‘మత విద్వేషం-ఆర్థిక అసమానత్వం- అప్రజాస్వామికం-ప్రభుత్వ ఆస్తుల అమ్మకం-రూపాయి పతనం-రైతులు, కూలీల ఆదాయాలు పాతాళానికి- ఖర్చులు ఆకాశానికి- రాజ్యాంగ వ్యవస్థలతో విపక్షాలపై దాడులు-ప్రజాప్రతినిధుల వేలం-ప్రభుత్వాల విధ్వంసం… ఇలా ఆసేతు హిమాచల పర్యంతం ముసిరిన ఈ చీకట్లలో, దారీ, తెన్నూ కనబడక కలవరపడుతున్నది భరతమాత!
‘తాతయ్యా! మరి భగవద్గీత 4-7, 8లో ధర్మానికి హాని కలిగినప్పుడల్లా దుష్ట శిక్షణార్థం తాను అవతరిస్తానన్నాడు గదా పరమాత్మ! మరి ఈ గాఢాంధకార కారకులను శిక్షించి, భరతమాతను కాపాడేందుకు మరో అవతార పురుషునిగా రావాలి గదా?’
‘నాజీ హిట్లరును సమైక్యంగా ఎదుర్కొనకపోతే యావత్ ప్రపంచం కనీసం శతాబ్ది కాలం వెనక్కి నెట్టబడుతుంది’ అని హెచ్చరించాడు నాడు స్టాలిన్. ‘బీజేపీ నుంచి భరతమాతకు విముక్తి కలిగించకుంటే వందేండ్లకూ కోలుకోలేనంతగా మన దేశం నష్టపోతుందని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు నేడు కేసీఆర్.
‘చూడు చిన్నా! అవతార పురుషుడంటే, రాముడు, కృష్ణుడు, బుద్ధుడనే ఆలోచించరాదు. ఎందుకంటే ఆయా కాలాలకనుగుణంగా, తన శక్తియుక్తులను, మంచితనాన్ని నిర్దిష్ట చారిత్రక వ్యక్తుల ద్వారా ప్రదర్శిస్తూ మానవాళిని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుకుంటాడు పరమాత్మ. ఉదాహరణకు గాంధీ-నెహ్రూ; లెనిన్-స్టాలిన్; వాషింగ్టన్-అబ్రహం లింకన్ మొదలైన మహానేతలు ఆయా కాలాల్లో చారిత్రక అవసరాల కోసం, మెండుగా పరమాత్ముడి అండతో జన్మించినవారే. భారత స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీ, ఆంధ్రరాష్ర్టాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు, తెలంగాణను సాధించిన కేసీఆర్ మొదలైనవారంతా ఆ కోవకు చెందినవారే! ప్రాణులు, మనుషులంతా పరమాత్మ నుంచి జన్మించినవారే! కానీ, తన సృష్టిని స్వచ్ఛందంగా కొనసాగించుకోవటానికి స్త్రీ, పురుషుల్లో బలీయమైన లైంగికవాంఛను నిక్షిప్తం చేసినట్లే- మానవాళిని, దేశాన్ని, రాష్ర్టాన్ని ఉద్ధరించాలన్న బలీయమైన వాంఛను, శక్తియుక్తులను ప్రజలను చైతన్యవంతం చేసి వారి సమస్యలను పరిష్కరించగలిగే జ్ఞానాన్ని గూడ నిక్షిప్తం చేసి, కొందరిని మానవ మహోపకారులుగా రూపొందిస్తుంటాడు పరమాత్మ!
అందువల్లనే కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించటమే గాక దాని చీకట్లను తొలిగించి, ప్రగతిపథాన నడిపించగలుగుతున్నారు. తను రూపొందించుకున్న ‘వ్యవసాయ, పారిశ్రామిక, ప్రగతి’ ఖడ్గంతో, దేశాన్ని ముసిరిన చీకట్లను గూడ ఛేదించి, భరతమాతను వెలుగుపూలు, ప్రగతి ఫలాలతో భాసింపజేసి, మాతృదేశం రుణం తీర్చుకునేందుకు సంసిద్ధులయ్యారు కేసీఆర్. ఈ లక్ష్య సాధన కోసం ‘బీఆర్ఎస్’ భానుని అందిస్తున్న ఉషోదయమే, మునుగోడు ప్రజా విజయం.
