మతం, అధికారం, ప్రజాస్వామ్యం ఈ మూడింటినీ ఇంత బాహాటంగా, ఇంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని చూసి ఒకవైపు పట్టరాని ఆశ్చర్యం, మరొకవైపు జుగుప్స కలుగుతున్నాయి. ప్రపంచ చరిత్రలో మతం, అధికారం, ప్రజాస్యామ్యంలలో ఏదో ఒకటి దుర్వినియోగం చేసి ప్రభుత్వాలున్నాయి. ఇందులో ఏ రెండింటినైనా చేసినవీ ఉన్నాయి. కానీ మొత్తం మూడింటినీ మరీ ఇంతగా దుర్వినియోగం చేసినవి కన్పించవు. ఆ విధంగా ఈ ప్రభుత్వం మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతి హీనమైనదిగా మిగిలిపోనున్నది.
ఈ మూడు విధాలైన దుర్వినియోగాలకు ఉదాహరణలు 2014 నుంచి అనేకం కనిపిస్తాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పార్టీ తన ప్రజాస్వామిక సిద్ధాంతాల బలాన్ని ఆధారం చేసుకొని, దేశానికీ ప్రజలకూ తాను చేయగల మేలు ఏమిటో తన విధానాల రూపంలో చెప్పి, ఇతర పార్టీలు, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వెల్లడిస్తూ, ఈ బలాలతో అధికారానికి రావాలి. కాని తొలిసారి 2014లో అదేవిధంగా అధికారం సాధించిన బీజేపీ, పరిపాలనలో, అభివృద్ధిలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలం కాసాగింది. ఆ స్థితిలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, మరింత విస్తరించుకునేందుకు మతాన్ని బాహాటంగా, విచ్చలవిడిగా దుర్వినియోగపరచటం మొదలుపెట్టింది. మరొక వైపు తాము గెలవకున్నా ఇతర పార్టీ ప్రభుత్వాలను కూలదోయటం సాగించింది.
ఈ మూడు దుర్వినియోగాలు కూడా దేశానికి నష్టం కలిగించేవే. కాని, అన్నింటికన్న తీవ్రమైన, అతి ప్రమాదకరమైన నష్టం మతాన్ని దుర్వినియోగ పరచటం. అధికార, ప్రజాస్వామ్య దుర్వినియోగాలు దేశ వ్యవస్థలను నష్టపరుస్తాయి. అవి ఒక భవనంలోని ఉపరితల నిర్మాణాల వంటివి. అందుకు భిన్నంగా మతం అన్నది ఒక దేశపు, ఒక సమాజపు సుదీర్ఘ చరిత్ర, సంస్కృతులతో, ప్రజల నిత్య జీవితాలు, విశ్వాసాలతో పెనవేసుకుపోయిన పునాది వంటిది. ఉపరితల నిర్మాణం నష్టపడితే తిరిగి నిర్మించుకోవచ్చు. అది దుర్వినియోగమైనా తిరిగి నిర్మించుకోవచ్చు. కాని పునాది భంగపడితే ఆ దేశానికి, సమాజానికి చెందిన అనేకానేకం భంగపడతాయి. ఆ నష్టాలు వందల సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఆ నష్టం తిరిగి ఎప్పటికి పూడగలదో, ఎవరు పూరించగలరో ఊహించటం అసాధ్యం.
అధికారం కోసం మతాన్ని ఏదో కొద్దిస్థాయిలో ఉపయోగించుకోవటాన్ని, అది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ, కొంత సహించవచ్చు. మొదట గుజరాత్లో, తర్వాత జాతీయస్థాయిలో మోదీ రాకకు ముందు పాతతరం బీజేపీ, సంఘ్ పరివార్ నాయకులు చేసినట్లు. కాని మోదీ రాకతో ఇది ఎన్నడూ లేనంత బాహాటంగా, విచ్చలవిడిగా మారింది. ఇందులో దాగి ఉన్నది ఒకటి వారి రాజకీయాధికారం కాగా, రెండవది తమ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గాలకు దేశాన్ని అంతే బాహాటంగా విచ్చలవిడిగా దోచిపెట్టడం. 2014 నుంచి మొదలుకొని దేశ వనరులు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు, వీటన్నింటిని నియంత్రించే చట్టాలకు ఏమవుతున్నదో ఎవరెట్లా లాభపడుతున్నారో, ఎవరు నష్టపోతున్నారో గమనిస్తున్న వారికి ఈ విషయాలన్నీ తెలిసినవే.
