‘ఈ వేల మా యింట ఇంపుగా భోంచేసి పోవయ్య ద్వాదశి పుణ్యదినం నేడు..; సరళిత పాకంబు సన్నబియ్యపు అన్నము…’ అంటూ మన గ్రామీణ వాగ్గేయ కారులు పాడుకున్నారు. శ్రీరామునితో పాటు, హన్మంతుడు, ఇతర వానరసేనలకు కూడా కడుపార భోజనం వడ్డిస్తామని ఆహ్వానించినట్లు ప్రజలు జానపద గాథల్లో చెప్పుకొన్నారు. తమకు ఏ సంబంధం లేకున్నా ఇంటికి వచ్చిన అతిథికి గౌరవ మర్యాదలిచ్చే గొప్ప సంస్కృతి తరతరాలుగా తెలంగాణ ప్రజలది’.
కాకతీయుల కాలం నుంచీ ప్రతిగ్రామాన ఉండే దిగుడు బావులు, మెట్లబావు లు, చెరువులు, చెలిమలతో వేల ఏండ్లుగా తెలంగాణ జలసిరుల ఖజానా. పాడి పంటల పసిడి నేల. తెలంగాణకు ఏ నాడూ నూకలు తినే గతి లేదు. కడుపునిండ తిన్నారు, ఒళ్లు దాచుకోకుండా కష్టించి పనిచేశారు. తోవంట పోతూ.. దూప అని వచ్చిన వారికి చెంబునిండా ‘చల్ల’ ఇచ్చి సల్లగ చూసుకున్నరు. ఆకలి అని వాకిట్లకొచ్చిన వారిని చుట్టంగా ఆదరించి అతిథి మర్యాదలు చేశారు. ఎదుటి మనిషిని ఆదరించి అక్కున చేర్చుకోవటం తెలంగాణ రీతి, నీతి.
ఏనాడైతే.. వలసవాదులు వచ్చి ఈ నేలను చెరబట్టి సహజ వనరులను, నీళ్లు, నిధులను తరలించుకుపోవటంతోనే తెలంగాణకు కష్టాలు వచ్చాయి. కరువులు తాండవించాయి. అది బ్రిటిష్ వలసపాలకులు మొదలు, సీమాంధ్ర వలస వాదుల దాకా తెలంగాణ పట్ల అనుసరించిన నిర్లక్ష్యం, వివక్ష కారణంగానే తెలంగాణ కరువు కాటకాల పాలైంది.
వలసవాద పాలకుల వివక్ష, అణచివేతల్లోంచే.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రసాధనోద్యమం పురుడు పోసుకున్నది. సుదీర్ఘ పోరాటం, అనన్య త్యాగాలతో ఆధునిక చరిత్రలోనే అతిగొప్ప ప్రజాస్వామిక పోరాటంగా చరిత్రలో నిలిచింది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఆకళింపు చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ శాంతియుత పోరాటంతో తెలంగాణ కలను సాకారం చేశారు. రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది మొదలు… ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికోసం కేసీఆర్ చేసిన కృషి ఫలితంగా ఏడేండ్ల కాలంలోనే అనేక అద్భుత విజయాలు సాధించింది. గుక్కెడు మంచినీటికోసం వాగులు వంకలకు మైళ్లదూరం నడిచిన తెలంగాణ పల్లెల్లో ఇవ్వాళ ఇంటింటా కృష్ణా, గోదావరిలా నల్లా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నెర్రెలు బారిన నేలలు పచ్చని పంటభూములయ్యా యి. రైతులు వానచినుకు కోసం మొగులు వైపు మోరలెత్తి చూసే దుస్థితి దూరమైంది. కాళేశ్వరంలాంటి సాగునీటి ప్రాజెక్టులతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి రాష్ట్రమే ధాన్యాగారంగా మారింది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది.
రైతులు పండించిన పంటను తమ అవసరాలకు పోను మిగిలిన దాన్ని దేశావసరాల కోసం ఇస్తారు. అట్లాంటి ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి, దేశవ్యాప్తంగా ప్రజల ఆహారభద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కానీ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనమంటే.. కొర్రీలు పెట్టి కొనబోమని చెప్పటం బాధ్యతా రాహిత్యం. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు మొక్కాల్సింది పోయి.. కించపర్చటం కుర్సబుద్ధి. వడ్లు కొనాలని అడుగుతున్నందుకు ఎక్కిరింతలకు పోవటం లేకితనం.
దేశంపై ముఖ్యంగా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం ఎన్నాళ్లు? ఇవ్వాళ.. వడ్లుకొన మని అడిగితే.. నూకలు తిని బతకమని దెప్పిపొడుస్తారా? ఈ మాటలు.. ఒక్క రైతులను హేళన చేయటం మాత్రమే కాదు, తెలంగాణ నేలను కించపర్చటం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని భంగపర్చటం.
మాకు రావాల్సినవి ఇవ్వకుండా లోకువ చేసి మాట్లాడుడేంది! మా పన్నులు తీసుకొని మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుంట ఈ ఎత్తిపొడుపులేంది? పచ్చని పంటలతో దేశ ప్రజల ఆహారభద్రతకు హామీగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతులను కించపర్చటమంటే.. మొత్తం తెలంగాణ నేలను అవహేళన పర్చినట్లే..
ప్రేమకూ, జాలికీ, కరుణకూ తెలంగాణ తలవంచుతుంది. శరణుజొచ్చిన వాడిని కడుపున పెట్టుకొని కాపాడుతుంది. తెలంగాణ దేనినైనా సహిస్తుంది, కానీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం అస్సలు ఊర్కోదు. ఆత్మగౌరవంతో ఆగ్రహిస్తుంది. చరిత్ర పొడుగునా క్రూరత్వంపై ధిక్కార స్వరం తెలంగాణ. సమ్మక్క, సారలమ్మల తెగువనుంచి మొదలుకొని నిజాంను మెడలు వంచి గద్దె దించేదాకా తెలంగాణ తెగువ ఎంత వీరోచితమో ప్రపంచానికి తెలుసు.
వలసవాదులను ప్రజాస్వామ్యబద్ధంగా పారదోలిన తెలంగాణ పోరాటానికీ, త్యాగానికీ చిరునామా. త్యాగపూరితమైన తెలంగాణ రైతన్నల కోరికను కేంద్రం తన బాధ్యతగా స్వీకరించాలి. తెలంగాణ వడ్లుకొని వెతలు తీర్చాలి.
రైతును ఏడ్పిచ్చిన రాజ్యం విలసిల్లలే. రైతుతో పెట్టుకున్నోడు చరిత్రలో ఎవరూ కొసెల్లలే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం చెప్పింది ఇదే. తెలంగాణ రైతులోకం కన్నెర్రజేసేదాకా కేంద్రం కాలయాపన చేయొద్దు. రైతులను, తెలంగాణ నేలను అవమానించేలా కేంద్ర మంత్రి మాట్లాడటం బాధ్యతారాహిత్యం. ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలె.
– గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