‘నాజీ హిట్లరును ప్రపంచదేశాల వారందరం సమైక్యంగా ఎదుర్కొందాం. లేదంటే హిట్లర్ దురాక్రమణకు గురై యావత్ ప్రపంచం కనీసం శతాబ్ది కాలం వెనక్కి నెట్టబడుతుంది’ అని హెచ్చరించాడు నాడు స్టాలిన్.
‘దురాక్రమణదారులైన మోదీ, షాలను రాష్ర్టాలు-పార్టీలు-మీడియా మేధావులు- న్యాయవ్యవస్థ- ప్రజలు అందరం సమైక్యంగా ఎదుర్కొందాం. బీజేపీ నుంచి భరతమాతకు విముక్తి కలిగించకుంటే వందేండ్లకూ కోలుకోలేనంతగా మన దేశం నష్టపోతుందని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు నేడు కేసీఆర్. నీకు ఇది తెలుసు కదా చిన్నా!’
‘కేసీఆర్ చెప్తున్నది వాస్తవమే తాతయ్యా! కానీ ఆయన కూడా ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు కదా. మరి, టీఆర్ఎస్ నేతలను తాము చేర్చుకుంటే తప్పేమిటి? అని బీజేపీ వారు ప్రశ్నిస్తున్నారు. మా విధానాలు తప్పయితే నిన్నటిదాకా పార్లమెంటులో మా ప్రభుత్వం తెచ్చిన బిల్లులను, చట్టాలను ఎందుకు ఆమోదించారు? అంటూ బీజేపీతోపాటు టీవీ ఛానెళ్ళు గగ్గోలు పెడుతున్నయ్ కదా?’
‘నిజమే బాబూ! ఇలాంటివి విమర్శనాత్మకాలే, కానీ అనివార్యాలన్న వాస్తవం నీకు తెలియాలంటే చరిత్రలోకి తొంగిచూడాల్సిందే. ఉదాహరణకు నాడు కొత్తగా రూపొందించుకున్న సోషలిస్టు రష్యాకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి.
1. తన కాళ్ల మీద తాను నిలబడగలిగేలా శక్తిని కూడదీసుకోవటం.
2. దేశంలోని సోషలిస్టు వ్యతిరేకులు జరుపుతున్న కుట్రలు, అంతర్యుద్ధాల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం.
3. సరిహద్దు దేశాలతో సామరస్యాన్ని పెంపొందించుకోవటం.
అందుకే నాడు ప్రపంచదేశాల, పాశ్చాత్య మీడియా విమర్శలను గాలికొదిలేశాడు స్టాలిన్. నమ్మదగినవాడు కాకున్నా సరే, నాజీ హిట్లర్ స్వాగతించగానే అతనితో నిర్యుద్ధ సంధికి అంగీకరించాడు. తద్వారా జర్మనీకి ఆహారధాన్యాలను ఇస్తూ, ఆ దేశం నుంచి యంత్రాలను తీసుకునే ఒప్పందానికి 1939లో అంగీకరించాడు స్టాలిన్. ఈ సంధికాలాన్ని స్టాలిన్ పలు విధాలుగా ఉపయోగించుకున్నారు. 1. వ్యవసాయికంగా, పారిశ్రామికంగా దేశాన్ని పటిష్ఠపరిచారు. 2. అంతర్యుద్ధాలను అణిచివేసి, ఇంటిపోరు లేకుండా చేశారు. 3. తన నిజాయితీ, శక్తియుక్తులతో పశ్చిమ ఉక్రెయిన్-పశ్చిమ బైలో రష్యా- లాత్వియా-లిథువేనియా, ఎస్తోనియా వంటి సరిహద్దు దేశాలు స్వచ్ఛందంగా సోవియట్ రష్యాలో విలీనమయ్యేలా చూశారు. దేశ సరిహద్దుల్ని మరింత పటిష్ఠపరిచారు. 4. సంధిని అతిక్రమించి దాడి చేసినా హిట్లరును తట్టుకోవటానికి ట్యాంకులు-ట్యాంకు విధ్వంసక ఫిరంగులు-టైంబాంబర్ల వంటి శక్తిమంతమైన ఆయుధాలను భారీ ఎత్తున తయారు చేయించారు. ఆయన దార్శనికత ఎంత గొప్పదో కాలం రుజువు చేసింది. సంధి అమలులో ఉన్నప్పటికీ, 1941 జూన్లో ఒక రోజు రాత్రి ఆకాశమార్గాన విమానాల ద్వారా హిట్లర్ సేనలు సోవియట్ రష్యాపై విరుచుకుపడ్డాయి. దానికి సిద్ధంగా ఉన్న సోవియట్ సేనలు నాజీ సేనలను ఎదుర్కొని రష్యాను కాపాడుకోవటమే గాక, హిట్లర్ ఆక్రమించిన ఐరోపా దేశాలన్నింటినీ విముక్తం చేశాయి. హిట్లర్ను జర్మనీ దాక తరిమేశాడు స్టాలిన్. అలా నాజీ హిట్లర్ ఫాసిజం బారి నుంచి, తన మాతృదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్నే కాపాడి, చారిత్రక యుగపురుషునిగా కీర్తించబడ్డాడు స్టాలిన్. దటీజ్ స్టాలిన్!
