిని మాత్రం కోల్పోలేదు. జొన్న గట్క, తైద అంబలి, మక్కరొట్టె సత్తా ఏమిటో దేశ ప్రజలకు తెలుసు. అయితే.. యాసంగి వడ్లు కొనండి, బియ్యం అయితే ఆ సీజన్లో నూకలవుతాయంటే… ‘ఆ నూకలే తినుపోండి’ అనటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ రీతిన ఉన్నదో తేటతెల్లం అవుతున్నది.
నూకలు తినటం మాకేం కొత్త కాదు, అవి తినటం హీనం అంతకన్నా కాదు. మా ఆహారంలో నూకలు భాగం. వాటితోపాటే.. జొన్న రొట్టెలు గొడ్డుకారం తింటూనే సుదీర్ఘ పోరాటాలు చేశాం. మా గమ్యాన్ని ముద్దాడాం. ఇప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థాయిలో ఉన్నాం. మేం సన్నబియ్యం రెండు పూటలా తినటమే కాదు, పదిమందికీ పెట్టే స్థితిలో ఉన్నాం. ఇంకా మమ్మల్ని ఎగతాళి చేస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి మాటలతోనే సీమాంధ్ర పాలకులకు తెలంగాణలో పుట్టగతులు లేకుండాపోయాయి. ఇప్పుడు బీజేపీ నేతలుగా మీరు మాట్లాడటం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తిండి, వేషభాషలపై ఎటకారం చేస్తే తగిన శాస్తి జరగక తప్పదు. తెలంగాణ ప్రజల వేషభాషలను అవహేళన చేసినవారికి ఏ గతి పట్టిందో కండ్లముందే ఉన్నది. అయినా ఈ ఉత్తరాది దురహంకారుల్లో మార్పు రాకపోవడం సిగ్గుచేటు.
తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి. సీఎం కేసీఆర్ లాంటి విజినరీ నాయకత్వంలో తెలంగాణ సమా జం జాగృతమై ఉన్నదన్న సంగతి మరిచిపోవద్దు. తమ సంప్రదాయం, సంస్కృతి, ప్రతిభ, నైపుణ్యం.. దేనిపైనైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ సహించదు. ఇలాంటి మాటలు మాట్లాడిన మీకు నూకలు చెల్లడం ఖాయం. తెలంగాణ ప్రజలు దేనినైనా సహిస్తారేమోగానీ.. ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోరు. తెలంగాణ ప్రజలు మీకు నూకలు, పరం, తవుడు బుక్కించడం ఖాయం. అడుగడుగునా తెలంగాణను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా నూకలు చెల్లటం ఖాయం.
ఒకప్పుడు తెలంగాణలో నూకలు, మక్క గట్క తినే కుటుంబాలుండేవి. అంటే వారు పేదరికంలో ఉన్నట్లే. బియ్యం పిరం. నూకలు అగ్గువ. కిలో బియ్యం కొనే పైసలతో పది కిలోల నూకలు వచ్చేవి. ఇలా తక్కువ పైసలకే ఎక్కువ వచ్చే నూకలను తినడమంటే వారి పేదరికానికి ఓ సూచీ వంటిదే. ‘రెండు పూటలా బియ్యమన్నం ఎప్పుడు తింటమో?’ అని అనుకోని కుటుంబం తెలంగాణలో ఉండదు. రెండుపూటలా సన్న బియ్యం తింటున్నారంటే ఆర్థికంగా స్థిరపడిన వారనే అర్థం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సస్యశ్యామలమైంది. రాష్ట్రమే ధాన్యాగారమై ఇంటింటా వడ్లరాసులైనయి. ప్రజల ఆర్థికస్థాయి పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు నూకలు తినే రోజులు పోయాయి. అదో పీడకలగా భావిస్తున్నారు. కానీ.. నాటి తెలంగాణ ప్రజల ఆహార అలవాట్లను గుర్తు చేస్తూ కేంద్రమంత్రి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. గర్హనీయం. ఇప్పటికైనా కేంద్రం వాస్తవ స్థితులను గుర్తించి తగిన రీతిలో స్పందించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే పంటలను కొనుగోలు చేయాలి. కొర్రీలు పెట్టి కొనబోమంటే.. ఊరుకునేది లేదు. ఇది తెలంగాణ రైతుల మనుగడ, ఆత్మగౌరవ సమస్య.
(వ్యాసకర్త: గోసుల శ్రీనివాస్ యాదవ్, 98498 16817, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)