మట్టి పోరాటం విత్తుకు తెలుసు
తన కోసం శరీరాన్ని చీల్చి
జన్మనిచ్చిందని
విత్తు పోరాటం చెట్టుకు తెలుసు
పొట్టను చీల్చి తనకు
లోకాన్ని చూపించిందని
చెట్టు త్యాగం పిట్టకు తెలుసు
ఎగరడంతో పాటు ఆకాశాన్ని
ఈదడం నేర్పిందని.
ఏ సంకల్పమూ మాటల్లో పుట్టదు
దీక్ష పట్టిన పిడికిలి కావాలి
పచ్చని తివాచీలు పరిచే ఊళ్ళు
ఎడారి మొఖాలై నవ్వడం ఎంత విషాదం
కొంగుపరిచి చెమట తుడిచి
సేద తీర్చే గూడెంలు
గడ్డి మొలవని బీళ్లు కావడం
ఎంత వినాశకరం
మాటల్లోంచి, మనసులోంచి
చేతల్లో ఆ సంకల్పం గట్టిపడి ఉంటది
ఊరు గోసను అరచేతిలో పట్టివుంటది
అడవి శోకం గొంతునిండా
గటగటా తాగి ఉంటది
తెల్ల రంపాల నల్ల గొడ్డండ్ల చావును
చప్పరించడానికి విత్తనం
ప్రతిజ్ఞ చేసి ఉంటది
ఇపుడు లోకమంతా
ఆ ప్రజా సంకల్పం కలల ముచ్చట్లే…
డాక్టర్ ఉదారి నారాయణ: 94414 13666