ఈ దుర్మార్గాలతో పాటు, పాలనాపరంగా, అభివృద్ధిపరంగా తమ జీవితాలకు కలుగుతున్న కష్ట నష్టాలేమిటో ప్రజలకు తెలియకుం డా ఉండటం కోసం మత ప్రచారాల తెరలను కమ్మటం బీజేపీ సాగిస్తున్న మత దుర్వినియోగానికి మరొక కోణం. అయితే, పైన అనుకున్నట్లు, హిందూ మతాన్ని ఈ విధంగా దాని స్వరూప స్వభావాలకు విరుద్ధంగా, దాని మూల ధర్మాలకు భంగకరంగా, అతిహీనమైన రీతిలో, బాహాటంగా, రకరకాల సాకులు, వక్రీకరణలతో విచ్చలవిడిగా, తమ అధికారం కోసం పచ్చిగా దుర్వినియోగపరచటం అన్నింటికి మించి విచారకరమైన విషయం. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన, సుప్రసిద్ధమైన, విస్తృతమైన మతాలలో హిందూ మతం ఒకటి. అది మతమా ఒక జీవన విధానాన్ని ఆలంబన చేసుకున్న సంస్కృతా అనే చర్చను అట్లుంచితే, స్థూలమైన రీతిలో మతంగా పరిగణనలో ఉంది. ఆ మతాన్ని హిందువులు శ్రద్ధగా అనుసరిస్తారే తప్ప, బీజేపీ వలె తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచరు. బీజేపీ వల్ల హిందూమతం అప్రతిష్టపాలవుతున్నది. స్వదేశంలో గాని, విదేశాలలో గాని అర్థం చేసుకోగలిగినవారు హిందూ మతాన్ని, బీజేపీ అధికార కండూ తిని, మత దుర్వినియోగాన్ని తప్పకుండా వేరు చేసి చూస్తారు. అదే సమయంలో అర్థం చేసుకోలేని వారి సంఖ్య తక్కువగా కాదు. కనీసం ఆ మేరకు బీజేపీ, హిందూ మతం పేరు చెప్తూనే దానిని అప్రతిష్ట పాలుచేస్తున్నది. ఆ పేరిట విధ్వంసకర పాత్రను పోషిస్తూ ఈ దేశపు, ఈ మహా ప్రాచీన సమాజపు పునాదులకు హాని కలిగిస్తున్నది.
ఈ దుర్వినియోగం ఏ అధికార సాధన కోసం, పరిరక్షణ కోసం, విస్తరణ కోసం చేస్తున్నదో, అవే లక్ష్యాల కోసం అధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా దుర్వినియోగపరుస్తున్నది. ఒకవైపు హిందూ మతానికి, మరొకవైపు దేశ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హాని చేస్తున్నది. పైన అనుకున్నట్లు, ఈ దేశ ప్రాచీనమైన మత-సంస్కృతులకు హాని కలిగించడమంటే దేశ పునాదులనే భంగపరచడమన్న మాట. ఇటువంటి దుర్మార్గాన్ని ఇంతకుముందు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయలేదు. దీనిని మొత్తం చరిత్రలోనే అతిహీన ప్రభుత్వంగా అభివర్ణించటం అందువల్లనే.
ఈ మూడు దుర్వినియోగాలను ఇప్పుడు కేంద్రం మన తెలంగాణ పట్ల కూడా అమలు చేస్తున్నది. వలస పాలననుకూల దోసిన తర్వాత మన స్వతంత్ర భారత ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ప్రస్తుతం మనం ఒక అంధకార దశను అనుభవిస్తున్నాము. దీనిని అర్థం చేసుకొని ఎదుర్కొనవలసిన అవసరం, బాధ్యత మనపై ఉన్నది.
ఈ మూడు దుర్వినియోగాలు కూడా దేశానికి నష్టం కలిగించేవే. కాని, అన్నింటికన్న తీవ్రమైన, అతి ప్రమాదకరమైన నష్టం మతాన్ని దుర్వినియోగ పరచటం. అధికార, ప్రజాస్వామ్య దుర్వినియోగాలు దేశ వ్యవస్థలను నష్టపరుస్తాయి. అవి ఒక భవనంలోని ఉపరితల నిర్మాణాల వంటివి. అందుకు భిన్నంగా మతం అన్నది ఒక దేశపు, ఒక సమాజపు సుదీర్ఘ చరిత్ర, సంస్కృతులతో, ప్రజల నిత్య జీవితాలు, విశ్వాసాలతో పెనవేసుకుపోయిన పునాది వంటిది.
టంకశాల అశోక్