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి, కేసీఆర్కు సరిగ్గా అలాంటి సవాళ్లే ఎదురైనయి. అందుకే కేసీఆర్ కూడా మీడియా, ప్రతిపక్ష పార్టీల కువిమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రభుత్వ పరిరక్షణ-తన రాష్ట్ర ప్రగతి సాధన అనే రెండు లక్ష్యాల సాధన కోసం నిర్విరామంగా శ్రమించారు. 1. పలు సమస్యల సంక్షోభం నుంచి నూతన తెలంగాణను గట్టెక్కించటం 2. వ్యవసాయికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవటం 3. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనైనా సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కాంగ్రెస్, టీడీపీల అంతర్గత కుట్రల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం 4. అరకొర నిధులిస్తూ తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి, రాష్ర్టాన్ని ఆక్రమించాలన్న బీజేపీ ఢిల్లీ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవటం.
దీనికోసమే, తప్పనిసరై బీజేపీతో మైత్రిని కొనసాగించారు కేసీఆర్. కేంద్రంలో వాళ్ళ బిల్లులకు మద్దతిస్తూ, రాష్ర్టానికి రావాల్సిన నిధులను, వివిధ ప్రాజెక్టుల అనుమతులను రాబట్టుకున్నారు. తద్వారా దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను అభివృద్ధి చేశారు. శత్రువు దెబ్బను కాచుకోవటం కన్నా శత్రువును ముందే దెబ్బతీయటం క్షేమదాయకమని గ్రహించిన కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీల నేతలను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకొని తన ప్రభుత్వాన్ని పటిష్ఠం చేసుకోవటమే గాక, శత్రువులను ఆత్మరక్షణలో పడేశారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించాలనుకున్న కుట్రలను ఈ విధంగా చిన్నాభిన్నం చేశారు. దటీజ్ కేసీఆర్.
నాడు అకారణంగా సంధిని అతిక్రమించి రష్యాపై విరుచుకుపడ్డ నాజీ హిట్లర్ అంతర్జాతీయ దురాక్రమణదారుడిగా నగ్నంగా బయటపడిపోయాడు. ప్రపంచంలో స్టాలిన్ రష్యాకు ఇది నైతిక విజయంగా పరిణమించింది. అలాగే మునుగోడులో కృత్రిమ ఎన్నికను సృష్టించి కేసీఆర్ను దెబ్బతీయాలనుకోవటమే గాక, అదే సమయాన స్వాముల ముసుగులో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చిన బీజేపీ.. అంతర్రాష్ట్ర దురాక్రమణదారుగా నగ్నంగా పట్టుబడింది. జాతీయంగా కేసీఆర్ బీఆర్ఎస్కు ఇదే నైతిక విజయంగా పరిణమించుగాక! తథాస్తు! భరతమాతకు శుభమస్తు’!.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
నాజీ హిట్లర్ ఫాసిజం బారి నుంచి, తన మాతృదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్నే కాపాడి, చారిత్రక యుగపురుషునిగా కీర్తించబడ్డాడు స్టాలిన్. దటీజ్ స్టాలిన్! కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను అభివృద్ధి చేశారు. శత్రువు దెబ్బను కాచుకోవటం కన్నా శత్రువును ముందే దెబ్బతీయటం క్షేమదాయకమని గ్రహించిన కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీల నేతలను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకొని తన ప్రభుత్వాన్ని పటిష్ఠం చేసుకోవటమే గాక, శత్రువులను ఆత్మరక్షణలో పడేశారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించాలనుకున్న కుట్రలను ఈ విధంగా చిన్నాభిన్నం చేశారు. దటీజ్ కేసీఆర్.
పాతూరి వేంకటేశ్వరరావు: 98490 81889