హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కావాలనే ఎన్నికల బాండ్ల అమ్మకాల గడువును పొడిగించడాన్ని మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేంద్రంలోని అధికారపార్టీకి ‘మితిమీరిన అవకాశం’ ఇచ్చినట్లేనని విశ్లేషించారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సినవారు మిన్నకుండి పోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ ఎన్నికల నిధి’ ఏర్పాటే దీనికి పరిష్కారమని అంటున్నారు!
మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఈ.ఏ.ఎస్.శర్మ తాజా ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని నిరోధించమని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) కోరారు. కేంద్రం అమలుచేయకూడని సమయంలో, అసంబద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన అభివర్ణించారు. ఇది కేంద్రంలోని అధికార పార్టీకి ‘మితిమీరిన అవకాశం’ ఇచ్చినట్లని ఆయన విమర్శించారు.
కేంద్రం చేసిన సవరణ ప్రకారం నిర్దేశిత ఎస్బీఐ శాఖల్లో ఈ ఏడాది అదనంగా 15 రోజుల పాటు ఎన్నికల బాండ్ల అమ్మకాలకు అనుమతి మంజూరైంది. కానీ ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికలు జరిగే సంవత్సరంలో జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ప్రతి నెలా 10 రోజుల చొప్పున ఈ బాండ్లు అమ్మడానికి వీలుండేది. కానీ హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలోనే కేంద్రం తాజా సవరణ చేయడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 10 వరకు జరిగిన ఎన్నికల ప్రచారంపై ఈ బాండ్ల విక్రయాలు తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ బాండ్లకు వ్యతిరేకంగా 2017లో సీపీఎం, కామన్ కాజ్, ఏడీఆర్ సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై డిసెంబర్లో సుప్రీం కోర్టులో వాదనలు జరగనున్నాయి. తాజాగా చేసిన సవరణను సీపీఎం, ఏడీఆర్ వ్యతిరేకించాయి. మాజీ సీఈసీలు కృష్ణమూర్తి, రావత్‌లు సైతం తాజా సవరణను వ్యతిరేకించారు. దీనిగురించి ‘టెలిగ్రాఫ్’ పత్రిక అడిగిన ప్రశ్నలపై సీఈసీ ఇంకా స్పందించలేదు.
‘తాజా సవరణ ద్వారా కేంద్రంలోని అధికార పార్టీ అత్యున్నత న్యాయస్థానంలో కొనసాగుతున్న విచారణను పట్టించుకోకుండా, బహిరంగంగా ఎన్నికల నైతిక ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించింది. అధికారపార్టీ పారదర్శకత లేని విధానంలో విరాళాలను పొందేందుకు తలుపులు బార్లా తెరిచింది. క్షేత్రస్థాయిలో ఇతర పార్టీలు చేసే పోరాటాన్ని దెబ్బతీయడానికే కేంద్రం ఇలా చేసింది’ అని శర్మ విమర్శించారు. ఈ విషయంలో తక్షణమే కేంద్రానికి సీఈసీ షోకాజ్ నోటీస్ జారీ చేయవచ్చని ఆయన అన్నారు. సవరణలో తెలిపిన గడువు పూర్తయ్యేలోగానే ఆ సవరణనను రద్దుచేయాలని ఆయన కోరారు. అది వీలుకాకపోతే ఎన్నికల షెడ్యూల్‌నే రద్దుచేయాలని సూచించారు. లేకపోతే సీఈసీనే అధికారపార్టీకి మితిమీరిన అవకాశాన్ని ఇచ్చినట్లవుతుందని, దీనిద్వారా ఆ పార్టీ మిగతా పార్టీలకు లేని అవకాశాలను సొమ్ము చేసుకొని లాభపడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2017-18 నుంచి 2020-21 మధ్య కాలంలో బీజేపీ రూ.4.23 వేల కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను విరాళాలుగా పొందింది. అంటే మూడేండ్లలోనే 65 శాతం అధికంగా విరాళాలను పొందింది. ఇదే సమయంలో రూ.716 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ కంటే కమలం పార్టీకి ఆరు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి.
ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో ప్రారంభించారు. ఏటా కేంద్రం నిర్దేశించినట్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పదిరోజుల పాటు భారతీయ పౌరులు వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల సంవత్సరంలో కేంద్రం ఈ సమయాన్ని మరో 30 రోజులు పొడిగించవచ్చు. బాండ్లను కొన్న వ్యక్తి వివరాలను బయటకు వెల్లడించరు. ఈ బాండ్లను రాజకీయపార్టీలు నగదుగా మార్చుకోవచ్చు. తాజా అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందడానికి అర్హత కలిగి ఉంటాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకే కేంద్రం ఎన్నికల బాండ్ల అమ్మకాలను పొడిగించిందని మాజీ సీఈసీ రావత్ టెలిగ్రాఫ్‌కు తెలిపారు. ‘ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. లెక్కించని, లెక్కలో రాని ధనాన్ని రాజకీయ వ్యవస్థలోకి వరదలాగా పారించడంలో ఇది మరో ముందడుగు మాత్ర మే. ఇకపై పార్టీలకు వచ్చే విరాళాల్లో పారదర్శకత ఉందా అన్న ప్రశ్నే ఉండదు. రెండు రాష్ర్టాల్లో ఎన్నికల నైతిక నియమావళి అమల్లో ఉందని చెప్పడం వృథా. దీనిపై చర్యలు తీసుకోవాల్సినవారే మిన్నకుండి పోయారు’ అని ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగ్దీప్ చొక్కర్ వ్యాఖ్యానించారు.
‘ఎన్నికల నిధుల కోసం నేను ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ఆమోదించను, అంగీకరించను. మనం జాతీయ ఎన్నికల నిధిని ఏర్పాటుచేసి ప్రజలందరూ ఆ నిధికే విరాళాలు ఇచ్చేట్టు చేయాలి. ఈ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలి. ఇలా చేస్తే దాతలు, రాజకీయపార్టీల మధ్య ఉన్న (అనైతిక) అనుబంధం పూర్తిగా కుప్ప కూలిపోతుంది’ అని మాజీ సీఈసీ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
(‘ది టెలిగ్రాఫ్’ సౌజన్యంతో)
ఎన్నికల నైతిక నియమావళి ఎన్నికలను ఎదుర్కోబోయే ప్రభుత్వం ప్రకటించే ‘ఆర్థిక నిధులను’ మాత్రమే నిషేధిస్తుందని శర్మ టెలిగ్రాఫ్‌కు తెలిపారు. ఎన్నికల నైతిక నియామావళి అమలులో ఉన్నప్పుడు ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రభుత్వం ఎలాం టి చర్యలు తీసుకున్నా వాటిని ప్రశ్నించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫెరోజ్ ఎల్.విన్సెంట్